పూర్వం కిరణ్మయారణ్యంలో ఓ నాల్గు ఎలుగుబంట్లు వుండేవి. వాటికి ఆహారం దొరక్క రోజూ అడవంతా సంచరించేవి.
ఓ రోజు ఇద్దరు మనుషులు కన్పించారు. దీంతో అవి వారి వెంట బడి తరుముకున్నాయి.
మనుషులు తమ చేతుల్లో వున్న తేనె పాత్రలను కింద వదిలివేసి ఓ పెద్ద చెట్టు ఎక్కి కూర్చున్నారు. అయినా ఆ ఎలుగుబంట్లు చెట్లను ఎక్కి వారి మీదికి దాడి చేయడానికి యత్నించాయి. ఇక చేసేదేమీ లేక చేతిలో వున్న అగ్గిపుల్లల్ని గీచి భుజం మీద వున్న తువాలును రగిలించి వాటి మీదికి విసరడంతో ఆ మంటకు అవి భయపడి పారిపోయాయి.
కొద్ది సేపటి తర్వాత కిందికి దిగి తేనె పాత్రల వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే ఎలుగుబంట్లు తేనె రుచిచూసి మొత్తం గుటగుట తాగేశాయి. ఎంతో కష్టపడి సంపాదించిన తేనె ఎలుగుబంట్లు తాగేయడంతో మనుషులు నిరాశతో ఇంటికి వెనుదిరిగారు.
వారం తర్వాత మనుషులు తేనె కోసం అడవికి వెళ్లారు. అక్కడ పెద్ద గుహ కన్పించింది. అందులోకి వెళ్లిన వారికి పెద్ద తేనెతుట్టెలు కన్పించాయి. పెద్ద మంట బెట్టి తేనెటీగలను తరిమివేసి పెద్ద పాత్రల్లో తేనెపట్టుకున్న వారు ఆనందంతో గుహ వదిలి ఊర్లోకి బయలుదేరారు.
హఠాత్తుగా వారికి ఎలుగుబంట్లు కనిపించడంతో తేనె పాత్రలు అక్కడే పెట్టి పరుగులు పెట్టి అడవి నుంచి తప్పించుకుని బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుని బయటపడ్డారు.
తేనె రుచి చూసిన ఎలుగుబంట్లు తేనెపాత్రలు తీసుకెళ్లి విందు చేసుకున్నాయి. గుహ లోపలికి వెళ్లి చూశాయి. అక్కడ తేనె తుట్టెలు కింద పడేసి వుండడం కనిపించింది. వాటిని రుచి చూసి తేనె వుందని గ్రహించాయి. గుహలో వున్న తేనె తుట్టెల మీద పడి చేతితో లాగాయి.
ఒక్కసారిగా తేనెటీగలు చుట్టుముట్టి కరిచాయి. దీంతో ఎలుగు బంట్లు బాధతో విలవిలలాడాయి. గుహ వదిలి అడవంతా పరుగులు పెట్టాయి. అయినా తేనెటీగలు విడిచిపెట్టలేదు. ఎగులుబంట్లు వెంటపడి కరిచాయి.
దీంతో ఎలుగుబంట్లు తీవ్ర అస్వస్థతకు గురై పైకి లేవ లేకపోయాయి. నాల్గు రోజులు తర్వాత మనుషులు తేనెకోసం అడవిలోకి వెళ్లారు. తేనెతుట్టెలో తేనెను తీసుకుని పాత్రలతో దారిలో నడుస్తుంటే అనారోగ్యానికి గురైన ఎలుగుబంట్లు వారికి కనిపించాయి. వాటిని చూసిన మనుషులు పరుగులు తీశారు.
ఈ సారి ఎలుగుబంట్లు వారి వారి వెంటపడలేదు. తేనెటీగల దాడిలో గాయపడి పైకి లేవలేక ‘‘ మమ్మల్ని రక్షించండి.. ఇన్నాళ్లు మీ కష్టం తెలియక మధురమైన తేనెను గుటగుట తాగేశాము. పొట్టనిండా తాగొచ్చుకదా అని తేనెతుట్టె దగ్గరకు వెళితే తేనెటీగలు బాగా కుట్టాయి. నొప్పిని భరించలేక పోతున్నాం.. దయచేసి మాకు వైద్యం చేసి నొప్పి తగ్గించండి..ఇక మీకు ఏ హాని తటపెట్టం..’’ అని చేతులు జోడిరచి వేడుకున్నాయి ఎలుగుబంట్లు.
వాటి బాధను గ్రహించిన మనుషులు ఊర్లోకి వెళ్లి వైద్యులను తీసుకొచ్చి ఎలుగుబంట్లకు వైద్యం అందించారు. రెండు రోజులు అక్కడే వుండి వాటి ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తమ ఊరికి వెళ్లారు మనుషులు.
తమకు వైద్యం అందించి ఆరోగ్యం కాపాడినందుకు ఎలుగుబంట్లు మనుషులకు కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. ఆ తర్వాత ఎంత ఆకలి వేసినా అడవిలో తేనెకోసం వచ్చిన మనుషుల జోలికివెళ్లలేదు..తామే కష్టపడి ఆహారం సంపాదించుకున్నాయి కష్టం విలువల తెలుసొచ్చిన ఎలుగుబంట్లు.
కష్టం విలువ !;;;- - బోగా పురుషోత్తం, తుంబూరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి