సుప్రభాత కవిత ; -బృంద
ఊరించే దూరపు కొండలు
వారించవు పాలమబ్బులను
తాకి కురిసే ముచ్చట కోసం
ఆహ్వానించవా ఆనందంగా!

చిత్తమంటి చిరు తటాకము
ముత్యమంటి మబ్బును చూసి
దాచుకోగా తనలో..ప్రేమగా
ఆకాంక్షించదా  అపురూపంగా!

కాసారపు కమ్మని వలపును
కనిపెట్టిన లోయలన్నీ
కూతవేసి రమ్మని పిలిచి
కబురు తెలుపదా అపేక్షగా!

గాలిపాడే వేణుగానానికి
గోలచేసే చిట్టి అలలు
అనుమతిమ్మని అడిగి మరీ
నర్తించదా  అపూర్వంగా!

పచ్చదనం నిండిన కనుమలు
మరకతాలు పొదిగినట్టు
నగలాగా శోభిస్తూ అవనిని
అలంకరించదా  అందంగా!

జగమంతా ప్రేమ మయం
స్వార్థమెరుగని నిర్మలం
అడుగకనే ఆహ్లాదాన్ని
అందించదా  అద్వితీయంగా!

అవనిలో అందాలన్నీ
అక్కడే కొలువుతీరి
అందమైన చిత్రపటంలా
అలరించే వెలుగుల వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు