అక్షర సూరీడు;- కవిరత్న నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్య విస్తరణ అధికారి, 8555010108
అజ్ఞాన తామసి తరిమే విజ్ఞాన జ్యోతి
సంస్కృతీ సంప్రదాయాల రథ సారథి
మానవత్వం మేధస్సుల మేళవింపు
సద్గుణాల రాశి సమ సమాజ మార్గదర్శి 
గురువంటే ఓవ్యక్తి కాదు అద్భుత శక్తి !

వినయ విధేయతలు విత్తే హాలికుడు 
జ్ఞాన కిరణాలు ప్రసరించే అక్షర సూరీడు 
ఆలోచనాచరణల జన్మస్థానం ఆచార్యుడు                                       
ఆత్మ విశ్వాసాల ప్రతిరూపం అధ్యాపకుడు                                 
ఉన్నత వ్యక్తిత్వ ఉత్తమ జ్ఞాన సంపన్నుడు ! 

గురి తప్పని లక్ష్య సాధకుడు గురువు
క్షరాక్షర విలక్షణ సరస్వతీ సంతానం గురువు
నిష్కళంక నిష్ఠ నియమాల తోరణం గురువు
మట్టి మాణిక్యం శిల శిల్పంగా మలిచే ప్రజ్ఞాశాలి
అన్నీ ఎరుకతో అణిగి మణిగి ఉండే వినయశీలి

ప్రభాత కిరణాలకు మురిసే తామరలా
కౌముది కర స్పర్శతో మెరిసే కలువలా
గురు శిష్యుల అనుబంధం అజరామరం
లోక మేదైనా గురువు విలువ పెరిగినపుడే 
భావితరం బాగుపడేది బంగార మయ్యేది!
...(సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా)

కామెంట్‌లు