గతమేమిటీ... భవిష్యత్తు ను మాట్లాడుకుందాం : ఒలింపియన్;- - యామిజాల జగదీశ్


 ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఒలింపిక్ ఛాంపియన్  ఆగ్నెస్ కెలేటి (Agnes Keleti)! ఆమె వయస్సు నూట మూడేళ్ళు! హంగరీకి చెందిన ఈమె 1952 హెల్సింకి గేమ్స్, 1956 మెల్బోర్న్ గేమ్స్‌లో ఐదు స్వర్ణాలతో సహా మొత్తం పది జిమ్నాస్టిక్స్ పతకాలను గెలుచుకున్నారు. 
వంద వసంతాలు పూర్తి చేసుకున్న ఆమె ఇప్పటికీ తాను తగినంత ఎనర్జీతో ఎంతో ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు. 
"గతమా?  గతం గురించి ఎందుకు... భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. అదీనూ  అందంగా ఉండాలి..ఇంకా గతం గతం అంటూ చెప్పుకోవడమెందూకూ.. అది జరిగిపోయిన కథ...వర్తమానం సరేసరి.. భవిష్యత్తంటూ ఉందిగా." అని అంటుంటారామె.
ఈ హంగేరియన్ మాజీ ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్. ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్ కోచ్ గా ఆమె ఎందరికో శిక్షణ ఇచ్చారు. ఆమె 2021 జనవరి 9న తన 100వ పుట్టినరోజుకున్నారు. 
అత్యంత విజయవంతమైన యూదు ఒలింపిక్ అథ్లెట్లలో ఒకరుగా చరిత్రపుటలకెక్కిన కెలేటి ఇజ్రాయెల్ పౌరసత్వం ఉన్న ఇతరుల కంటే ఎక్కువ ఒలింపిక్ పతకాలు గెల్చుకున్నారు. మార్క్ స్పిట్జ్ మినహా ఇతర యూదుల కంటే ఎక్కువ ఒలింపిక్ పతకాలను సొంతం చేసుకున్న కెలెటీ రికార్డు గమనించతగ్గది.
హంగేరిలోని బుడాపెస్ట్‌లో జన్మించిన  ఆమె 4 సంవత్సరాల వయస్సులో జిమ్నాస్టిక్స్ ప్రారంభించారు. 16 సంవత్సరాల నాటికి జిమ్నాస్టిక్స్‌లో హంగేరియన్ నేషనల్ ఛాంపియన్‌గా నిలిచారు. ఆమె తన కెరీర్‌లో, 1937 - 1956 మధ్య, పదిసార్లు ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నారు.
1941లో ఆర్యన్యేతరురాలు అయినందుకు ఆమెను జిమ్నాస్టిక్స్ క్లబ్ నుండి బహిష్కరించారు. యుద్ధం నుండి బయటపడేందుకు కెలేటి అజ్ఞాతంలోకి వెళ్ళవలసి వచ్చింది. పెళ్లయిన స్త్రీలను లేబర్ క్యాంపులకు తీసుకెళ్లడం లేదనే పుకారు చెవిన పడటంతో ఆమె 1944 లో ఇస్తావాన్ సర్కానీని హడావిడిగా వివాహం చేసుకున్నారు. అయితే  వీరు1950లో విడాకులు తీసుకున్నారు. 
కేలేటి ఒక క్రైస్తవ అమ్మాయి గుర్తింపు పత్రాన్ని కొనుగోలు చేసి ఓ చిన్న గ్రామంలో పనిమనిషిగా పని చేయడం ద్వారా యుద్ధం నుండి బయటపడ్డారు. ఆమె తల్లి, సోదరి అజ్ఞాతంలోకి వెళ్లారు. దౌత్యవేత్త కార్ల్ లూట్జ్, బహుశా స్వీడిష్ దౌత్యవేత్త రౌల్ వాలెన్‌బర్గ్ జారీ చేసిన స్విస్ రక్షణ పత్రాలను ఉపయోగించి ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఆమె తండ్రి, ఇతర బంధువులు నాజీలచే ఆష్విట్జ్ నిర్బంధ శిబిరంలో హత్యకు గురయ్యారు. 
1944 - 45 శీతాకాలంలో, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి సోవియట్ దళాలచే బుడాపెస్ట్ ముట్టడి సమయంలో , కెలెటి తనకు చెందిన వారి మృతదేహాలను సేకరించి సామూహిక సమాధిలో ఉంచారు. 
1946లో, ఆమె తన మొదటి హంగేరియన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. 1947లో, ఆమె సెంట్రల్ యూరోపియన్ జిమ్నాస్టిక్స్ టైటిల్‌ సాధించారు.  ఆమె 1948 సమ్మర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. కానీ ఆమె కారణాంతరాల వలన పోటీకి దూరమయ్యారు.  
1949 వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో ఆమె నాలుగు స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 
హెల్సింకిలో  జరిగిన 1952 ఒలింపిక్ గేమ్స్‌లో 31 సంవత్సరాల వయస్సులో ఆమె మొదటిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఆమె నాలుగు పతకాలు సాధించారు.
1956 లో మెల్‌బోర్న్‌లో జరిగిన వేసవి ఒలింపిక్స్‌లో , కెలేటి నాలుగు వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్స్‌లో మూడింటిలో బంగారు పతకాలతో సహా ఆరు పతకాలను గెలుచుకున్నారు. ఈ  ఒలింపిక్స్ లో ఆమె అత్యంత విజయవంతమైన క్రీడాకారిణిగా  ప్రశంసలందుకున్నారు.
1956 ఒలింపిక్స్ సమయంలో సోవియట్ యూనియన్ హంగరీపై దాడి చేసింది. కెలేటి, హంగేరియన్ ప్రతినిధి బృందంలోని 44 మంది అథ్లెట్లతో కలిసి ఆస్ట్రేలియాలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.  రాజకీయ ఆశ్రయం పొందారు.  ఆమె ఆస్ట్రేలియన్ జిమ్నాస్ట్‌లకు కోచ్‌గా శిక్షణ ఇచ్చారు.
కెలేటి 1957లో ఇజ్రాయెల్‌కు వలసవెళ్లారు.
1959లో, ఆమె ఇజ్రాయెల్‌లో పరిచయమైన హంగేరియన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ రాబర్ట్ బిరోను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ( డేనియల్, రాఫెల్). ఆమె పదవీ విరమణ తరువాత,  టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా నెతన్యలోని వింగేట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పోర్ట్స్‌లో 34 సంవత్సరాలు పనిచేశారు.
ఆమె 1990ల వరకు ఇజ్రాయెల్ జాతీయ జిమ్నాస్టిక్స్ జట్టుకు శిక్షణ ఇచ్చారు. ఆమె ప్రస్తుతం బుడాపెస్ట్‌లో నివసిస్తున్నారు.


కామెంట్‌లు