న్యాయాలు -618
బిల్వ విభజన న్యాయము
******
బిల్వ అనగా మారేడు చెట్టు, మారేడు పండు.విభజన అనగా విడగొట్టుట అని అర్థము.
మారేడు పండును పగుల గొట్టినట్లు."అనగా తెలియని విషయం పట్ల ఎలాంటి నిర్ణయానికి రాకుండా ఉండటం.
మరి ఎన్నో రకాల పండ్లు, కాయలు వుండగా కేవలం మారేడు పండును మాత్రమే పగుల గొట్టడం గురించ ఎందుకు చెప్పారో చూద్దాం.
ఇక బిల్వ/మారేడు చెట్టు,పండు మొదలైన వాటి గురించి తెలుసుకుందామా...
ప్రకృతి మనకు బతకడానికి ప్రాణవాయువు, తినడానికి పండ్లు, కాయలతో పాటు అనారోగ్యానికి ఔషధంగా పనిచేసే ఎన్నో రకాల చెట్లను ప్రసాదించింది. అందుకే మన భారత దేశంలోని ప్రజలు చెట్లను దైవంగా భావించి పూజిస్తారు.
అడవిలో తిరిగే అడవి బిడ్డలు ఔషధ మొక్కల రహస్యాలు తెలుసుకుని సమాజానికి అందించారు.అలా ఔషధ మొక్కల జ్ఞానం చరిత్ర కంటే పురాతనమైనదని చెప్పవచ్చు. వందల వేల సంవత్సరాల క్రితమే భూవాసులకు. సృష్టి కర్త అయిన బ్రహ్మ ఈ ఔషధ మొక్కలను బహుమతిగా ఇచ్చాడని భారతీయులు నమ్ముతారు.
అడవుల్లో నివసిస్తూ తపస్సు చేసుకునే ఋషులు ఔషధ మొక్కల ఆనుపానులు బాగా తెలుసుకుని ఆ విజ్ఞానాన్ని ఆయుర్వేదంగా మానవుల అనారోగ్య బాధలు నయం చేయడానికి ఉపయోగించారు.
ఆ విధంగా మన భారత దేశంలోని అడవుల్లో పెరిగే బిల్వ వృక్షము యొక్క ప్రాముఖ్యతను, ఆయుర్వేద చికిత్స పరంగా చెట్టులోని ప్రతి భాగము ఔషధ గుణాలు కలిగి ఉందని తెలుసుకున్నారు. ఈ బిల్వ వృక్షము నేల స్వభావంతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లో పెరగడం విశేషం.
ఇక ఈ బిల్వ వృక్షము గురించి స్వామి శివానంద గారు మాట్లాడుతూ ఈ చెట్టుకు గాలి వల్ల కలిగే అన్ని రకాల వ్యాధులను నయం చేసి శరీరానికి బలాన్ని ఇచ్చే శక్తి ఉందని చెప్పారు.
ఇక చెట్టు విషయానికి వస్తే ఇది 8నుండి 10మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ బిల్వ పత్రాలు/ ఆకులు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగులో ఉండి ఎంతో చక్కని సువాసన కలిగి ఓ దివ్యమైన అనుభూతిని కలిగిస్తాయి.మారేడు/ బిల్వ కాయలు లేదా పండ్లు పైకి చెక్కలా చాలా గట్టిగా ఉంటాయి.అందులోని గుజ్జులో బోలెడు విత్తనాలు ఉంటాయి.
బిల్వ పత్రాలు, పండ్లు, కాయలు, బెరడు, వేర్లు, పూవులు అన్నింటినీ ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు లోని ప్రతి భాగము మానవాళికి మేలు చేసేదే.
హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైనది. ఈ మారేడు దళాలు మూడు కలిపి శివుని మూడు కళ్ళవలె వుంటాయి. అందుకే మారేడు దళాలను తప్పకుండా శివార్చనలో ఉపయోగిస్తారు. దీనికి సంబంధించి వేటూరి ఓ చక్కని భక్తి పాట రాశారు " " శివ శివ శంకర భక్తవ శంకర - శంభో హరహర నమో నమో/మా రేడు నీవని ఏరేరి తేనా? మారేడు దళములు నీ పూజకు " ఈ పాట ప్రతి శివభక్తుడు పాడుకుంటూ తరిస్తాడు.శివుడు ఈ మారేడు చెట్టు క్రింద నివాసం ఉంటాడని ప్రతీతి. అందుకే ప్రతి శివాలయంలో మారేడు చెట్టును తప్పకుండా పెంచుతారు.
ముఖ్యంగా "బిల్వ విభజన న్యాయము" విషయంలో రెండు అంశాలు గుర్తు పెట్టుకోవాలి.ఒకటి మారేడు పండును పగుల గొట్టడం అంతా సులభమేం కాదు.ఒకవేళ సమాన భాగాలుగా విడగొట్టాలంటే ఎంతో ఒడుపు,నేర్పూ అవసరం.అలా జాగ్రత్తగా పగల గొడితేనే విడివడుతుంది.లేదంటే లోపల ఉన్న గుజ్జు అటూ ఇటూగా హెచ్చుతగ్గులు రావచ్చు.అలా హెచ్చుతగ్గులు విషయ నిర్ధారణలో ఉంటాయనే అర్థంతో చెబుతుంటారు.
మరో అంశం ఏమిటంటే లోపలి గుజ్జును జ్ఞానానికి, మానవీయ హృదయానికి ప్రతీకగా తీసుకోవడం జరిగింది.పైన గట్టిగా ఉన్నంత మాత్రాన లోపల కూడా గట్టిగా ఉంటుందనే నిర్ణయానికి, రాకూడదని, అపోహ పడకూడదనీ,విషయ జ్ఞానం లేదని భావించకూడదని కూడా ఈ"బిల్వ విభజన న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
కొందరి మాట తీరు పైకి కఠినంగా అనిపించినా లోపల మంచి తనం, మానవతా ఉంటాయి. బిల్వ ఫలమును పగుల గొడితే విషయమేంటో తెలిసినట్లే, మనిషిని తరచి చూస్తేనే మనసులోని మర్మం తెలుస్తుందనీ,ఎవరినీ ఎక్కువగా, తక్కువగా అంచనా వేయకూడదనేది ఈ న్యాయము ద్వారా మనం గ్రహించాల్సింది నీతి, సంస్కారం అన్న మాట.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి