అభివృద్ధి మంత్రం;- - బోగా పురుషోత్తం, తుంబూరు.

 ఆనందగిరిని అరణ్యానందుడు పాలించేవాడు. నిత్యం ఆనందగిరి ప్రజల మోముల్లో ఆనందం చూడడమే ధ్యేయమని భావించేవాడు అరణ్యానందుడు. ఈ కారణంగానే  పాలనా ఖర్చులు తగ్గించి పొదుపు పాటించి  ప్రజా సంక్షేమానికి అధిక నిధులు కేటాయించేవాడు.  దీంతో పన్నుల భారం తగ్గి ప్రజలు కష్టం తెలియకుండా సుఖంగా జీవనం సాగించేవారు.
  ఇది చూసిన రాజ ఉద్యోగులు తమ సంక్షేమాన్ని రాజు విస్మరించాడని ఆవేదన చెందేవారు.  ఇదేమీ పట్టని అరణ్యానందుడు ప్రజల సంక్షేమాన్ని కొనసాగించాడు.
  రాజ్యంలో క్రమంగా పన్నుల భారం తగ్గి ఆదాయం లేకుండా పోయింది. ఇది గమనించిన పలువురు రాజనీతి విశ్లేషకులు పన్నుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి..లేదంటే చాలా ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి  వుంది..’’ అని హెచ్చరించారు. అయినా వినలేదు.
కొద్ది రోజులకు పూర్తిగా ఆదాయ వనరులు కరువయ్యాయి. రాజ్యంలో సంక్షేమ పథకానికి నిధులు కరువై ఆగిపోయాయి. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. రాజోద్యోగులు వేతనాలు లేక అలమటించారు. దీనికి తోడు పెద్ద తుపాను రావడంతో ప్రజల ఆహార పదార్థాలు, ఇళ్లు కొట్టుకుపోయి నిరాశ్రయులయ్యారు.  వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. చేసేదేమీ లేక రాజు తలపట్టుకు కూర్చుని దిక్కుతోచక దీర్ఘంగా ఆలోచించసాగాడు.
   అదే సమయానికి పొరుగు రాజ్యాధిపతి విరూపాక్షుడు దయా హృదయం తో కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. అది తీసుకుని రాజోద్యోగులకు జీతభత్యాలు చెల్లించాడు. తీసుకున్న పాతిక లక్షల రూపాయలు అయిపోయాయి. ఇక ఏమి చేయాలో తెలియక రాజు అయోమయంగా ఆలోచించసాగాడు.
  అప్రమత్తమైన రాజోద్యోగులు  ప్రభుత్వ భూముల్లో వివిధ ఆహార పంటలు పండించారు. అహర్నిశలు శ్రమించడంతో  పంటలు బాగా పండాయి.  ఆ ధనాన్ని తమ అవసరాలకు  మించి వుండడంతో  పొరుగు రాజు విరూపాక్షుడికి ఇచ్చారు.  తీసుకున్న అప్పు సమస్య తీరిపోయింది. రాజు మనసు కాస్త తేలిక పడిo ది. ఇక అభివృద్ధి వైపు దృష్టిసారించాడు.
   ప్రజలకు సంక్షేమ పథకాలు రద్దుచేసి  పనికి ఆహార పథకం ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగా కొండలు, గుట్టలు, కాలువలు తవ్వి ఉపయోగకరంగా మలిచే పనులు ప్రజలకు ఇచ్చాడు. అలు రాజ్యానికి పంటలు పండించేందుకు,  ఇటు ప్రజలకు ఉపాధి మార్గంగా కనిపించింది. పన్నులు సైతం చెల్లించడంతో రాజ్యానికి ఆదాయం సమకూరింది.  ఆర్థికాభివృద్ధి పుంజుకుంది.  రాజు అనుసరించిన అభివృద్ధి మంత్రం తో రాజ్యం సుభిక్షంగా మారింది.  ప్రజలు సైతం పనిచేయడం నేర్చుకుని అభివృద్ధి సాధించి ఆనందంగా గడిపారు.

కామెంట్‌లు