మహిమాన్వితం స్వస్వరూప దర్శనం;-సి.హెచ్.ప్రతాప్

 భగవంతుని నామజపం ధ్యానానికి ఏకాగ్రతకు ఉపకరిస్తుంది. భగవన్నామాన్ని మనం ధారణ చేసేముందు, మనస్ఫూర్తిగా పూర్తి విశ్వాసంతో ఆయన్ని ఆహ్వానించాలి. మనం ఆ విధంగా నమ్మకముంచితే ఆ భగవన్నామం మనసు విడువకుండా మనతో ఉంటుంది. భగవన్నామజపం మనలో నిరంతరం కొనసాగుతుంటే ఇతర విషయములపైకి మనసు పరిగెత్తకుండా, నిశ్చలవౌతుంది. అప్పుడు మనిషి తన నిజస్థితి (ఆత్మతత్వం)లో ఉంటాడు.దుర్లభమైన నిర్వికల్ప సమాధిని ఆత్మదర్శనం లేదా స్వస్వరూప దర్శనం అంటారు. పరబ్రహ్మ సాక్షాత్కారం లేదా ఆత్మసాక్షాత్కారం పొందడమే నిజమైన పరమానందం.సర్వ వేద  సారం సమస్త తత్వ శాస్త్రాల సారాంశం, “నేనే భగవంతుడను” అనే అనుభూతిని పొందడం. నామ, రూప, గుణ రహిత సచ్చిదానంద పరబ్రహ్మమే ప్రతీజీవి సత్య స్వరూపం.యోగం అంటే మనోవికారాలను నిరోధించడమే. చిత్తవృత్తులను నిరోధించినపుడు పురుషుడు స్వస్వరూపం పొందుతాడు. స్వచ్ఛస్ఫటికం వద్ద ఏ రంగు పువ్వును ఉంచితే స్ఫటికంలో ఆ రంగు ప్రతిఫలించి స్ఫటికం ఆ రంగులో కనిపిస్తుంది. పువ్వును తొలగించినపుడు స్ఫతికం తిరిగి స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అలాగే చిత్త వృత్తులు పురుషునిలో ప్రతిఫలించడంవల్ల ఆ చిత్తవృత్తులే తానని పురుషుడు ఆయా వికారాలకు లోనవుతాడు. చిత్తవృత్తులను నిరోధిస్తే పురుషుడు స్వస్వరూప జ్ఞానం పొందుతాడు.మనో నిరోధం ద్వారా శాంతించిన మనస్సును ఏక వస్తు చింతనం వైపు నడిపించాలి. ఏక వస్తువు అంటే.. ప్రపంచంలో కనిపించే అనేక వస్తువుల్లో ఏదో ఒకటి కాదు. ఆత్మ యొక్క చింతనమే ఏకవస్తు చింతనం అని భగవాన్ రమణులు చెప్పారు.ఆత్మదర్శనం క్షణంలో కలిగిన వారున్నారు, అలాగే ఎన్ని జన్మలెత్తినా సఫలం కానివారున్నారు. ఆత్మ సా క్షాత్కారానికి కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు. ఆత్మకు కర్త కర్మ క్రియ పరమాత్మయని సనాతన వాఙ్మయం విశదీకరిస్తోంది. మనసు ద్వారా సాధన చేస్తే ఆత్మ అను రెండు అక్షరాల ఉనికి తెలుస్తుంది. ఈ రెండక్షరాల మనన మే ఆత్మాన్వేషణ. గురువు నుండి లభించిన మంత్రం లాగే అనుక్ష ణం ఆత్మ అనే రెండక్షరాల మననమే ఆత్మశోధన.సాధనల ద్వారా సమాధి నిష్టలో ‘నేను జీవుణ్ని కాదు, ఆత్మనే’ అని గ్రహిస్తాడు. స్వస్థితిలో ఆత్మగానే ఉండిపోతాడు. మరచిపోవడం, గుర్తు తెచ్చుకోవడం ఉండదు. అదే ఆత్మ సంస్థితి. అలా ఆత్మసంస్థితిలో ఉండడమే స్వాత్మ దర్శనం. దాన్నే పరమాత్మ సాక్షాత్కారం అంటారు.
కామెంట్‌లు