అటక మీద ఏముంటాదిలే అత్తా ; డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక వూరిలో ఒక కొత్త కోడలు వుండేది. ఆమెకు చిన్నప్పటి నుంచీ పుట్టింటిలో రకరకాల పిండివంటలు రోజూ చేసుకోని తినే అలవాటు వుండేది. కొత్తగా కాపురానికి వచ్చింది గదా... ఇక్కడ అలా తింటే ఎవరేమి అనుకుంటారో అని ఒకటే భయం. దాంతో అందరూ పొలానికి పోయినప్పుడల్లా గుట్టుచప్పుడు కాకుండా చేసుకోని తినేది. కానీ సరుకులు తెచ్చినేవి తెచ్చినట్టు అయిపోతా వుంటే అత్తకు అనుమానం వచ్చింది.
ఒకరోజు అత్త అందరితోబాటు పొలానికి పోయినట్టే పోయి, కొంతదూరం పోయినాక కడుపునొప్పంటూ మట్టసంగా తిరిగి ఇంటికాడికి వచ్చింది. ఇంటిలోంచి వాసనలు ఘుమఘుమలాడతా వున్నాయి. నెమ్మదిగా కిటికీలోంచి తొంగి చూసింది. కొత్త కోడలు పొయ్యి ముందు కూచోని హాయిగా పాటలు పాడుతా ఏవేవో పిండివంటలు సంబరంగా చేసుకుంటా కనబడింది. ''ఓహో! ఇదా సంగతి. వుండు నీ పని చెబుతా'' అని అత్త నవ్వుకుంటా వెళ్ళిపోయింది.
అత్త పొలం నుంచి సాయంకాలం ఇంటికి వచ్చినాక కోడలిని 'నీళ్ళు తోడుకోని రాపో' అంటా బావికాడికి పంపిచ్చి ఇళ్ళంతా వెదికింది. వూహూ.... ఎక్కడా ఏమీ కనబళ్ళేదు. ఎక్కడ దాచిందబ్బా అనుకుంటా వుంటే పైన అటక కనబడింది. వుండు చూద్దాం అనుకుంటా నిచ్చెన వేసుకోని పైకెక్కి చూసింది. ఇంకేముంది... కారాలు, మురుకులు, తీయని బూందీలు కనబన్నాయి. ''అమ్మదొంగా... ఇక్కడ దాచినావా... ఇప్పుడు చూడు ఏం జరుగుతాదో'' అని నవ్వుకుంటా కిందికి దిగింది.
కాసేపటికి కొడుకు ఇంటికి వచ్చినాడు. బాగా అలసిపోయి కాళ్ళూ చేతులు కడుక్కుంటా వుంటే అత్త మట్టసంగా తువ్వాలు తీసి దాచేసింది. వాడు ముఖం తుడుచుకుందామంటే తువ్వాలు కనబడలేదు... ''ఏమే... తువ్వాలు ఎక్కడుంది. పొద్దున ఇక్కడే తాడు మీద వేసింటినే'' అన్నాడు పెళ్ళాంతో.
ఆ మాటలకు అత్త గట్టిగా కోడలికి వినబడేటట్టు ''ఇందాక గాలి పెద్ద ఎత్తున లేచిందిలే.... బట్టలన్నీ చిందరవందరయి ఎగిరెగిరి పన్నాయి. కొంపదీసి నీ తువ్వాలు ఎగిరి అటక మీద గానీ పడలేదు గదా... పో... పోయి... ఆ నిచ్చెన తీసుకోనొచ్చి ఎక్కి చూడు.... దొరుకుతుందేమో'' అనింది. ఆ మాటలకు లోపల వంట వండుతా వున్న కొత్తకోడలు అదిరిపడింది. ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వురుక్కుంటా గదిలోకొచ్చి ''అంత ఎత్తు వున్న అటక మీద యాడ పడింటాదిలే అత్తా... ఇక్కడే ఎక్కడో పడింటాది గానీ.... వంట అయినాక నే వెదుకుతానులే. ఇప్పటికి ఈ తువ్వాలు తీసుకో'' అంటా పెట్టెలోంచి కొత్త తువ్వాలు తీసి మొగునికి అందిచ్చింది. కోడలి కంగారు చూసి అత్త లోపల్లోపల పడీపడీ నవ్వుకోనింది.
కాసేపటికి బైటి నుంచి వాళ్ళ మామ వచ్చినాడు. అత్త ఇంటిలోనున్న కొడవలి దాచిపెట్టి మొగునితో ''ఏమే... ఇంటి చుట్టూ చూడు.... పిచ్చి మొక్కలు ఎంత ఎత్తు ఎదిగినాయో... కొంచం కొడవలి తీసుకోని నున్నగా తీసేయ్‌... లేకపోతే ఏ పాములో, తేళ్ళో వచ్చి చేరతాయి'' అనింది. అతను సరేనని కొడవలి కోసం మూలకు పోయి చూసినాడు. అక్కడుంటే గదా కనబడ్డానికి. ఇళ్ళంతా వెదుకుతా ''ఏమే... ఈ మూలకు కొడవలి వుండాలి గదా... యాడికి పోయింది. కనబడ్డం లేదు'' అన్నాడు పెళ్ళాంతో. దానికామె గట్టిగా వంటింటిలో వున్న కోడలికి వినబడేటట్టు ''దారికి అడ్డంగా వుంటే ఎవరికయినా తగులుతుందేమోనని భయపడి నీ కొడుకు ఏమయినా అటకమీద గాని పెట్టినాడేమో. పో... పోయి... ఆ నిచ్చన తీసుకోనొచ్చి ఎక్కి చూడు. దొరుకుతుందేమో'' అనింది.
ఆ మాటలు వింటానే కోడలుపిల్ల అదిరిపడింది. ఎక్కడి పని అక్కడే వదిలేసి వురుక్కుంటా బైటకొచ్చి ''అటక మీద ఎవరు పెడతారులే అత్తా అంతెత్తున. ఇక్కడే ఎక్కడో ఏమూలో పడుంటాది. అయినా మామ ఇప్పుడే గదా ఇంటి  లోపలికి అడుగు పెట్టింది. బాగా అలసిపోయింటాడు. రేపు నేను వంటయినాక పెరడంతా నున్నగా చేసి పెడతాలే'' అనింది. మామ 'నా కోడలు ఎంత మంచిది' అనుకుంటా లోపలికి పోయినాడు. అత్త అదంతా చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోనింది.
ఇంటిబైట చుట్టుపక్కల పిల్లలంతా కలసి బంతాట ఆడుకుంటా వున్నారు. అంతలో అనుకోకుండా బంతి ఎగిరి వచ్చి  ఇంటిలో పడింది. వెంటనే అత్త దాన్ని ఎవరికీ కనబడకుండా బీరువా కిందికి తోసేసింది. అంతలో పక్కింటి పిల్లోడు వచ్చి, ''అవ్వా... బంతి ఇంటిలోకి వచ్చి పడింది. ఇవ్వవా'' అనడిగినాడు. దానికామె అటూ యిటూ చూసి ''యాడ పడిందిరా... ఎక్కడా కనబడ్డంలేదే. కొంపదీసి ఎగిరి అటక మీద గాని పడలేదు గదా... పో... పోయి బైటున్న నిచ్చెన తాపో, ఎక్కి వెదుకుదువు గానీ'' అనింది. అంతే... ఆ మాటలకు కోడలు అదిరిపడింది. వురుక్కుంటా అక్కడికి వచ్చి ''అంత ఎత్తులో యాడ పడింటాదిలే అత్తా... ఇక్కన్నే ఎక్కన్నో పడింటాది. నే వెతుకుతాలే'' అంటా కిందామీదా పడి వెతుకుతా వుంటే కోడలి కంగారు చూసి అత్త లోపల్లోపల పడీపడీ నవ్వుకోసాగింది.
కోడలు బీరువా కింద బంతి తీసి పిల్లోనికి ఇచ్చింది. అంతలో ఆమెకు అత్త అన్నింటికీ అటకెక్కి చూడమనడం మతికి వచ్చింది. 'ఇలా అంటా వుందంటే అత్తకు అటక మీద దాచిన విషయం తెలిసిపోయే వుంటాది. అందుకే నన్ను ఇలా ఏడిపించి సంపుతోంది. తప్పు ఒప్పుకోకుంటే ఇంకా ఎన్ని బాధలు పడాలో ఏమో' అనుకుంటా సక్కగా పోయి అత్తకాళ్ళమీద పడింది. ''అత్తా! ఏదో బుద్ధి తక్కువయి నోరు కట్టుకోలేక తప్పు చేసినా... ఈ ఒక్కసారికి మన్నించు. ఇంగోపారి చేయను'' అనింది కళ్ళనీళ్ళు పెట్టుకోని.
దానికి అత్త చిరునవ్వు నవ్వుతా ''చూడు కోడలా... నువ్వు ఎప్పుడయితే ఈ ఇంటిలోకి అడుగుపెట్టినావో అప్పటి నుంచి ఇది మా ఇళ్ళే కాదు నీ ఇళ్ళుకూడా. ఇకపై ఇలా ఎప్పుడు దాచిపెట్టుకోని తినకు. అదీగాక నీ చేతివంట చానా రుచిగా వుంటాదని మీ బంధువులందరూ పెళ్ళిలో పడీపడీ చెప్పినారు. నీ కొచ్చిన రుచులు మాకు కూడా చేసి చూపించు. అందరమూ తింటాం. ఏం సరేనా'' అనింది.
ఆ మాటలతో కోడలు బాధంతా తీరిపోయింది. 'మా మంచి అత్త' అనుకుంటా మరోసారి ఆమె కాళ్ళకు దండం పెట్టుకోని ఆటకమీద దాచిపెట్టుకున్నవన్నీ తీసి అందరికీ పెట్టింది.
***********

కామెంట్‌లు