తాగే లీల్లక్కరువు
తినే తిండిక్కరువు
కట్టే బట్టక్కరువు
దమ్ముదీసే గాలిక్కరువు
కండ్లుల్ల లీల్లైనా తాగి బతుకుదామంటే
ఏడ్సిఏడ్సి సొమ్మసిల్లిన
కండ్లుల్ల లీల్లక్కరువు
మాటైనా మాట్లాడ్దామంటే
దిగమింగిన బాధకు
గుండె కుత్కెల్లకొచ్చి మాటల కరువు
గోదారి కిష్ణ, తుంగభద్రమ్మ
మంజీర, మూసీ, యీసా
ఏ పేరైతే నేమి
పారిపారి పారిపోయిన నదుల్ల లీల్లక్కరువు
బాయిలు, శెర్లు, కుంటలు, ఏర్లు
ఎక్కడి యయితేనేం
ఎండి నెర్రెలిచ్చిన భూతల్లిని తడిపే లీల్లక్కరువు
పనికి బియ్యం కరువు
పండిచ్చే పంటకు గిట్టుబాటు ధర కరువు
పరిశుభ్రతక్కరువు పచ్చదనానిక్కరువు
కరంటుక్కరువు పచ్చదనానిక్కరువు
నౌకిరీలక్కరువు భాషక్కరువు భావానిక్కరువు
మరి, కరువు లేనిదెక్కడ?
అందర్ పరేషానున్నా,
ఊపర్ షేర్వానీలక్కరువు లేదు
కడుపులోపల కాల్తున్నా,
ముసిముసి నవ్వులక్కరువు లేదు
రైతన్నల సావుకు పనికొచ్చే
పురుగుమందు డబ్బాలక్కరువులేదు
దేశము రాష్ట్రమూ తెచ్చే
అప్పులక్కరువు లేదు
దునియ బేంకుల
అప్పులకిచ్చే పైసలక్కరువు లేదు
అమీరోల్లు పరదేశాలల్ల దాస్కునే
బిలాక్ మనీక్కరువు లేదు
గోర్రెల మందలయిన జనాలకు
నాయకులిచ్చే హామీలక్కరువు లేదు
గిదేం అన్నాయమని జనం అడిగినందుకు
పోలీసోల్లు గాల్చిన బందూకులుల్ల
గోలీలక్కరువు లేదు
పచ్చని చెట్లన్నీ ఎండినై గన్క ఉరికొయ్యలక్కరువు లేదు!!
**************************************
కరువు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
-రామతాత!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి