న్యాయాలు-604
ప్రతినిధి న్యాయము
**"**
ప్రతినిధి అనగా బదులుగా ఉండు వాడు అని అర్థము.
ఈ ప్రతినిధికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి.ఏజెంట్, కమీషనర్, సలహాదారు, డిప్యూటీ,న్యాయ వాది, శాసన సభ్యుడు, సభ్యుడు, సెనేటర్, మెసెంజర్, ప్రాక్సీ,విక్రయదారుడు లాంటి పర్యాయ పదాలు ఉన్నాయి.
ఇలా ప్రతినిధి అనగా ఒకరికి బదులుగా నుండు వానికి లేదా నియమింప బడువానికి ప్రతినిధి యని పేరు.
అలాగే ఏదైనా వస్తువు లోపించినప్పుడు గానీ, దొరకనప్పుడు గానీ ఆ స్థానంలో మరొక వస్తువును కల్పించుకుని ప్రారబ్ధక్రియా పరి సమాపమునకు పూను కొనుట అనేది ఈ న్యాయము యొక్క అంతరార్థం.అంటే ఒక పనికి సంబంధించిన వస్తువు బదులుగా మరొక వస్తువును ఉపయోగించి పూర్తి చేయడం.
ఈ విధంగా ప్రతినిధి మరొకరికి లేదా ఇతరులకు అనగా వ్యక్తుల సమూహమునకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా లేదా వస్తువుగా వుంటారు.అయితే ఇందులో అధికారిక ప్రతినిధి.అధికారికంగా ఆయా పనులను పూర్తి చేయడానికి నియమింపబడిన వ్యక్తి.ఇక శాసన సభ్యునిగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి కూడా వుంటాడు. అతడు రకరకాల పనుల నిర్వహణలో వ్యక్తి లేదా వ్యక్తుల తరపున పని చేయడానికి ఎంచుకున్న వ్యక్తి అన్న మాట.ఇతడు ఆయా వ్యక్తి లేదా వ్యక్తుల తరఫున నిర్ణయాలు తీసుకోవడానికి ఎంపిక చేయబడతాడు.
ఇలాంటి ప్రతినిధులను ముఖ్యంగా రాజకీయాల్లో, క్రీడల్లో, వివిధ రకాల ఉద్యమాల్లోనూ , ముఠాల్లోనూ చూస్తూ వుంటాం.
ప్రజాస్వామ్యంలో అయితే ప్రతినిధులతో కూడిన ప్రాతినిధ్యం ఉంటుంది.దీనినే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు. అనగా ప్రజలు ఏవైనా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనరు.అనగా ప్రత్యక్షంగా నిలబడి, నిలబెట్టి ఎంచుకోవడం కాకుండా పరోక్షంగా ఎంచుకోవడం.అంటే ప్రజలు తమ ప్రతినిధులను పరోక్షంగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. అలా ఎన్నుకున్న ప్రతినిధులు సమావేశమై తమను ఎన్నుకున్న ప్రజల అవసరాలపై దృష్టి పెట్టి వివిధ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
ఆస్తి, కుటుంబ సంబంధమైన తగాదాలపై కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ తరఫున మాట్లాడడానికి, వాదించడానికి ఎంపిక చేసుకునే వ్యక్తిని న్యాయ వాది అంటారు.
పాఠశాల ప్రతినిధి ప్రధానోపాధ్యాయులు అని చెప్పవచ్చు. ఎందుకంటే పాఠశాలకు చెందిన అవార్డులు,రివార్డులు ఏవైనా ఉంటే వాటిని తానే తీసుకుంటాడు.ఎందుకంటే పాఠశాలకు ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి.
ఈ ప్రతినిధులు కుటుంబం తరపున,సంస్థ తరపున, వైద్యంలో రోగి తరపున .. ఇలా అనేక రకాలైన ప్రతినిధులు ఉంటారు.
ప్రతినిధి అంటే మనకు ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది కాబట్టి,వస్తువులకు బదులుగా మరొక దానిని ప్రత్యామ్నాయ ప్రతినిధిగా ఉపయోగించుకోవడం తెలుసు కాబట్టి మరి మనం దేనికి ప్రతినిధిగా ఉండాలో యోచన చేద్దాం.అలా చేయాలనే ఉద్దేశ్యంతోనే మన పెద్ద వాళ్ళు ఈ న్యాయమును మనకు పరిచయం చేశారు.
మనం అగ్ని మాపక సిబ్బందిలాగానో, మన దేశ రక్షణ కోసం అహర్నిశలు కంటి మీద కునుకు లేకుండా పహారా కాసే సైనికుల వలెనో, మనందరి ఆకలి తీర్చే రైతులుగానో , విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే ఉపాధ్యాయులుగానో.. ఇలా మన వృత్తి, ప్రవృత్తి రీత్యా ఉంటాం.
అలాగే ధర్మానికి, న్యాయానికి ,పరోపకారానికి , పర్యావరణ పరిరక్షణకు ప్రతినిధిగా మనం ఉన్నప్పుడే ఈ "ప్రతినిధి న్యాయము"నకు న్యాయము జరుగుతుంది. మీరూ నాతో ఏకీభవిస్తారు కదూ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి