కుంటాల మండలం లోని లింబా (కె) గ్రామానికి చెందిన శ్రీ ఏనుగు బాజారెడ్డి శ్రీమతి ఏనుగు నర్సుబాయి, శ్రీ ఏనుగు చిన్నారెడ్డి పుణ్య దంపతులకు 15 జనవరి 1966 సంవత్సరం లో జన్మించారు. ఉన్నత విద్య అభ్యసించిన వీరు 10 ఫిబ్రవరి 1987 లో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో చేరారు.చిత్తశుద్ధి,అంకిత భావంతో వృత్తినే దైవంగా భావిస్తూ, మూడు దశాబ్దాలకు పైగా వివిధ పాఠశాలల్లో పనిచేసి ఎందరో విద్యార్థినీ,విద్యార్థులకు చక్కని బోధనతో తీర్చిదిద్దుతూ ప్రస్తుతం భైంసా మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేగాంలో తెలుగు ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. బాల్యం నుండే చురుకుదనం గలవారైనందున విద్యార్థి దశలోనే నాయకుడు గా ఉంటూ విద్యార్థుల యొక్క పలు సమస్యలపై చర్చించి పరిష్కారం దిశగా ఆలోచించేవారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో మలి దశ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయం లో ఉద్యమానికి ఆకర్షితులై ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మొదట తన గ్రామం లోని యువకులతో సమావేశం నిర్వహించి, తెలంగాణ ఆవశ్యకతను వివరించి, వారిలో ఉద్యమ సెగలను రేకెత్తించారు. భైంసా పట్టణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణం ప్రాంతంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో యస్టీయు ఉపాధ్యాయ సంఘం తరపున దీక్షా శిబిరం లో ప్రతి రోజూ ప్రత్యక్షంగా పాల్గొని నిరాహార దీక్ష చేస్తూ ఎందరో ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచారు. ముధోల్ నియోజకవర్గం లో ఎక్కడ సమావేశాలు జరిగిన అక్కడ చురుకుగా పాల్గొని తన ఉపన్యాసాలతో తెలంగాణ ప్రాముఖ్యతను వివరించేవారు.వీరు చేస్తున్న పోరాటానికి మెచ్చుకొని కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి ఉద్యమ సంస్థకు నియోజకవర్గం కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించారు.తరువాత జాగృతి ఆధ్వర్యంలో బాసర లో అమ్మ వారి చెంత కవి సమ్మేళనం ఏర్పాటు చేయించి, నియోజకవర్గం లోని కవులు, కవయిత్రులు, కళాకారును సమీకరించి వారి చేత ఉద్యమ కవితలను,పాటలను వినిపింప జేసి ప్రజలను చైతన్య పరిచారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనానికి సైతం నియోజకవర్గం లోని కవులకు అవకాశం కల్పించి వారికి కల్వకుంట్ల కవిత గారిచేత కవితాంజళి జ్ఞాపికలను అందింప జేశారు.కవి సమ్మేళనం లో కడారి దశరథ్, గంగుల చిన్నన్న మొదలైన కవులు పాల్గొన్నారు.
ఉద్యమ సమయంలో ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, వంటా వార్పు మొదలైన కార్యక్రమాలను సైతం తన ఆధ్వర్యంలో చేపట్టి ఉద్యమాన్ని బలోపేతం చేశారు.బాసర రైల్ రోకో కార్యక్రమం లో పాల్గొని ఉద్యమానికి ఊపిరిలూదారు.హైదరాబాద్ లో జరిగిన మిలీనియం మార్చ్ లో మరియు సాగర హారం మొదలైన ప్రతి కార్యక్రమం లో పాల్గొని ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.రాజకీయ జేయేసి ఆద్వర్యంలోఎల్బీస్టేడియం ఎదురుగా ఉన్న నిజాం కాలేజీ గ్రౌండ్ లో జరిగిన పెద్ద సభకు శ్రీ సముద్రాల వేణుగోపాల చారి గారితో కలిసి తన అనుచరులతో వెళ్లారు. ప్రముఖుల ఉపన్యాసాలను విని ఉద్యమ కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్లారు.
ఉద్యమం లో భాగంగా ముధోల్ నియోజకవర్గం లో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సు యాత్ర లో పాల్గొని వారం రోజులు నియోజకవర్గం లోని ఎడ్ బిడ్, ఎల్వి,ఆష్టా, కౌటా,గొడిసెరా,బోసి ,కుంటాల,కల్లూర్,మొదలైన ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి తన దైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ఉద్యమ ఆవశ్యకతను వివరిస్తూ ఎందరినో ఉద్యమం వైపు ప్రభావితం చేశారు.
తానూర్ మండలం లోని బెల్తరోడా గ్రామ సభలో పాల్గొని ఉపన్యసించిన తీరు అందరినీ మంత్రముగ్ధులను చేసి ,ఎందరినో ఉద్యమం వైపు ఆకర్షింప జేసింది. బస్సు యాత్ర లో గొడిసెరా గ్రామం లోని గ్రామస్తులు , విద్యార్థి యువకులు ప్రత్యేకంగా హారతులు,డప్పు వాయిద్యాలతో స్వాగతం పలకడం మరచి పోలేని తీపి జ్ఞాపకం.
అలసట లేకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ వచ్చే వరకు ఉద్యమాన్ని నడిపారు .
అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు చురుకుగా ఉండే స్వభావం కలిగిన బాజారెడ్డి తన వృత్తి బాధ్యతను ధర్మబద్ధంగా నిర్వహిస్తూనే అవసరమైనప్పుడు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి చేత మన్ననలు పొందుతున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి