మంచుపూలను పూయించి! కంచుకాగడాలను వెలిగించి!
సంచితార్థములను చూపించి! మానవత్వం ప్రబోధించే! మనసు గీసిన చిత్రాలు!!
నవనవోన్మేషమై, పలువర్ణాల వికసించిన
భవ్యమైన, వసంతలక్ష్మీ అందచందాలు,
మంజుల ,మనోజ్ఞ సుందరి నాట్య భంగిమలు ,
శ్రావ్యమైన, సురుచిర, స్వర రాగ భరిత ,
గాన గంధర్వుల మనోహర పటములు ,
ఎన్నో, ఎన్నెన్నో, చెప్పలేనన్ని,మనసు గీసిన చిత్రాలు ,
చేయించును,చూసిన వారి ముఖకవళికలతో విన్యాసాలు!!
గుండె కుంచె నుండి జాలువారిన,
దండనాయకుల దుందుడుకు శిక్షలో ,
మండిపోయిన అమాయకుల ఆర్తనాదాలతో,
గండిపడిన చెరువు వోలె, పారిన కంటినీరు !!
ఆకలితో వెన్నును అంటుకున్న కడుపు,
ఇంకిపోయిన చనుబాలతో ఇంతి,
రోదిస్తున్న పసిబాల,
అయినా విడిచి పెట్టని కామాంధుని కసి
ఎదనిండా నిండిన కన్నీరు!!
గీస్తూనే ఉంది కాన్వాస్ పై
రంగు రంగుల హంగుల సొబగులతో
చెదిరిన జుట్టు చిరిగిన గౌను
లోకంపోకడ తెలియని పసిహృదయం
నవ్వుతుంటే!వసివాడని ఆ నవ్వులో బేలతనం
గ్యాలరీ నిండా చెమర్చిన కళ్ళు
తెలియని ఉక్కపోతలో వడలిన అందరి ఒళ్ళు !!
మరఫిరంగుల మారణహోమంలో
తునాతునుకలుగా తెగిపడిన మేటివీరుల మొండాలు
కదనానికి కదలిన దురాక్రమణ దారుల
క్రూరమైన ముఖాలలో నిక్షిప్తమైన రుధిర కాంక్షను
ప్రస్ఫుటంగా గీస్తూనే ఉంది గుండె కుంచె !!
చెదరని ధైర్యంతో,
చూపరుల హృదయాన్ని కదిలించి
కరుణ, జాలి, దయను కలిగించే బొమ్మలు
వేస్తూనే ఉంది, ఉంటుంది !!
వేనవేల బాధలలో
బీటలు వారిన బతుకులను, పిచ్చి గీతలతో
మనసు గీసిన బొమ్మలు
మానవత్వాన్ని మేలుకొలిపే మార్గ దర్శకాలు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి