సుప్రభాత ;కవిత -బృంద
పలకరించు పువ్వులతో
పరిమళించు నవ్వులతో
పరవశించు మనసుతో
పులకరించు పుడమి...

చీకటిని నెగ్గనివ్వని
రేపటికి స్వాగతమంటూ
మాపటికి మాసిపోయేవైనా
మాయని చిరునవ్వుతో సుమాలు

మిన్నగ తోచే వెలుగులు
కన్నుల నింపే కాంతుల
వెన్నెల సోనల జిలుగుల
ఊగాడే పూలగుత్తుల సోయగాలు

అడుగు వేసే దారినంతా
అలసిపోనీక ఆదరంగా
అదేపనిగా పూలరెమ్మల
గొడుగు పరిచే కొమ్మలు

బాలభానుడు వచ్చు దారి
సుతిమెత్తగ  మడుగులొత్తి
తివాచీలు పరవనెంచి వేచిన
చిన్ని పచ్చిక మొలకలు

రమణీయపు రహదారిని
కమనీయ ఉషోదయాన 
స్మరణీయపు సౌందర్యానికి
తెరతీసినట్టి  గగనపు వేదిక

అద్భుతమైన ఆదిత్యుని
ఆగమనాన  కాంతులు చిందు
అపురూప  క్షణాలను
అచ్చెరువుగ నిలిచి చూసె అవని.

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు