శ్రీరామ తత్వం;- సి.హెచ్.ప్రతాప్

 శ్లో:
రమన్తే యోగినోద్యనన్తే సత్యానన్దే చిదాత్మని ఇతి
రామపదేనాసౌ పరం బ్రహ్మాభితః ॥

అత్యున్నతమైన పరమ సత్యాన్ని రామ అని పిలుస్తారు అని పై శ్లోకం అర్ధం.
రామ నామానికి ఎంతో శక్తి, విశిష్టత, వరిష్ఠత, ప్రాభవం, వైభవం వచ్చాయి. ‘రామ’లో ‘ర’ అనే అగ్ని బీజం, ‘అ’ అనే సూర్య బీజం, ‘మ’ అనే చంద్ర బీజం ఉండటం చేత, పాపాలను శాపాలను తాపాన్ని చల్లార్చి హాయిని చేకూర్చుతుంది రామ నామం.తలపు, మాట, క్రియ ఈ మూడింటి ఏకత్వమే రామతత్త్వం. సర్వ వ్యాపకమైనది రామ తత్త్వం. సర్వ జీవితాంతరాత్మ తత్త్వమే రామతత్త్వం.దాంపత్య ధర్మాన్ని, కుటుంబ వ్యవస్థను, సోదర ప్రేమను, రాజధర్మాన్ని, ప్రజానురంజక పాలనను, వేద ధర్మాన్ని తన జీవన విధానం ద్వారా పరిపుష్టం చేసిన మహనీయుడు శ్రీరాముడు.విధిని అనుసరించి మాత్రమే జీవించాలని నిర్ణయించుకున్న మానవీయ, మహనీయమూర్తి శ్రీరామచంద్రమూర్తి.శ్రీరామచంద్రమూర్తి ఏ హృదయంలో ఉంటాడో వారి జీవితమే రామభక్తి సామ్రాజ్యం.భారతీయ తత్వాల యొక్క స్పష్టమైన వస్త్రంలో, భగవాన్ శ్రీరాముడు ఆదర్శవంతమైన ' మర్యాద పురుషోత్తమ'గా నిలుస్తాడు.రామావతారం లొ స్వామి పరిపూర్ణముగా మనవుడే , అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడి నని కాని , దైవత్వమును ప్రకటించడము కాని చేయడు . ఆయన ఆ అవతారం లో మానవునిగానే జీవించాడు.
శ్లో:
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
పరమశివుడు పార్వతీ దేవి తో చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసినదే ,శ్రీ రామ రామ రామ అని మూడు సార్లు జపిస్తే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలము వస్తుందనేది ఈ శ్లోక భావం .
 
కామెంట్‌లు