తెలుగులో రాణిస్తున్న గణితోపాధ్యాయుడు "గద్వాల"

 కర్నూలు జిల్లా, పెద్దకడబూర్ మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త,బాలబంధు గద్వాల సోమన్న గారు ఆలూరు మండలం, మొలగవల్లి గ్రామ వాస్తవ్యులు.సాధారణ రైతు బిడ్డయైన సోమన్న అన్నావదినల సహకారంతో పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ,కర్నూలులో ఇంజనీరింగ్ పూర్తి చేసి,అనంతరం సమాజంలో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆకర్షితుడై రంగారెడ్డి జిల్లా  సరూర్ నగర్,తెలంగాణలో 2000 సంవత్సరంలో ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు.అనంతరం 610 జి.ఓ పై సొంత జిల్లా కర్నూలుకు వచ్చి ప్రస్తుతం కంబదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థి దశలోనే,తెలుగు భాషోపాధ్యాయులు కీ.శే.ఈరన్న సార్ గారి స్పూర్తితో  మాతృభాష తెలుగు పట్ల ఆశక్తి పెంచుకుని,వారి శిక్షణ లో 9వ తరగతి చదువుతున్నప్పుడే వీరు వ్రాసిన "మానవతా విలువలు" ఆర్టికల్ ఆంధ్రభూమి దిన పత్రికలో ప్రచురితం కావడం విశేషం.అలా గురుదేవుల ఆశీస్సులతో ప్రారంభమైన వారి సాహితీ పయనం అనతి కాల వ్యవధిలో 56 పుస్తకాలు వ్రాసి ముద్రించడానికి శ్రీకారం చుట్టింది."పసి(డి)హృదయాలు" వీరి తొలి పుస్తకం కాగా ,"చిట్టి చిట్టి కమలాలు" సోమన్న గారి 56వ పుస్తకం. ముఖ్యంగా "జిల్లా ఉత్రమ ఉపాధ్యాయ అవార్డు" గ్రహీత కావడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అర్థ శతాధిక బిరుదులు,పురస్కారాలు అందుకోవడం గమనార్హం.రమారమి 25 ఇతరుల పుస్తకాలకు ముందు మాటలు వ్రాశారు.పద్యాలు,కథలు,గేయాలు మున్నగు తెలుగు ప్రక్రియలలో మూడు వేలుకు పైగా రచనలు చేయడమే కాకుండా "పసి(డి)హృదయాలు" సాహితీ వేదిక ను స్థాపించి ఎందరో వర్ధమాన కవులకు,రచయితలకు ,విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.తను మాత్రమే కాకుండా హెచ్.మురవణి ప్రాథమిక పాఠశాలలో  పనిచేస్తున్నప్పుడు విద్యార్థులచే చిన్ని చిన్ని రచనలు చేయించి "చిట్టి చేతులు-గట్టి రాతలు" సంకలనం తేవడం సంచలనం. తెలుగు భాషకు ఆదరణ తరుగుతున్న తరుణంలో "దేశ భాషలందు లెస్సయిన" తెలుగు వెలుగుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయడం అందరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు గద్వాల సోమన్న.గణితోపాధ్యాయుడైన గద్వాల సోమన్న మాతృభాషపై మమకారంతో తెలుగు భాషోపాధ్యాయులకు ధీటుగా రాణించడం శుభ పరిణామం,స్ఫూర్తిదాయకం.
కామెంట్‌లు