సునంద భాషితం;- వురిమళ్ల సునంద, అర్కెన్సాస్ అమెరికా
 న్యాయాలు -591
పవన తాడన న్యాయము
****
పవన అనగా గాలి, వాయువు,తూర్పార బోయుట,ఆవము, పవిత్రము చేయుట, నీరు.తాడన అనగా కొట్టుట  అని అర్థము.
 పవన తాడన అనగా గాలిని కొట్టడం.నిజంగా  గాలిని కొట్టగలమా? కంటికి కనిపించకుండా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా, కదిలే ఆకు, చిరునవ్వుతో  ఏదో వింటున్నట్టుగా తల ఊపే పువ్వు ద్వారా తన ఉనికిని తెలుపుకుంటూ  వుంటుంది.పంట చేలపై పైరగాలిగా చిలిపిగా చెవి దగ్గర జుట్టును కదిలిస్తూ చెక్కిలిని సుతారంగా మీటే పిల్ల తెమ్మెరగా,సుమ  సౌరభాలను మోసుకొచ్చి నాసికలకు బహుమతిగా ఇచ్చే ఆత్మీయతా గాలి గురించి ఎంత చెప్పినా తక్కువే.
 బయట గాలే. లోపల ఉండేది గాలే. ఉండలేనని బయటికే వచ్చేసిందా? ఇక ఆ వ్యక్తి అధ్యాయం ముగిసినట్లే. మరలాంటి గాలిని క్షణమైనా నిలకడ లేకుండా తిరిగే పవనాన్ని కొట్టడం సాధ్యమా? కాదని కొందరు,అవునని మరికొందరు అంటుంటారు.ఎందులోనైనా గాలిని కొట్టగలం కానీ గాలిని పట్టుకొని కొట్టలేం కదా! అంటారు కొందరు.
అవుననే వారి మాటల్లో గాలిని ఏ బెలూన్ లోనో,ట్యూబుల్లోనో బంధించి దానిపై కొట్టి గాలిని కొట్టిన అనుభూతి పొందొచ్చు కదా! అని.
 ఇంకా కొందరు ఈ గాలి గురించి వేసే యక్ష ప్రశ్నలు, వాటికి సమయోచితంగా చెప్పే సమాధానాలు కూడా ఉంటాయి. అవేంటో కూడా చూద్దాం. గాలిని చూడగలవా? అని అడిగితే చూడగలం అని చెప్పొచ్చు.ఎండాకాలంలో  మన కళ్ళ ముందే  సుడులతో తిరిగే గాలి. ఇది చెత్తాచెదారాన్ని , దుమ్ము ధూళిని పైకి లేపుతూ  గిరగిరా తిరుగుతూ వుంటుంది.అలా సుడి గాలి రూపంలో  గాలిని ప్రత్యక్షంగా చూడగలం.
 ఇక గాలి చేసే శబ్ధం కూడా వినగలం. అప్పుడప్పుడు తుఫాన్ వచ్చే సమయంలో గాలికి చెట్లు కదులుతూ వుంటే పెద్ద శబ్దం వస్తుంది.అలా గాలిని  వినవచ్చు. ఇక గాలి వాసనను రకరకాలుగా చూడొచ్చు.పూల తోటలో  ఒకలాగా, మురికి కాలువ పారే చోట మరో లాగా..ఇలా గాలిని చూడటం, వినడం,వాసన చూడటం చేయవచ్చని... యక్ష ప్రశ్నలకు కాసింత బుర్ర పెట్టి చెప్పొచ్చు అంటారు కొందరు.
 ఏది ఏమైనా కంటికి కనిపించని గాలిని, కేవలం స్పర్శ ద్వారా అనుభూతి పొందే గాలిని ప్రత్యక్షంగా కొట్టడం అసాధ్యం. అందుకే మన పెద్దవాళ్ళు  ఈ న్యాయమును నీతీ నిజాయితీ మానవీయ విలువలు కలిగిన వ్యక్తులకు ఆపాదించి వారిని ఇబ్బంది పెట్టడం అసాధ్యమని, ఒకవేళ వారికి నష్టం, కష్టం కలిగించాలనుకుంటే పైన చెప్పిన విధంగా అలా వారిని యిబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టడమేననే అర్థంతో ఈ "పవన తాడన న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 కాబట్టి మనం గాలిని కొట్టాలన్న గాలి ఆలోచన మానేసి గాలిని రకరకాలుగా ఆస్వాదిద్దాం. మన మంచితనపు గాలి నలువైపులా వీచేలా నడుచుకుందాం.మీరేమంటారు?

కామెంట్‌లు