శ్రీ హరివంశం ఇతిహాసం. మూడు పర్వాలతో కూడిన ఈ ఇతిహాసంలో పన్నెండు వేల శ్లోకాలున్నాయి. అయితే ఇందులో పురాణపురుషుల దివ్యచరిత్రలు ఉండటం వల్ల ఇది పురాణమే అని చెప్పే వారూ ఉన్నారు. హరివంశం భగవానుడి విశ్వత్వ, హరిత్వ, వైకుంఠత్వాలు ప్రస్తావించింది.
ఎర్రన హరివంశం ఉత్తర భాగంలో పంచమ వేదమైన భారత పఠనం, శ్రవణంతోపాటు భారతంలోని ఏ ఏ పర్వాలు చదివితే ఏం చేయాలో ప్రస్తావించాడు. అవేంటో చూద్దాం...
ఆదిపర్వం విన్న తర్వాత మేలైన దుంపలు, పండ్లు, నెయ్యి, తేనెలతో కూడిన పరమాన్నంతో బ్రాహ్మణులను సంతృప్తిపరచడం ధర్మమని ఎర్రన పేర్కొన్నాడు.
సభాపర్వం విన్న తర్వాత హవిస్సుని ఇవ్వాలి. అంటే అన్నం నెయ్యి. అరణ్య పర్వం విన్న తర్వాత పరిపక్వమైన పండ్లను, మేలైన దుంపలను చల్లని నీటితో కూడిన పాత్రలతో అన్ని విధాల సంతృప్తి కలిగించే భోజనాన్ని ఇష్టంతో పెట్టాలి. ఉద్యోగపర్వం పూర్తయిన సందర్భంలో విప్రులకు అప్పుడే తీసిన గంధాన్ని, అప్పుడే కట్టిన పూల దండలను, రకరకాలైన ఆహార పదార్థాలను తృప్తి కలిగేలా సమర్పించాలి. భీష్మపర్వం తర్వాత రసవంతమైన పరిమళభరితమైన అమృతంతో సమానమైన అనేక రకాల పానీయాలతో అత్యంత ఇష్టమైన భోజనం పెట్టి సంతృర్తి పరచాలి. ద్రోణపర్వం తర్వాత బ్రాహ్మణులకు వారు కోరిన ఆహారాన్ని పెట్టి విండ్లు ఇత్యాదులను దానం చేయాలి. కర్ణపర్వాన్ని విన్న తర్వాత బ్రాహ్మణోత్తములకు భోజనం పెట్టాలి. శల్యపర్వం తర్వాత భక్ష్యాలు, లడ్డూలతో, నేతితో కూడిన రుచికరమైన భోజనం పెట్టాలి. సౌస్తిక పర్వం తర్వాత నెయ్యి పెసరపప్పుతో వండిన పదార్థాలను సాటి లేని భోజనాన్ని ఇష్టంగా పెట్టాలి. స్త్రీపర్వం తర్వాత శక్తికొద్దీ రత్నాలను ఇవ్వాలి, అటుతర్వాత మిక్కిలి భక్తితో నియమంతో వారికి సంతృప్తిగా భోజనం పెట్టాలి. శాంతిపర్వం, అనుశాసనిక పర్వం తర్వాత శుభకరమైన దక్షిణలు ఇవ్వాలి. నెయ్యితో కూడిన మెత్తని హవిస్సును సమర్పించాలి. అశ్వమేధపర్వం, శ్రమవాస పర్వం పూర్తిన తర్వాత బ్రాహ్మణులు కోరుకున్న భక్ష్యాలతో భోజ్యాలతో అన్నం పెట్టాలి. మౌసల పర్వం, మిగిలిన రెండు పర్వాలు (మహప్రస్థానం, స్వర్గారోహణ) తర్వాత ఒక్కొక్క దానికి సమానంగా గంధపు పూతలను పూలమాలలను వస్త్రాలను ఇచ్చి మేలైన భోజనాన్ని పెట్టాలి. ఇలా చేస్తే భారత కథకుడు, పౌరాణికుడు సంతుష్టి చెందడం వల్ల బ్రహ్మ తదితర దేవతలు సంతృప్తిని పొందుతారు. అంతేకాదు, ఆ మేరకు పురోగతి కూడా ఉంటుంది.
ఏ పర్వానికి -ఏం చేయాలి;- - యామిజాల జగదీశ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి