నా మనసంతా జ్యోతి చుట్టే తిరుగుతా వుంది. ఇప్పటికి నాలుగు సంవత్సరాలైంది దాన్ని చూసి. నిన్న రాత్రి ఫోన్ చేసి ''సార్... రేపే నా ప్రసవం. ఆదోని గోసాసుపత్రికి వెళ్తున్నా. నువ్వు తప్పకుండా రావాల. నిన్ను సూడక ఎన్ని రోజులైందో తెలుసా... నా బిడ్డని సూడ్డానికొచ్చినట్లుగా వచ్చి నన్ను గూడా సూసిపో... మర్సిపోమాకు.. యెదురు సూస్తుంటా. రాలేదనుకో మళ్ళా సచ్చినా మాట్లాడను. ఎప్పటికీ. నీ మీదొట్టు'' అంది. దాంతో పొద్దున్నే బడికి ఒక గంట ఆలస్యంగా వస్తానని చెప్పి ఆసుపత్రికి బైలుదేరా.
జ్యోతి వొట్టి మాటలపుట్ట. నోరు తెరిస్తే చాలు తుంగభద్రా ప్రవాహంలా పదాలు పరవళ్ళు తొక్కుతాయి. ఒకటే సందడి. జాతరలా వుంటాది. నల్లగా వున్నా చూడముచ్చటైన రూపం. నేను కనబడితే చాలు దాని చక్రాళ్ళాంటి కళ్ళలో ఇంద్రధనుస్సులు ప్రత్యక్షమవుతాయి. మొగమంతా అప్పుడే విచ్చిన ముద్దబంతిలా వెలిగిపోతాది. చెంగుచెంగున ఉడుతపిల్లలా గంతులేస్తూ వురుక్కుంటూ వచ్చి ''శుభోదయం సా'' అంటాది. ఆ మాట వినబడని రోజు నా కళ్ళు బడంతా జల్లెడ పట్టేస్తాయి. ఏదో దిగులు. ఏమైందో దానికని. ఏ పిల్లనైనా అడుగుదామా అంటే ''ఎప్పుడూ ఎందుకు దాని గురించే అడుగుతావు. మేం కనబడమా'' అంటారు మూతి మూడు వంకర్లు తిప్పుతా.
కొన్నిసార్లు సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు ''సా... రేపు పొద్దున ఏమీ తినకుండారా.. ఉగ్గానీబజ్జీ సేసుకోనొస్తా. ఉడుకుడుకుగా తింటే భలే కమ్మగా వుంటాది'' అంటుంది. పొరపాటున ఏదో ఆలోచనల్లో మర్చిపోయి తినేసొస్తే... మొగమంతా గంటు పెట్టుకొని, గులాబీమొగ్గలా పెదాలు ముడిచి ''ఏం సెయ్యాల దీన్ని. తీస్కపోయి దిబ్బలో పాడేస్తాలే'' అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో కోపంగా విసవిసా పోతాది. రెండ్రోజులదాకా నవ్వినా నవ్వదు. పలకరించినా పలకదు. కొరకొరకొర చూస్తుంటాది. అందుకే తిన్నా తినలేదని అబద్ధం చెప్పేస్తా. అదిచ్చిన క్యారియరు తీసుకొని తిని బైటకు రాగానే వురుక్కుంటా వచ్చి ''ఎలా వుంది సా... నచ్చిందా'' అంటుంది ఆతృతగా కళ్ళెగరేస్తా. '' నీ చేత్తో ఏం చేసినా అమృతమే... నిన్ను కట్టుకునేటోడు గొప్ప అదృష్టవంతుడులే'' అంటే '' పోసా.... నువ్వు'' అంటూ సిగ్గుపడుతూ తుర్రున మాయమవుతుంది.
చాలాసార్లు ఆలోచిస్తాను. ఎట్లా ఏర్పడింది ఈపాపతో నాకింత అనుబంధం అని. ఐదోతరగతి ముగించుకొని, ఆరో తరగతికి హైస్కూల్లో చేరే పిల్లలు మొదట్లో తుమ్మెదల్లా స్వేచ్ఛగా, మహానంది కోనేట్లా స్వచ్ఛంగా వుంటారు. ఉపాధ్యాయుల చుట్టూ పిల్లిపిల్లల్లా రాసుకోని పూసుకోని తిరుగుతుంటారు.
ఒకసారి పిల్లలందర్నీ తీసుకొని కౌతాళం ఖాదరలింగస్వామి దర్గాకీ, అట్లే దగ్గర్లోనే వున్న ఉరుకుంద ఈరన్నస్వామి గుడికీ పోయినా. మధ్యాన్నం దాకా తిరిగీ తిరిగీ అలసిపోయి ఒక చెట్టు కిందికి చేరుకున్నాం. తెచ్చుకున్నేవి ఇప్పుకోని తిన్నాక ''సార్.. ఏదయినా ఒక మంచి కత చెప్పుసా'' అంటూ వెంటబన్నారు పిల్లలు. సరే అని ''కిర్రు... కిర్రు... లొడ్డప్పా'' అనే జానపద కథ చెప్పి '' మీకెవరికైనా వస్తాయా ఇట్లాంటి కథలు'' అనడిగా. అందరూ బెల్లం కొట్టిన రాళ్ళలెక్క గమ్మునుండిపోయారు. అప్పుడు వెనుక నుంచి ఒక పిల్ల ''సా... నాగ్గూడా ఒక కతొచ్చుసార్.. సెబ్దునా'' అంది సిగ్గుసిగ్గుగా లేచి నిలబడి. అదే ఆ పిల్లని మొదటిసారి సూటిగా, పరిశీలనగా చూడ్డం. ఆరో తరగతిలో కొత్తగా చేరింది. '' చెప్పు'' అన్నా. అప్పుడు చెప్పింది బుడంకాయంత బుడ్డోని కథ. ముద్దుముద్దుగా ముత్యాలు రాలినట్టుగా విన్నంత సేపూ నేనూ, పిల్లలూ ఒగటే నవ్వు. అంతా అయిపోయాక దాని చేయి పట్టుకుని దగ్గరకు తీసుకొని ''భలేగుంది కథ. ఇంకా ఇట్లాంటివి ఏమన్నా వస్తాయా'' అనడిగా. అప్పుడా పిల్ల '' మా జేజికి శానా కతలొస్తాయిసా... ఇనేటోళ్ళు కరువయిపోయినారు గానీ కూసుంటే గంటలు గంటలు సెబుతాది ముత్యాల్లాంటివి'' అంది. నేను ఎదురు చూసేది గూడా అట్లాంటి పచ్చని కతల చెట్టు కోసమే గదా. వెంటనే ''ఐతే... ఆ ముత్యాలన్నీ ఏరుకోనొచ్చి నా దోసిట్లో పోస్తావా'' అన్నా ఆశగా. '' నిజ్జంగా '' అంది కళ్ళు టపటపమని ఆర్పుతూ. '' ఆ... నిజ్జంగా ... నువ్వు కత చెబుతా వుంటే ఎంత కమ్మగా వుందో తెలుసా... వేడివేడి రొట్టె మీద వెన్నపూస, గోంగూర పప్పూ రాసుకోని తిన్నట్టు'' అన్నా.
అట్లా ఏర్పడింది అనుబంధం. వారానికో, పదిరోజులకో ఏదో ఒక కథ పట్టుకొచ్చేది. కొన్నిసార్లు నాకు తెలిసినవే అయినా అదంత కష్టపడి సంపాదించుకొచ్చింది గదాని వింటూ వుంటా. అట్లా ఆ పాప చాలా దగ్గరైపోయింది. ఎంత దగ్గరంటే దాన్ని చూడకుండా వుండలేనంత. ఇట్లాంటి కూతురుంటే ఎంత బాగుండేది గదా అనుకునేంత. దాన్ని ఎప్పుడూ ''బంగారూ'' అని ముద్దుగా పిలుచుకునేవాన్ని. తరగతి గదిలో పిల్లలు గూడా '' మీకు అందరికన్నా మీ బంగారమే ఎక్కువైంది. ఇంగ మాతో యెందుకు మాట్లాడ్డం. ఆ పిల్లనొక్కదాన్నే కూసోబెట్టుకోని పాటాలు సెప్పుకో... మేం బైటకు పోతాం'' అంటారు అల్లరిగా దాన్ని ఉడికిస్తూ. దానికి అది వాళ్ళని చూపుల్తోనే కాల్చేస్తూ ''ఆళ్ళకు కుళ్ళులే సార్ వూకే ఏదో వొగటి వాగుతుంటారు ఉత్త డబ్బాల్లెక్క. పట్టిచ్చుకోమాకు'' అంటూ వాళ్ళకెళ్ళి తిరిగి ''పోతే... పోండే... నాసారు... నాఇష్టం'' అనేది చేతిని లతలా గట్టిగా అల్లుకుపోయి... అచ్చం మా పాపగదా '' మానాన్న'' అన్నట్లుగా. అట్లా ఒక్కొక్క సంవత్సరమే గడుస్తా తొమ్మిదవ తరగతిలోకి అడుగు పెట్టింది. అప్పుడప్పుడే వసంతం ఆ పిల్లని ఆవహించడంతో దాని శరీరమంతా ఆ చిరువెలుగులు మిరుమిట్లు గొలుపుతూ వుండేవి. వయసు పెరుగుతున్నా నా దగ్గర మాత్రం అట్లాగే పసిపిల్లలా వయ్యారాలు పోతూనే వుండింది.
ఒకసారి జ్యోతి వరుసగా రెండువారాలు బడికి రాలేదు. ఎదురుచూసి... ఎదురుచూసి... వుండబట్టలేక దాని స్నేహితురాలిని పిలిచి ''ఎందుకురా జ్యోతి రావడం లేదు'' అని ఆరా తీశా ఆరోగ్యమేమన్నా బాగాలేదేమోనని.
ఆ పాప రహస్యం చెబుతున్నట్లుగా దగ్గరకు వచ్చి ''నీకు తెలీదా సా... జ్యోతి వాళ్ళక్క లేచిపోయింది'' అంది గుసగుసగా.
''ఎప్పుడు'' అన్నా కుతూహలాన్ని ఆపుకోలేక.
''పదైదు రోజులైంది సా'' అంది.
''ఎవరితో'' అన్నా వివరాల కోసం.
''ఆదోని పిల్లోడంట. ఎవరికీ తెలీకుండా బట్టలు, నగలు సర్దుకోని కాలేజీకని పోయి అట్నించి అట్నే యెళ్ళిపోయింది. వూళ్ళో అందరూ ఆళ్ళ కోసమే బుడుకుతున్నారు. ఆళ్ళ నాన్నయితే అది నా కూతురే గాదు. దొరికితే దాన్ని సంపకుండా వదలను అంటూ సెగలు కక్కుతున్నాడు. కులమోళ్ళు గూడా మన కులంలో ఇంతవరకూ ఎవరూ ఇట్లా సేయలా. ఈ రోజు నీ కూతురు. రేపు నా కూతురు. ఇట్లాంటిది మళ్ళీ జరగకుండా వాన్ని ఏదో ఒకటి సేయాల అని ఒగటే ఎగదోస్తున్నారు. వూళ్ళో యెవరి నోట్లో సూసినా ఆళ్ళ గురించే. దాంతో తలెత్తుకోలేక ఆడోళ్ళెవరూ ఇంట్లో నుండి బైటకు రావడం లేదు'' అంది.
ఆ తరువాత జ్యోతి మరలా ఎప్పుడూ బడికి రాలేదు. కొంతమంది సార్లతో వెళ్ళి ఎంత నచ్చచెప్పినా వాళ్ళ నాన్న వినలేదు. ప్రతిరోజూ నా కళ్ళు ఆపాప కోసం ఆశగా వెదుకుతూనే వుండేవి. నల్లగా, పొడవాటి జడతో, గుండ్రని కళ్ళతో, కొశ్శని ముక్కుతో, నుదుటన ఎర్రని బొట్టు పెట్టి ఏ పిల్ల కనబన్నా జ్యోతే కళ్ళ ముందు మెదిలి మనసంతా బాధతో ఒక్కసారి మెలిబెట్టేది. బడిలో అంతకు ముందులా పిల్లల్తో చలాకీగా వుండలేకుంటున్నా. అలా ఎదురు చూస్తానే దిగులుదిగులుగా ఆరునెళ్ళు గడిచిపోయింది.
ఒక రోజు రాత్రి చదువుతున్న కథల పుస్తకం పక్కన పెట్టేసి పడుకోడానికి సిద్ధమయ్యాను. కన్నులు మూసుకు పోతున్నాయి. అంతలో సెల్ మోగింది. ఇంత రాత్రప్పుడు ఎవరబ్బా అని విసుగ్గా అందుకున్నాను. అవతల నుంచి కాసేపు నిశ్శబ్దం. 'ఎవరూ' అన్నా చిరాగ్గా మాటలేవీ లేవు. అంతలో ఫోన్ మూగవోయింది. బంగారం లాంటి నిద్ర చెడగొట్టినందుకు పీకలదాకా కోపం వచ్చింది. పడుకోబోయాను. అంతలో మరలా రింగయ్యింది. ఎవరైనా ఆట పట్టిస్తున్నారా అనుకుంటూ ఫోనెత్తాను.''సా... బాగున్నావా'' అంటూ గుసగుసగా వినీ వినబడనట్లుగా ఒక పరిచితమైన కంఠం అలలు అలలుగా...
''ఎవరూ... సరిగ్గా వినబడ్డం లేదు'' అన్నా నిటారుగా కూర్చుంటూ.
''నేనేసా.. మీ బంగారాన్ని'' అంది.
ఒక్కసారిగా నిద్రమబ్బు ఎగిరిపోయింది. ఎన్నిరోజులైంది ఆ కమ్మని కంఠం విని. నరనరాల్లో ఏదో ఆనందం. ''ఏమైపోయావురా బంగారం... ఇన్ని రోజులు'' అన్నా ఆప్యాయంగా. అంతలో అవతలి నుంచి సన్నని ఏడుపు. ''ఈ బంగారం ఇంగ నీకు ఎప్పుడూ కనబడనంత దూరమైపోతాది సా'' అంది వెక్కిళ్ళు పెడుతూ. నాకర్థం కాలేదు. ''ఏయ్ ... ఏమైందిరా... ఎందుకలా మాట్లాడుతున్నావ్'' అన్నా అమ్మలా ఆప్యాయంగా. కాస్త కంగారుగా. కాసేపు నిశ్శబ్దం. ''సా... నా పెండ్లిసా... ఎల్లుండే... ఆలూరు సంబంధం. ఏం బాలేడు. శానా పెద్దోడు. నేనెంత మొత్తుకుంటున్నా ఎవరూ వినడం లేదు. మా అక్క లేసిపోయింది గదా.. అందుకే నాకు ముందరగానే మూడుముళ్ళు వేయించేస్తున్నారు. నువ్వే ఆపాలి సా... సిన్నపిల్లలకు పెండ్లి సేయగూడదనీ, సేస్తున్నట్టు తెలిస్తే లోపలేస్తారనీ యెప్పుడు సెబ్తుంటివి గదా.. ఎట్లాగయినా ఆపుసా'' అంది. దాని గొంతు అంత విషాదంగా వినడం అదే మొదటిసారి. అంతలో ''సా.. ఇక వుంటసా... ఎవరైనా సూస్తారు. అందరూ పడుకున్నాక పైకొచ్చి సప్పుడు గాకుండా సేస్తున్నా. ఆపుతావు గదాసా... నిన్నే నమ్ముకున్నా'' అంది. ఆ గొంతులో ఏదో ఆశ నాపై. మునిగిపోతూ చివరి ప్రయత్నంగా ఎవరైనా అందుకుంటారేమోనని చేయి పైకి లేపినట్లుగా.
''అలాగే బంగారం. జాగ్రత్త'' అంటూ ఫోన్ పెట్టేశాను.
మనసంతా అల్లకల్లోలంగా వుంది. నిద్ర ఎగిరిపోయింది. ఏవేవో ఆలోచనలు. చుట్టూ చీకటి. అనంతంగా... వెలుతురును కబళించి... చిదిమేసి... విజయానందం పొందుతూ...
ఆలోచనలతో అలసిన మనసు ఎప్పుడు నిద్రపోయిందో. ఉదయం రెప్పలు బలవంతంగా తెరిచాను. కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. మనసంతా బంగారమే మెదులుతూ వుంది. ''ఎలా ఆపాలి'' ఆలోచిస్తూ వున్నాను. పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేస్తే ఆగిపోతాది. కానీ వూరోళ్ళతో గొడవ. తరువాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాది. బాలకార్మికులు, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, బసివినీ వ్యవస్థ ఎక్కువగా వున్న మండలాలు ఆదోని చుట్టూ అనేకం. తెలుగు, కన్నడ కలగలిసి ఏ అధికారులూ తొంగి చూడక, పెత్తందారుల పాలనలో, అభివృద్ధికి కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయిన సరిహద్దు ప్రాంతం ఇది. అంతలో 'చేయూత' సంస్థ గుర్తుకొచ్చింది. ఆడపిల్లల అక్షరాస్యతపై పని చేస్తున్న సంస్థ. దాని అధ్యక్షుడు నా స్నేహితునికి మంచి స్నేహితుడు. వెంటనే నా స్నేహితునికి ఫోన్ చేసి నా పేరు బైటకు రాకుండా ఈ పెళ్ళి ఆపమని ప్రాధేయపడ్డాను.
వాడు కాసేపు ఆలోచించి ''ఏ కులం'' అన్నాడు.
''ఎందుకురా '' అడిగాను.
''పెద్దకులమోళ్ళయితే కష్టం. అదీగాక వాళ్ళ సంస్థ మీ వూళ్ళో గూడా పని చేస్తోంది. దాన్ని తవ్వుతే ఆపైన పీక్కోవడం కష్టం'' అన్నాడు.
''బీసీల్లే'' అన్నా కులం పేరు చెబుతూ.
''సరే... నేను మాట్లాడ్తాలే'' అంటూ ఫోన్ పెట్టేశాడు.
ఉదయం తొమ్మిదికంతా బండేసుకొని ఎప్పటిలాగే ఆదోని నుంచి బైలుదేరా. బడికి చేరాలంటే అరగంట పైన్నే పడుతుంది. దారంతా కూలీల ఆటోలు, వ్యాన్లు. దాన్ల నిండా బడిఈడు మొగ్గలే. ఎక్కువగా ఆడకూతుర్లే. కెనాల్ కింద వూర్లలో పత్తి, మిరప విరగబడి కాస్తాయి. కూళోళ్ళకు కొరత. దాంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కుప్పలు కుప్పలుగా వెళ్తూ వుంటారు. వాళ్ళనే చూస్తూ నిదానంగా బండి నడపసాగాను. మనసంతా ఆందోళనగా వుంది. ఏమి జరుగుతుందా అని. కాసేపటికి ఒక పోలీసు జీపు, దాని వెనుక చేయూత సభ్యులు, పత్రికా విలేఖరులున్న మరో జీపు నన్ను, ఆటోలను దాటుకుంటా సర్రున గ్రామం వైపు దూసుకుపోయాయి. వాటిని చూడగానే నా పెదాలపై చిరునవ్వు మెరిసింది.
బడికి పోయిన కాసేపటికి ఒక పాప వురుక్కుంటూ నా దగ్గరకు వచ్చి '' సా... జ్యోతి పెండ్లి ఆగిపోయింది సా'' అంది గసబెడతా.''ఏం జరిగింది. గొడవేమన్నా అయిందా'' అన్నా అమాయకంగా ఆరా తీస్తా.ఆ పాప పోలీసులొచ్చిన విషయం చెబుతూ '' వాళ్ళమ్మా నాన్నా పోలీసుల కాళ్ళ మీద బడి... సుట్టాలంతా ఇంటికొచ్చి పందిరేసుకున్నాక ఇట్లా ఆపుసేయమంటే ఎట్లాసా.. పాపకు బంగారు సేపిచ్చినాం. ఇంటి నిండా సరుకులు తెచ్చేసినాం. ఇప్పటికే మొదటి పాపది అట్లయి తలెత్తుకోలేకుంటున్నాం. మళ్ళా ఇది ఇట్లయితే ఏ నుయ్యో గొయ్యో సూసుకోడం తప్ప దారి లేదు. ఈ ఒక్కతూరికి కండ్లు మూసుకోని పోండి'' అంటూ ఒగటే ఏడ్సినారు. కానీ పోలీసులు మాటినలేదు. జ్యోతికి పెండ్లి సేయమని' బడికి పంపిస్తామనీ రాపిచ్చుకోని, ఇంగోతూరి ఇట్లా సేస్తే అందరినీ లోపలేసి మూసేస్తామని భయపడిచ్చి పోయినారు'' అంది.
అయ్యో పాపమని రొంత జాలేసినా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. తరువాత రోజు అన్ని పత్రికల్లో ''చేయూత ఆధ్వర్యంలో ఆగిన బాల్యవివాహం'' అని ఫోటోలు వచ్చేశాయి.
జ్యోతి మొగం కనిపించకపోయినా ఊరు, తల్లిదండ్రుల వివరాలు అచ్చయ్యాయి అందరూ పోల్చుకునేలా.
అది జరిగిన తరువాత జ్యోతిని బడికి తిరిగి పంపిస్తారేమోనని ఎదురు చూశా. పదిరోజులు దాటినా రాలేదు. ఏమైందా అని కనుక్కుంటే రెండ్రోజుల కిందట బ్యాంగుళూరులో వుండే వాళ్ళ పెద్దనాయన ఊరికి వచ్చినాడంట. ఇంట్లో అందరూ దిగులుగా మొగాలు యేలాడదీసుకోని వుంటే '' ఎందుకురా ఏడుస్తారు. ఎన్ని సూళ్ళా ఇట్లాంటివి. చిన్న హోతూరులో మన బంధువున్నాడ్లే నడిపింటి ఎంకటసామని. ఆయన కూతుర్దిగూడా ఇట్లాగే ఆగిపోతే ఏమయింది. నెల తిరక్కుండానే సప్పుడు గాకుండా కాల్వబుగ్గకు తీస్కపోయి మూడుముళ్ళేయించి గమ్మున కాపురానికి అంపిచ్చినారు'' అన్నాడు.
''కానీ.. పోలీసులు కేసు పెడితే'' అన్నాడు జ్యోతివాళ్ళ నాయన అనుమానంగా, భయంగా.
''ఆళ్ళకింగేం పని లేదనుకుంటున్నావా... పట్టుకోవాలంటే రోజుకు లారీల్లెక్క దొరుకుతారు. అంతా వుత్తుత్తిదే. నీకంతగా భయమేస్తే వూళ్ళో పాపకు మొగం సెల్లడం లేదని సెప్పి నా యెంబడి బ్యాంగుళూరుకు అంపియ్యి. యేం జెయ్యాల్నో తర్వాత నే జెప్తా'' అంటూ జ్యోతిని తీసుకుపోయాడు.
అట్లా బడికి వస్తాదనుకొన్నది కాస్తా మరింత దూరమై పోయింది.
కొద్దిరోజులు దాటగానే అక్కన్నే ఒక గుడికి తీసుకపోయి మట్టసంగా తాళి కట్టించేసి కాపురానికి పంపించేసినారు.
ఆ విషయం తెలిసి మనసు కళుక్కుమంది.
వెంటనే స్నేహితునికి ఫోన్ చేశా. వాడు విషయం విని ''రేయ్... వదిలేయ్‌రా ఇంక. పెండ్లయిపోయిందంటున్నావు గదా... ఇవన్నీ ఈడ మామూలే. ఆపిన పెండ్లిళ్ళలో తొంభైశాతం నెల తిరక్కుండానే అయిపోతాయి. అది అందరికీ తెలిసిన రహస్యమే. ఈళ్ళపేరు చెప్పుకోని ఈడ సంస్థలు బలుస్తున్నాయిగానీ పిల్లలు మాత్రం పిట్టల్లా రాలిపోతూనే వున్నారు'' అన్నాడు ఫోన్ పెట్టేస్తూ.
జ్యోతి గురించి అప్పుడప్పుడు పిల్లలు సమాచారం అందించేవాళ్ళు. కొంతకాలానికి ఆ పాపతో బాటే చదివే పిల్లలు పదయిపోయి వెళ్ళిపోయారు. జ్యోతి గురించి చెప్పేవారే కరువయిపోయినారు. కాలంతో బాటు నెమ్మదిగా జ్యోతి ఆలోచనల తీవ్రత గూడా తగ్గుతూ వచ్చింది. అట్లా రెండు సమ్మచ్చరాలు గడిచిపోయాయి.
కానీ... ఈ మధ్యే ఆర్నెళ్ళ క్రింద ఒకరోజు బడిలో పాఠం చెబుతా వుంటే ఫోన్...
''సా... బాగున్నావా'' అంటూ.
''నువ్వు '' అన్నా ఆగొంతును నాదగ్గర చదువుకున్న అనేకమంది అమ్మాయిల గొంతుల్లో జల్లెడ పడుతూ.
''కనుక్కో...'' కిలకిలకిల నవ్వు.
అదే నవ్వు. వెన్నెల వాన కురిసినట్లుగా, చిరుజల్లులు మొహాన్ని చల్లగా తాకినట్లుగా, మనసును ఊయలలూపే నవ్వు.
''బంగారం... నువ్వేనా'' అన్నా సంబరంగా.
''అవుసా... బాగున్నావా'' అంది.
''బాగున్నారా... ఎక్కడున్నావు... ఎలా వున్నావు. ఒక్కసారి గూడా ఫోన్ చేయలేదే... అసలు గుర్తున్నానా'' అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశా.
''నీ నంబర్ లేదుసా... బ్యాంగుళూరు నుంచి అట్లనే అత్తోళ్ళింటికి అంపించినారు. మళ్ళా ఇదో ఇప్పుడే ఇన్ని సమ్మచ్చరాలకి వూళ్ళోకి అడుగుపెట్టడం. నువు రాసిన మెరుపులవాన పుస్తకం ఒకసారి నాకిచ్చినావు గుర్తుందా. దాన్ని అటకపై భద్రంగా దాసిపెట్టుకోనింటి. ఇంటికి రాగానే దేవునికి మొక్కులు మొక్కుకుంటా నే సేసిన మొట్టమొదటి పని అది వెదకడమే. దాంట్లో నీ నంబర్ కనబడగానే ఎంత సంబరమేసిందో తెలుసా'' అంది ఆనందంగా.
''ఏంరా.. చానా రోజులకొస్తివి. పండగనా'' అన్నా.
''లేదు సార్.. కాన్పుకి... ఐదోనెల'' అంది.
''అప్పుడేనా'' అన్నా.
'ఏం సెయ్యాల సార్... తప్పదు... ఆడదానిగా పుట్టినాక'' అంది పెద్ద వేదాంతిలా.
''ఎలా చూసుకుంటాడు నీ మొగుడు'' అనడిగితే నవ్వుతా '' పర్లేదు సార్. బానే సూసుకుంటాడు. ఇంతకీ మేడం, పిల్లలు ఎట్లా వున్నారు'' అంది మాట మారుస్తా.
అట్లా మళ్ళా మాటలు కలిశాయి. రోజూ ఏదో ఒక సమయంలో ఫోన్ చేసేది. ఎన్నెన్నో కబుర్లు చెప్పేది. పదే పదే బడిలో బాల్యాన్ని తలచుకొని సంబరపడేది. తన బాధలూ, సంతోషాలు నాలోకి ప్రవాహంలా వొంపేది. ''నాకు ఏడుపొచ్చినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావుసా. ఎన్ని వందలసార్లు నిన్ను తలచుకొన్నానో తెలుసా. వురుక్కుంటా వచ్చి నిన్ను సూడాలనిపిస్తాది. కానీ అప్పుడు కనబడనంత దూరం. ఇప్పుడు ఇంత దగ్గరికి వచ్చినా గదా... ఐనా ఇంట్లోవాళ్ళు కాలు బైటకి పెట్టొద్దు, కీడు అంటున్నారు. దాంతో నిన్ను సూడలేకుంటున్నా'' అంటూ ఏడ్చేసేది.
ఆలోచనల్లోనే ఆసుపత్రి వచ్చేసింది. లోపలికి అడుగు పెడుతుంటే బైటకొస్తున్న ఒక పదవతరగతి పాసయిన ఓల్డ్ స్టూడెంట్ కనిపించి ''నమస్తే సార్.. యాడికి'' అంటూ పలకరించాడు. ''అదేరా.. జ్యోతిని ఆసుపత్రిలో చేర్చినారంట గదా... చూద్దామని'' అన్నా. వాడు ఒక్క క్షణమాగి ''సార్... పొద్దున్నే తీసుకుపోయినారంట ఇంటికి. నేనూ ఆడికే పోతున్నా... వస్తావా.. పోదాం'' అన్నాడు. వాడు వరుసకు జ్యోతికి అన్నవుతాడు. నాకూ దానికీ మధ్యనుండే అనుబంధం గురించి వానికి బాగా తెలుసు. ఇద్దరం బండి మీద బైలుదేరాం. దారిలో వాడు ఒక్కమాటా మాట్లాల్లేదు. మౌనంగా మూగెద్దులెక్క కూచున్నాడు. కౌతాళంలో ఖాదరలింగస్వామి దర్గా దాటి కొంచెం ముందుకు పోగానే ఒక సందు చూపించాడు. అక్కడంతా జనం.
వాని వెనుక నెమ్మదిగా బైలు దేరాను.
ఆ ప్రదేశమంతా ఏదో విషాద వాతావరణం.
ఎవరి మొహాల్లోనూ ఆనందపు జాడ లేదు. మనసు కీడును శంకించసాగింది.
''ఏమైందిరా'' అన్నా వాని వంక చూసి.
''కాన్పు కష్టమై ఆసుపత్రిలోనే...'' మాటల మధ్యలోనే అంతవరకు ఆపుకున్న దుఃఖం వాని కళ్ళ నుండి బైటకు దుంకి గొంతు మూగబోయింది.
కాళ్ళ క్రింద భూమి నిలువునా చీలినట్లనిపించింది.అంతలో వాడు '' వరుసగా మూడుసార్లు మూన్నెళ్ళకే అబార్షన్ అయిందంటసా... సిన్న పిల్ల. ఇంకా ఎదగలా. తట్టుకోలేకుంటుంది. కొంతకాలం ఆగండి అని ఎవరు సెప్పినా మొగుడు విన్లేదంట. 'అంత సేతగాకపోతే కనేదాన్నే తెచ్చుకుంట. తీసుకుపోండి.' అంటూ తిట్లూ తన్నులంట. కాపురం నాశనం సేసుకోగూడదని అన్నిట్నీ అట్లనే భరించింది. మందుల మీద మందులు మింగింది. ఆఖరికి నాలుగోసారి నిలబడిందంట. హమ్మయ్య అని అందరూ సంబరపడి సీమంతం సేసి పువ్వులా సూసుకున్నా.. రక్తం తక్కువయిపోయిందంట. దాంతో బిడ్డ బతికింది గానీ పాపం...'' అన్నాడు ఏడ్పును ఆపుకుంటూ.
జ్యోతిని ఇంటి ముందు పడుకోబెట్టి తెల్లని బట్ట కప్పారు. ఒకొక్కరే పోయి చూసి వస్తున్నారు. నా బంగారాన్ని చివరిసారిగా అలా శవంలా చూడ్డానికి నా మనసొప్పలేదు. కళ్ళ ముందు చిరునవ్వులు నవ్వుతున్న రూపమే మెదులుతా వుంది. దాన్ని నాగుండెల్లో అట్లాగే పొదుగుకుంటూ మౌనంగా వెనక్కు తిరిగా.
అంతలో ఇంటి లోపలి నుంచి చిన్నగా పసిపాప ఏడుపు... కమ్మగా ... పిలుస్తూ...
లోపలికి అడుగు వేశా.
ఆడపిల్ల.
నల్లగా ... పెద్ద పెద్ద కళ్ళతో... కొశ్శని ముక్కుతో... అచ్చం నా బంగారం లాగానే.
మెడ క్రింద చేయిపెట్టి అపురూపంగా పైకి ఎత్తుకున్నాను.
పాప ఏడుపు ఆపి చిరునవ్వులతో నావంక చూసింది. దాని శరీరం నా హృదయానికి మెత్తగా, వెచ్చగా, ఆత్మీయంగా నా కూతురు లాగా తాకుతోంది. అది నా కళ్ళలోకి కన్నార్పకుండా అట్లాగే చూస్తా వుంది.
నా చిటికెన వేలు ఆపాప లేత పిడికిలిలో నలుగుతా వుంది.
***********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి