ప్రయాణం చాలా చిన్నది ;- - యామిజాల జగదీశ్
 ఓ వృద్ధురాలు బస్సు ఎక్కి కూర్చుంది. బస్సు బయలుదేరింది. తర్వాతి బస్టాపులో ఒక బలమైన, క్రోధస్వభావం గల యువతి ఎక్కి వృద్ధురాలి పక్కన అసహనంతో కూర్చుంది. అంతేకాకుండా తన దగ్గరున్న సంచులు వృద్ధురాలికి తగులుతూనే ఉన్నాయి. ఇంకొకరైతే గొడవ పెట్టే వారే.
కానీ వృద్ధురాలు మౌనంగా ఉంది. ఆమె ఏమీ జరిగినట్టు కూర్చుంది. ఆమె వైఖరి చూసి యువతి విస్తుపోయింది. "నా సంచులు మిమ్మల్ని తాకుతున్నా మీరు ఒక్క మాటా అనలేదేంటీ" అని యువతి ప్రశ్నించింది.
వృద్ధురాలు చిరునవ్వుతో  "మీతో మొరటుగా ప్రవర్తించాల్సిన అవసరమేముంటుంది? మీ సంచులు నాకు తగులుతున్న విషయమై గొడవపడాల్సిన ముఖ్యమైన విషయం కాదండీ... ఎందుకంటే తదుపరి స్టాప్‌లో దిగబోతున్నాను. మనం కలిసి ప్రయాణం చేసే దూరం చాలా చిన్నది." అని చెప్పింది.
ఈ సమాధానం అమోఘమైనది. "మీ సంచులు నాకు తగులుతున్న విషయమై గొడవపడాల్సినంత ముఖ్యమైన విషయం కాదండీ... ఎందుకంటే మనం కలిసి ప్రయాణం చేసే దూరం చాలా చిన్నది" అనే మాటలు మరచిపోకూడదు ఇవి.
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి ప్రయాణం బహుదూరమైనదేమీ కాదు. ఒకరిది తక్కువ కాలం, మరొకరిది దీర్ఘకాలం కావచ్చు.  జననం మరణాల మధ్యదూరంలో తేడా ఉన్నా అదేమీ శాశ్వతం కాదు. ఈ కాలాన్ని అనవసరపు పోరాటాలతో కోపతాపాలతో పనికిరాని వాదనలతో అసూయతో ఇతరులను క్షమించకపోవడంతో అసంతృప్తితో గడుపుతూ జీవితాన్ని చీకటిగా  మార్చుకోవడం సరికాదు. రాగ ద్వేషాలకు మన శక్తినంతా వృధా చేసుకోవడం హాస్యాస్పదమే  అవుతుందని అర్థం చేసుకోవాలి.
ఎవరైనా మన హృదయాన్ని విచ్ఛిన్నం చేశారా? నిగ్రహాన్ని కోల్పోక ప్రశాంతంగా ఉండటం అవసరం. ఎందుకంటే మనం ప్రయాణం చాలా చిన్నది.
ఎవరైనా మనకు ద్రోహం చేశారా, మనల్ని భయపెట్టారా, మోసం చేశారా లేదా అవమానించారా?  రిలాక్స్ అవాలి. ఎందుకంటే ప్రయాణం చాలా చిన్నది.
కారణం లేకుండా ఎవరైనా మనల్ని అవమానించారా?  ప్రశాంతంగా ఉండాలి.  పట్టించుకోకూడదు. ఎందుకంటే ప్రయాణం చాలా చిన్నది.
మనకు నచ్చని విషయం గురించే పదేపదే ఇరుగుపొరుగువారు మాట్లాడుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి.  దాని గురించి పట్టించుకోకూడదు. మనసులోకి పోనివ్వకూడదు. ఎందుకంటే ప్రయాణం చాలా చిన్నది.
ఎవరైనా మనకు ఎలాంటి సమస్య తెచ్చినా, వారితో మనం కలిసి చేసే ప్రయాణం చాలా చిన్నదని గుర్తుంచుకోవాలి.
ఆ ప్రయాణం ఎంత పొడవైనదో పొట్టిదో ఎవరికీ తెలియదు. అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఆగిపోతుందో ఎవరికీ తెలియదు. ఎవరితోనైనా కలిసి చేసే మన ప్రయాణం చాలా చిన్నది. ఈ ప్రయాణంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలి.
మనం గౌరవప్రదంగా, దయతో క్షమించాలి. మనం కృతజ్ఞతతో  ఆనందంతో సాగిపోవాలి.  మన ప్రయాణం చాలా చిన్నది.

కామెంట్‌లు