సుప్రభాత కవిత ; -బృంద
కొత్తదారి వెదుక్కుంటూ
మత్తు వదిలి మగత వీడి
మెత్తగా జారుకుంటున్న
ఏటినీటి పయనం.

పరుగు తీయు నీటి మీది
తరగలను తాకుతూ
జరిగిపోతున్న ప్రవాహపు
నురుగులకు వీడుకోలంటూ....

కదిలి కమ్ముకొస్తున్న
కనిపించని వేగపు
కొత్తనీటికి వేచి వుండి
కరచాలనంతో స్వాగతిస్తూ..

ఇరువైపుల ఏపుగా ఎదిగి
పరుగెత్తే జలధారలో తొంగిచూసి
తనరూపును సవరించుకునే
గరికపొదల పచ్చదనాన్ని....

చూసి కూడా ఆగకుండా
తనదారిన వేగంగా
తరుముకొచ్చు సర్పంలా
తరలిపోయే సెలయేటికి

వెచ్చగ వీపును నిమిరే
స్వచ్ఛమైన అనురాగపు
గుచ్ఛంలా వెలుగందిస్తూ
వేంచేసిన వెలుగుల వేలుపు

కురిపించే కాంచన ధారలతో
మై మరపించే సంతోషంలో
మునిగి ఉక్కిరి బిక్కిరై
నిలిచి నీరాజనమిచ్చిన నీటికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు