సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-617
బిలవర్తి గోధా న్యాయము
****
బిల అనగా రంధ్రము,పల్లము,కన్నము,గోయి,గుహ.వర్తిన్ అనగా ఉండు వాడు.గోధా అనగా గోధికా, ఉడుము అనే అర్థాలు ఉన్నాయి.
రంధ్రములో లేదా గుహలో ఉన్న ఉడుము లేదా మరేదైనా పాకే జీవులను చంపడం వీలు కాదని అర్థము.
అనగా ఏ జంతువైనా సరే దాని స్థావరంలో ఉన్నట్లయితే చంపడం కష్టం.స్థాన బలిమి అంత పటిష్టంగా ఉంటుందని భావం.
మరి దానికి సంబంధించిన పద్యాన్ని చూద్దామా...
"నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు పట్టు/ బయట కుక్క చేత భంగపడును/ స్థాన బలిమిగాని తన బల్మి గాదయా/ విశ్వధాభిరామ వినురవేమ!!!"
అనగా నీటిలో ఉన్నప్పుడు మొసలి చిన్నది అయినప్పటికీ, చాలా పెద్దదైన ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపేయగలదు.కానీ ఆ మొసలి తన స్థానమైన నీటిని వదిలి బయటికి వచ్చినప్పుడు కుక్క చేత కూడా ఓడింపబడుతుంది. అనగా మొసలికి అంత బలం కేవలం తన స్థానం వల్లే వచ్చింది కానీ దాని స్వంత బలం వల్ల కాదని భావం.
ఇక ఉడుము గురించి కొన్ని విషయాలు విశేషాలూ తెలుసుకుందాం.
ఉడుము అనేది చాలా చిన్న జంతువు.దీనిని గోధిక అని కూడా అంటారు.రాజుల కాలంలో సైనికులు  ఈ ఉడుము నడుముకు తాడు కట్టి కోట గోడలు ఎక్కడానికి ఉపయోగించేవారు.ఎందుకంటే అది గోడను కానీ కొండను కానీ ఒకసారి పట్టుకుందంటే దానిని సడలించడం ఎవరి తరం కాదు.అందుకే సైనికులు దాని నడుముకి కట్టిన తాడును పట్టుకొని పాకుతూ కోట గోడలు ధైర్యంగా ఎక్కగలిగే వారు.ఛత్రపతి శివాజీ సైతం ఉడుము సహాయం తీసుకున్నాడని మనం చదువుకున్నాం.అందుకేనేమో"ఉడుము పట్టు" అనే జాతీయం  వచ్చింది.
ఉడుము ప్రపంచంలోనే అతి పెద్ద బల్లి జాతికి చెందినది.ఇవి ఇండోనేషియా దీవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. పెద్ద ఉడుము గరిష్టంగా మూడు మీటర్ల వరకు పెరుగుతుందనీ,70 కిలోలకు పైగా బరువు వుంటుందనీ,దీని జీవిత కాలం ముప్పై ఏళ్లు వుంటుందని జంతు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఉడుముకు భారీ శరీరం మరియు చాలా శక్తివంతమైన కాళ్ళు,వాటి పాదాల్లో బలమైన పంజాలు కలిగి ఉంటుంది. ప్రపంచంలో మొత్తం 31 రకాల ఉడుము జాతులు ఉన్నాయి.అందులో నాలుగు జాతులు భారత దేశంలో ఉన్నాయి. అయితే మానవుడి దానవత్వం వల్ల వీటి జాతి క్రమంలో అంతరించి పోతోంది.అందుకే ఉడుమును పట్టుకున్నా,చంపినా ప్రభుత్వం పాతిక వేల రూపాయల జరిమానా, ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ చట్టం చేసింది.
ఉడుము చాలా కాలం జీవిస్తుందని చెబుతూ రాసిన సుమతీ శతక పద్యాన్ని చూద్దాము.
"ఉడుముండదె నూఱేండ్లును/ బడియుండదె పేర్మి పాము పది నూఱేండ్లున్/మడుపున గొక్కెర యుండదె/ కడునిల బురుషార్థ పరుడు గావలె సుమతీ...!"
అనగా ఉడుము నూరేళ్ళు, పాము వెయ్యేళ్ళు, కొంగ మడుగులో చాలా కాలం దాకా జీవిస్తాయి.అయితే వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.అదే మంచి పనులను చేసేందుకు ఆసక్తి కలిగిన వారు ఉన్నట్లయితే వారి వల్ల లోకానికి ప్రయోజనం ఉంటుందని సుమతీ శతక కర్త ఈ పద్యంలో వివరించాడు.
మనము ఈ "బిలవర్తి న్యాయము"ను మన పెద్దలు మానవ జీవితానికి అన్వయించి చెప్పారు.అందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే స్థాన బలిమిని మించిన కలిమి లేదు.కష్టమొచ్చినప్పుడు ఆదుకోవడానికి,సుఖమొచ్చినప్పుడు పంచుకోవడానికి పది మందైనా ఉండాలి.అలాగే మనం ఎన్నాళ్ళు  బతికామన్నది కాదు ముఖ్యం.ఎలా బతికాము? ఏమేం మంచి పనులు చేసాం అనేది ముఖ్యం. ఇవి రెండూ గమనంలో పెట్టుకొని జీవనాన్ని కొనసాగించమని చెప్పేందుకే ఈ న్యాయమును ఉదహరించారు.

కామెంట్‌లు