మనిషిగా మారిన గాడిద;- డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212

 ఒక ఊరిలో ఒక పండితుడు వుండేటోడు. అతని దగ్గరికి చానా మంది చదువుకోడానికి వచ్చేవాళ్ళు. అతను ఎలాంటి మూర్ఖుడినైనా సరే తన తెలివితేటలతో తీర్చిదిద్ది మాంచి పండితునిగా తయారు చేసి పంపించేటోడు.పక్కవూరిలో ఒక పిల్లోడుండేటోడు. వాడు పరమ పనికిమాలిన వెధవ. ఆ అంటే ఈ అంటాడు. ఈ అంటే ఊ అంటాడు. వాళ్ళ నాయన ఎందరెందరో గురువుల దగ్గరికి తీసుకుపోయినాడు గానీ ఎవరూ ఒక్క ముక్క గూడా నేర్పియ్యలేక పోయినారు. ఎట్లాగబ్బా వీన్ని బాగుచెయ్యడం అని తలకొట్టుకుంటా వుంటే ఒకాయన ఈ పండితుని గురించి చెప్పినాడు. దాంతో వాడు ఆ పండితున్ని కలసి తన బాధంతా చెప్పుకున్నాడు. దానికి ఆ పండితుడు నవ్వి ''ఏం భయపడొద్దు... నా జీవితంలో ఇంతవరకూ ఇట్లాంటి గాడిదలను ఎన్నింటినో కష్టపడి మంచి మనుషులుగా మార్చివేశాను. మీ గాడిదొక లెక్కా... పంపియ్యండి. ఆరు నెల్లు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మార్చి పంపించేస్తా'' అన్నాడు.
సరిగ్గా గురువు ఆ మాటలంటా వున్న సమయంలో ఆ ఇంటిముందు ఒక అమాయకుడు పోతా వున్నాడు. వానికి పిల్లల్లేరు. దాంతో ఒక గాడిదను తెచ్చుకోని సొంత కొడుకులెక్క పెంచుకుంటా వున్నాడు. వాడు ఆ మాటలు విన్నాడు. వాడు చానా చానా అమాయకుడు గదా... దాంతో... ''ఓహో... గురువు గారు ఎట్లాంటి గాడిదనయినా సరే ఆరు నెల్లు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మార్చివేస్తాడన్నమాట'' అనుకోని వురుక్కుంటా ఇంటికి పోయినాడు. పెండ్లాంతో ''ఏమే... ఏమే... ఇంతవరకూ మనకు తెలీదుగానీ మన ఊరి చివరనున్న పండితుడు అట్లాంటిట్లాంటి మామూలు మనిషిగాదు. గాడిదల్ని గూడా మనుషులుగా చేసేంత శక్తి ఆయనకున్నదంట'' అన్నాడు. ఆమె మొగునికన్నా పెద్ద అమాయకురాలు. దాంతో ఆచ్చర్యపోయి ''అలాగా... సరే... మనకు ఎట్లాగూ పిల్లలు లేరుగదా... ఆయన కాళ్ళ మీద పడి మనం పెంచుకుంటా వున్న గాడిదనే మనిషిగా మార్చమందాం. సరేనా...'' అనింది. దానికి ఆ అమాయకుడు 'సరే' అన్నాడు.
ఇద్దరూ కలసి గాడిదను తోలుకోని పండితుని దగ్గరికి పోయినారు. ''సామీ... ఎట్లాగయినా సరే... మా గాడిదను మనిషిగా చేసి పున్నెం కట్టుకోండి సామీ... మీ మేలు ఈ జన్మకు మరచిపోము. పిల్లలు లేని మాకు ఈ ఒక్క సాయం చేయండి సామీ'' అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నారు.
పండితునికి ఏమీ అర్థం కాలేదు. ''ఏందిరా ఇది. లెయ్యండి. నేనేంది... గాడిదను మనిషిగా మార్చడమేంది. అది ఎవరికీ సాధ్యం గాని పని'' అన్నాడు.
''సామీ... అంతమాటనకండి సామీ... మనిషి మనిషికీ మాట మారిస్తే ఎట్లా... పొద్దున మీరు పక్కూరాయనతో మాట్లాడిందంతా నేను విన్నాను. మేము ఈన్నే సావనయినా సస్తాంగానీ మీ కాళ్ళు మాత్రం వదలం. మీరు ఏం చేస్తారో తెలీదు... మా గాడిదను మాత్రం మనిషిగా మార్చాల్సిందే'' అన్నారు.
పండితునికి పొద్దున తాను పక్కూరాయనతో మాట్లాడినదంతా గుర్తుకు వచ్చింది. మాట వరసకు గాడిదంటే నిజంగానే గాడిద అనుకున్న వాళ్ళ అమాయకత్వానికి జాలి వేసింది. ఎట్లాగయినా సరే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని ''ఒరేయ్‌... గాడిదను మనిషిగా మార్చడమంటే మాటలు కాదురా. లక్షల్తో పని... నెలకు యాభైవేల చొప్పున ఆరునెల్లు ఖర్చు పెట్టాలి'' అన్నాడు.
దానికా అమాయకుడు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ''ఎంతయినా సరే... నేను సిద్దం సామీ... నా ఇల్లూ పొలమూ అన్నీ అమ్మయినా సరే కావల్సినంత డబ్బు తెచ్చిస్తా.... ఈ గాడిదను మాత్రం మనిషిగా మార్చండి చాలు'' అన్నాడు పట్టుకున్న కాళ్ళు వదలకుండా.
ఇక ఆ పండితునికి ఏం చేయాల్నో తోచలేదు. ''సరే... ఆ గాడిదను ఆశ్రమంలో ఓ మూలకు కట్టేసి వెళ్ళండి'' అన్నాడు. వాళ్ళు సంబరంగా గాడిదను ఆశ్రమంలో ఓ మూలకు కట్టేసి వెళ్ళిపోయినారు. పండితుడు దానిని ఎవరికీ తెలీకుండా రాత్రికి రాత్రి పక్కవూరిలోని తన స్నేహితుని దగ్గరకు పంపి దాచిపెట్టినాడు.
ఆ అమాయకుడు నెలకోసారి రావడం ఆడా ఈడా అప్పు చేసి జమ చేసిన డబ్బునంతా పండితుని చేతిలో పెట్టడం చేసేవాడు.'''గాడిద పూజలో వుంది. మనిషిగా మారుతా వుంది. ఇప్పుడెవరూ చూడగూడదు. ఆరునెల్లు పూర్తి గానీ. ఒకేసారి చూద్దువు గానీ'' అని పండితుడు డబ్బు తీసుకోని పంపించేవాడు.
అట్లా... ఒకొక్క నెల దాటుకుంటా... దాటుకుంటా... నెమ్మదిగా ఆరునెల్లు పూర్తయినాయి. వెంటనే ఆ అమాయకుడు పరుగెత్తుకుంటా వచ్చి ''సామీ... ఆరునెల్లు పూర్తయినాయి. నా కొడుకెక్కడ'' అనడిగినాడు సంబరంగా.
దానికా పండితుడు ''ఒరేయ్‌... నువ్వు ఇచ్చిన గాడిద వయసులో చానా పెద్దది గదా... దాంతో నీ కొడుకు గూడా ఒకేసారి పెద్దోడయి పక్కూరికి గ్రామాధికారి అయిపోయినాడు'' అని చెప్పినాడు.
దానికా అమాయకుడు చానా సంబరపడిపోయి ''అలాగా సామీ మరి నా కొడుకు నన్ను గుర్తు పడతాడా'' అనడిగినాడు. దానికా పండితుడు చిరునవ్వు నవ్వి ''గుర్తుపట్టొచ్చు. పట్టకపోవచ్చు. ఎందుకయినా మంచిది. నువ్వు నీ గాడిదకెప్పుడూ పెట్టే పచ్చగడ్డి కొంచం నీ వెంబడి తీసుకోనిపో. నిన్ను గుర్తు పట్టకపోతే దాన్ని చూపించు. గుర్తు పడతాడు'' అని చెప్పినాడు.
ఆ అమాయకుడు చానా సంబరంగా పక్క వూరికి పోయినాడు. ఆ సమయంలో ఆ గ్రామాధికారి రచ్చబండ మీద కుర్చీలో కాలు మీద కాలేసుకోని కూచోని ఏదో గొడవకు సంబంధించి తీర్పు చెబుతా వున్నాడు. ''ఆహా! నా కొడుకు ఎంత పెద్ద హోదాలో వున్నాడు'' అని మురిసిపోతా అతన్నే గుడ్లప్పగించి చూస్తా వున్నాడు.
ఆ గ్రామాధికారి ''ఎవరబ్బా ఈ కొత్తాయన నా వంక అట్లా నోరెళ్ళబెట్టుకోని చూస్తా వున్నాడు'' అనుకోని మాటిమాటికీ వాన్నే చూడసాగినాడు. ఆ అమాయకుడు ''ఈయనేమబ్బా... ఇన్ని సార్లు నన్ను చూస్తా వున్నాడు గానీ కొంచం గూడా పలకరియ్యడం లేదు. కొంపదీసి మర్చిపోయినాడో ఏమో'' అనుకోని సంచీలోంచి పచ్చగడ్డి తీసి ఆ గ్రామాధికారికి చూపిస్తా ''దామ్మా... దా... దా... నా బుజ్జిగదా... నా బంగారు కొండ గదా... దామ్మా... దా... దా... అంటూ పిలవసాగినాడు.
అది చూసిన గ్రామాధికారికి కోపం వచ్చి ''ఎవర్రా నువ్వు. అట్లా పిలుస్తా వున్నావ్‌. మంచీ మర్యాదా లేకుండా.'' అన్నాడు కోపంగా. 
దానికా అమాయకుడు ''ఏరా... గాడిదకొడకా... నన్నే మరచిపోయినావా... నిన్ను మనిషిని చేయడానికి ఎంత ఖర్చు పెట్టినాను'' అని కోపంగా అరచినాడు.
దానికా గ్రామాధికారికి తిక్కలేసి ''ఎవర్రా నువ్వు. గాడిదా... గీడిదా... అని తెగ రెచ్చిపోతా వున్నావు'' అంటూ పక్కనున్న కట్టె తీసుకోని రపారపా రెండు పెరికి, కాపలా వాళ్ళతో వాన్ని మెడపట్టుకోని వూరి బైటకి దొబ్బించినాడు.
ఆ అవమానానికి అమాయకుడు తట్టుకోలేక పోయినాడు. పరుగు పరుగున పండితుని దగ్గరకు పోయి ''సామీ... ఎంతో కష్టపడి పెంచి పెద్దచేసి ఒక మనిషిగా మార్పించిన నన్నే గుర్తుపట్టలేని ఇట్లాంటి కొడుకు వుంటే యెంత లేకుంటే యెంత... వాడు నాకు వద్దే వద్దు. ఎంత ఖర్చయినా పరవాలేదు. వాన్ని మళ్ళా గాడిదగా మార్చండి'' అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు.
''సరే... ఒక ఆరునెల్ల తర్వాత రాపో'' అని చెప్పినాడు పండితుడు. ఆరు నెలలు పూర్తి కాగానే వాని గాడిదను వానికి తెచ్చి అప్పగించినాడు. ఆ గాడిదను చూడగానే ఆ అమాయకుడు ''ఏమే... మనిషిగా మారగానే అంత పొగరెక్కిందా నీకు... నన్నే గుర్తు పట్టనట్లు మాట్లాడతావా... తన్ని నీ మనుషుల్తో వూరి బైటకి దొబ్బిస్తావా... ఇప్పుడొచ్చిందా బుద్ది. దిగిందా కొవ్వు'' అంటూ కట్టె తీసుకోని రపారపా దాన్ని పెరికినాడు.
అంతలో పండితుడు అంతకు ముందు వాడిచ్చిన డబ్బుతో బైటకు వచ్చి ''వద్దొద్దు... అనవసరంగా దాన్ని కొట్టొద్దు. పాపం అది తిరిగి గాడిద కాగానే జరిగిందంతా మర్చిపోయింటాది'' అని చెప్పి ''ఇదిగో ఈ డబ్బు మూట తీసుకో... నిన్న వూరిబైట నుంచి వస్తా వుంటే పొలంలో దొరికినాయి. నీవెలాగూ దీన్ని మనిషిగా మార్చడం కోసం బాగా అప్పు చేసినట్టున్నావు. దీనితో అవన్నీ తీర్చుకోపో'' అంటూ వాడిచ్చిన డబ్బు వాని చేతిలోనే పెట్టినాడు.
వాడు ఆ మూటను తీసుకోని వంగి దండం పెట్టి ''రారా... బుజ్జీ... దా... పోదాం పా'' అంటూ ఆ గాడిదను తోలుకోని సంబరంగా ఇంటికి పోయినాడు.
***********

కామెంట్‌లు