సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-624
బాదరాయణ సంబంధ న్యాయము
******
బాదరాయణ అనగా రేగు చెట్టు,ఒక భారతీయ తత్వ వేత్త పేరు.ఇతడు ఋషి మరియు బ్రహ్మ సూత్రాల యొక్క ప్రసిద్ధ రచయిత.ఇతడినే వేద వ్యాసుడు,బాదరాయణ మహర్షి అని కూడా పిలుస్తారు.సంబంధ అనగా స్నేహము,చుట్టరికము అనే అర్థాలు ఉన్నాయి.
 
మరి బాదరాయణ సంబంధం అనగా ఏమిటో? దానికి సంబంధించిన ఆసక్తికరమైన కథేమిటో తెలుసుకుందామా...
 ఎవరైనా తెలియని వారు  వచ్చి ఎంతో పరిచయం ఉన్న వారిలా  మాట్లాడుతూ  కలుపుపోయే వారిని చూస్తే , చూసేవారికి వారిద్దరి మధ్య ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుంది కానీ అలాంటిదేమీ లేదని తెలిసినప్పుడు వారి సంబంధాన్ని  బాదరాయణ సంబంధం అనడం పరిపాటి.
 మరి "బాదరాయణ సంబంధం" అనే జాతీయం ఎలా వచ్చిందో చూద్దాం.
 వెనుకటి రోజుల్లో ఇప్పటిలా రవాణా సౌకర్యాలు ఉండేవి కావు. ఎక్కువగా ఎడ్లబండి మీదనే ఆధారపడేవారు.అలా ఒక వ్యక్తి తన వ్యక్తిగత  పనుల మీద దూర ప్రాంతాలకు వెళ్ళ వలసి వచ్చింది.అలా ప్రయాణం చేసి చేసి చీకటి పడేలోపు ఓ ఊరు చేరుకున్నాడు. రాత్రి పూట ఎడ్లబండి ప్రయాణం ప్రమాదం కాబట్టి  ఎవరింట్లోనైనా ఉంటే బాగుండునని అనుకున్నాడు. కానీ అంత దూరపు గ్రామంలో  ఎవరూ తెలిసిన వారు లేరు ఎలా అని తన ఎడ్లబండిని రేగు చెట్టు/బదరికా చెట్టు దగ్గర ఆపి బండి ఎద్దులను ఆ  చెట్టుకు కట్టేసి ఆలోచిస్తూ వుంటాడు.అలా చూస్తుంటే ఎదురుగా ఓ ఇల్లు కనిపించింది. హమ్మయ్య అనుకొని వాళ్ళ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుంటాడు.అతడిని చూసి ఆ ఇంటి యజమాని తన భార్య తరఫు బంధువే వచ్చి ఉంటాడని అనుకుంటూ సాదరంగా ఆహ్వానిస్తాడు. 
అతడు కూడా ఎంతో పరిచయస్తుడిలా చనువుగా పిలవగానే లోపలికి వస్తుంటే లోలోపల "పొద్దున్నే వచ్చే వర్షం, రాత్రిపూట వచ్చిన చుట్టం ఒక పట్టాన వదలవు" మనసులో అనుకుంటూ అతిథిగా వచ్చాడు కాబట్టి తగిన మర్యాదలు చేయడమనేది  మన పద్దతి, సంస్కారమని అనుకుంటూ  అతడిని కుశల ప్రశ్నలు అడుగుతూ ఇంట్లోకి ఆహ్వానిస్తాడు.ఆ వ్యక్తి కూడా ఇంటి యజమాని ఆహ్వానించగానే ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా లోపలికి వెళ్తాడు.
 భర్తతో కలిసి లోపలికి వచ్చిన ఆ వ్యక్తిని చూసిన యజమాని భార్య తన భర్త తాలూకు బంధువై ఉంటాడని అనుకుంటుంది. అతనికి గబగబా వంటా వార్పూ చేసి మర్యాదలో ఎక్కడా లోటు లేకుండా కడుపునిండా భోజనం పెడుతుంది. అతడు వారిచ్చిన ఆతిధ్యాన్ని  ఆనందంగా స్వీకరించి పొద్దటి నుండి చేసిన ప్రయాణ బడలిక వల్ల వారు చూపించిన పడకపై సేద తీరుతూ, అలాగే పడుకుండి పోతాడు.
 అలా మరుసటి రోజు ఉదయం కూడా అదే తంతు. అలాగే మర్యాదలతో కాలం గడిచింది. భార్యాభర్తల్లో ఇరువురికీ ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలని వుంది.అప్పటికే  రెండు రోజులు గడిచాక ఇక ఆగలేక ఆ యజమాని భార్యను పిలిచి " ఇంతకీ వచ్చిన వ్యక్తి నీకు ఏమౌతాడు? ఎవరతను? మీకు దూరపు బంధువా? అడుగుతాడు.
 భర్త ప్రశ్నలకు ఆశ్చర్యపోతూ " అయ్యో! అతనెవరో నాకు తెలియదు. మీరు అతడిని ఎంతో గౌరవంగా పిలుస్తూ ఇంట్లోకి తీసుకుని వస్తుంటే మీ తాలూకు బంధువై ఉంటాడని అనుకున్నాను. మరి మనిద్దరికీ తెలియని ఈ చుట్టం ఎవ్వరో మీరే అతడిని అడిగి తెలుసుకోండి? అంటుంది.
భోజనాలు అయ్యాక ఇంటి యజమాని ఆ వ్యక్తితో అయ్యా! మీది ఏవూరు? ఏ పని మీద వచ్చారు?ఎవరి కోసం మా యింటికి వచ్చారు? అసలు మీకు మాకు ఉన్న సంబంధం ఏమిటి?మొదలైన ప్రశ్నలు  నెమ్మదిగా మనసు నొవ్వకుండా అడిగాడు.
అప్పుడు ఆ వ్యక్తి నాది చాలా దూర ప్రాంతం. ఓ పని మీద వెళ్తూ మార్గమధ్యంలో ప్రయాణ బడలికతో సేద తీరుదామని ఇళ్ళ కోసం చూస్తే మీ ఇల్లు కనబడింది.ఇక నన్ను మీరు పిలిచారు.ఎంతో గౌరవంగా అతిధి మర్యాదలు చేశారు. మీ ఆత్మీయమైన ఆతిథ్యానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
 ఇక మన మధ్య  ఉన్న సంబంధం, బంధుత్వం అంటారా? అది 'బాదరాయణ సంబంధం ' అంటాడు.
యజమాని మరియు అతడి భార్య ఆశ్చర్యపోతూ బాదరాయణ సంబంధమా?  అదేం సంబంధం? అడుగుతారు.
అంటే "అస్మాకం బదరీ చక్రం యుష్మాకం బదరీ తరుః/ బాదరాయణ సంబంధం యూయం యూయం వయం వయం!!" అంటాడు.
అంటే  యేమీ లేదు ఇక్కడ నేను బస చేయడానికి,ఆకలి తీర్చుకోవడానికి ఎవరైనా బంధువులో, తెలిసిన వారో ఉంటే బాగుండేది అనుకుంటూ ఉన్న సమయంలో మీతో,మీ ఇంటితో బాదరాయణ సంబంధం ఉందని అర్థమై పోయింది. అదెలా అంటే...
'అస్మాకం బదరీ చక్రం " అనగా నా ఎడ్లబండికి బదరీ వృక్షం యొక్క చెక్కతో చేసిన  బండి చక్రాలు ఉన్నాయి."యుష్మాకం బదరీ తరుః" అనగా మీ ఇంటి పెరటిలో  చూస్తే బదరీ వృక్షమే వుంది.మీరు అడిగారు కదా! మీది మాది బాదరాయణ సంబంధమే.కానీ ""యూయం యూయం వయం వయం " అనగా మీరు మీరే; మేము మేమే  అంటూ ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
అంటే అతడి దృష్టిలో వాళ్ళింట్లో రేగు  చెట్టు ఉంది.తన బండికి ఉన్న చక్రాలు రేగు చెట్లతో చేయబడినవి..ఆ  రేగు చెట్టే మనల్ని కలిపింది కాబట్టి  "మనది రేగు చెట్టు సంబంధం  అన్న అతని మాటలకు భార్యాభర్తలు ఇరువురూ నివ్వెర పోతారు.
అలా వాడుకలోకి వచ్చింది ఈ బాదరాయణ సంబంధం. ఏ సంబంధం లేకున్నా ఇలా కలిసిపోవడాన్ని మన పెద్దవాళ్ళు"బాదరాయణ సంబంధ న్యాయము"తో  పోల్చి చెబుతుంటారు.
 ఇదండీ  ఈ న్యాయము యొక్క కథా కమామీషు.కుటుంబం, చుట్టాలు, స్నేహితులు తప్ప మిగతా వారితో అవసరార్థం కలిసి వుండే సంబంధాలకు ఈ న్యాయమును ఉదాహరణగా పోల్చి చెప్పుకోవచ్చు కదండీ!

కామెంట్‌లు