విజయ;- సరికొండ శ్రీనివాసరాజు

 మంగమ్మ ఇద్దరు మనవరాళ్ళతో ఉంటుంది. తన కూతురు కూతురి పేరు కమల కాగా కొడుకు కూతురి పేరు విమల. ప్రమాదవశాత్తు. విధి తనను చిన్నచూపు చూడటం వల్ల అందరినీ కోల్పోయి తాను తన మనవరాళ్ళు మాత్రమే మిగిలారు. అయితే మంగమ్మ కమలను చాలా బాగా చూసుకుంటుంది. ఏ పనీ చెప్పకుండా సుకుమారంగా పెంచుతుంది. ఇంటిపని, బయట పనులు అన్నింటినీ విమల చేతనే చేయిస్తుంది. చేయకపోతే గొడ్డును బాదినట్లు బాదుతుంది. వేరే దిక్కు లేక విమల ఎన్ని కష్టాలు పడినా నాయనమ్మకు సేవలు చేస్తూ బతుకుతుంది.
       ఒకరోజు మంగమ్మకు విమల మీద విపరీతమైన కోపం వచ్చింది. ఇంట్లోంచి వెళ్ళగొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. ఇంతలో మంగమ్మ ఇంటికి అపర్ణ ఒకావిడ తన కుమారునితో సహా వస్తుంది. తన కొడుకు పేరు ఫల్గుణ అని, చాలా అమాయకుడు, అస్సలు తెలివిలేని వాడు అని, మంగమ్మకు అభ్యంతరం లేకపోతే మంగమ్మ మనవరాళ్ళలో ఒకరిని తన కోడలిగా చేసుకునే అవకాశం ఇస్తే లెక్క లేనన్ని బంగారు కాసులు ఇస్తానని, తనకు కావాల్సింది లోకం తెలియని తన కుమారుణ్ణి జీవితాంతం కంటికి రెప్పలా చూసుకునే కోడలు అని అన్నది.  వెంటనే మంగమ్మ ఒప్పుకుంది. కాసులకు ఆశపడి, విమలకు ఇష్టం లేకున్నా బలవంతంగా ఫల్గుణను విమలకు ఇచ్చి పెళ్ళి చేయించింది. మూడు పూటలా తినడం తప్ప అస్సలు తెలివి లేని తన భర్తను తలచుకొని విమల దుఃఖిస్తూ ఉండేది. తానే ఏదో ఒక పని చేస్తూ కష్టపడి సంపాదిస్తూ భర్త, అత్తలను పోషించేది. ప్రతిరోజూ తెల్లవారుఝామునే అపర్ణ తన కుమారుని తీసుకుని ఎక్కడికో వెళ్ళి కొన్ని గంటల తర్వాత ఇంటికి వచ్చేది. ఎక్కడికీ అని విమల ఎన్నడూ అడగలేదు ‌
       మంగమ్మ తన మనవరాలు కమలకు కోట్లు సంపాదించే వ్యాపారి శ్రీపతికి ఇచ్చి పెళ్ళి చేసింది. కొన్నాళ్ళ పాటు కమల సుఖంగా గడిపింది. వ్యాపారంలో భారీ నష్టం వచ్చి, శ్రీపతి ఉన్న ధనాన్ని కూడా కూర్చుని తినగా కొండలా కరిగిపోయి బికారీ అయినాడు. శ్రీపతి ధనం కోసం మంగమ్మను పీడించసాగినాడు. ఒకరోజు హరికథా ప్రదర్శన అవుతుంది. దానిని చూడటం కోసం మంగమ్మ తన ఇద్దరు మనవరాళ్ళు మరియు వాళ్ళ భర్తలు, అపర్ణ కలిసి వెళ్ళారు. కమల ఒంటి నిండా బంగారు ఆభరణాలను ధరింపజేసింది మంగమ్మ. విమల సామాన్య స్త్రీలాగా వచ్చింది. ఇంతలో దోపిడీ దొంగలు దాడిచేసి కమలను చంపుతామని బెదిరించి, ఆభరణాలను దోచుకొన్నారు. శ్రీపతి ప్రాణ భయంతో పారిపోతున్నారు. ఫల్గుణ ఒక్కషారిగా ఆ దోపిడీ దొంగల మీదకు కలియబడ్డాడు. అసాధారణ బలంతో వాళ్ళను చితకబాదుతున్నాడు. ఆ దోపిడీ దొంగలకు బాసటగా మరింత మంది తోడైతున్నారు. ఆశ్చర్యంగా ఫల్గుణకు తోడు మరింత మంది తోడైతున్నారు. దోపిడీ దొంగల సైన్యం ఎంత పెరిగినా ఫల్గుణ సైన్యం చేతిలో చిత్తుగా ఓడిపోయారు. విమల చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. "అత్తయ్యా! ఏం జరుగుతుంది?" అని అడిగింది. "తినబోతూ రుచులెందుకు?" అని ఇంకా ఏమీ చెప్పలేదు అపర్ణ.
       ఇంటికి వచ్చాక జరిగింది చెప్పింది అపర్ణ. మగధ సామ్రాజ్యానికి రాజు శ్రీహర్షుడు. అతని భార్య హైమవతి. అతడు రాజైన తర్వాత అనేక విజయయాత్రలు చేస్తూ అనేక రాజ్యాలను జయించే క్రమంలో మరో నలుగురిని పెళ్ళి చేసుకున్నాడు. హైమవతి కుమారుని పేరు విజయ. శ్రీహర్షుని తర్వాత రాజు కావాల్సిన వాడు అతడు. శ్రీహర్షుని మరో భార్య అయిన మాలినికి కూడా పుత్ర సంతానం కలుగుతుంది. దానితో మాలిని తన కుమారుడే భవిష్యత్తులో రాజు కావాలని రాజుకు చెవినిల్లు కట్టుకొని పోరు పెట్టింది. మాలిని హైమవతితో చాలా స్నేహభావంతో ఉంటూ విజయను కన్న కొడుకులా చూస్తున్నట్లు నటించింది. రకరకాల పన్నాగాలు పన్ని మంచితనం నటిస్తూ విజయను ఎవరికీ తెలియకుండా చంపించే ప్రయత్నం చేసింది మాలిని. అదృష్టవశాత్తూ ప్రతీసారీ ప్రమాదం నుంచి బయటపడుతున్నాడు విజయ. హైమవతికి ఈ పన్నాగాలు తెలిశాయి. రాజుతో చెప్పినా రాజు నమ్మలేదు. దాంతో కుమారుని తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఒక ఆశ్రమానికి వచ్చింది. అక్కడే ఉంటూ ఒక మహర్షి అండగా తన కుమారునికి రాజుకు అవసరమైన అన్ని విద్యలు నేర్పిస్తుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత తన కుమారునికి‌ మంచి గుణగణాలు ఉన్న పేద అమ్మాయిని చూసి, నిరాడంబరంగా వివాహం చేయాలని అనుకుంది. విమల గురించి తెలిసింది. మంగమ్మ స్వభావం తెలిసి నాటకం ఆడి, తమ పేర్లు మార్చుకొని తన కుమారునికి విమలతో వివాహం అయ్యేలా చేసింది. ఈ విషయం తెలుసుకున్న విమల ఆశ్చర్యానందాలకు లోనైంది.
       మాలిని కుమారుడు మోహనుడు మోసంతో తన తండ్రిని చెరసాలలో వేయించి తాను రాజు అయ్యాడు. ప్రజలకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. హైమవతి తన కొడుకు విజయను ఆదేశించింది. "అర్జునునితో సమానమైన పరాక్రమం కలవాడివి కావాలని నీకు విజయ అని పేరు పెట్టాను. విజయా! ఇంకా ఆలస్యం చేయవద్దు. మనం రహస్యంగా తయారు చేసుకున్న సైన్యాన్ని తీసుకుని మోహనుని మీదికి దండయాత్రకు వెళ్దాం. ఆ దండయాత్రలో మోహనుణ్ణి చిత్తుగా ఓడించి నువ్వు రాజువు కావాలి." అని. విజయ మోహనుణ్ణి చిత్తుగా ఓడించాడు. మగధ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. తండ్రిని చెరసాల నుండి విడిపించాడు. మాలిని, మోహనులను చెరసాలలో వేయించాడు. విమల రాణి అయింది. తనకు పుత్ర సంతానం కలిగి, ఆ పుత్రుడు మంచి గుణవంతుడు అయితే ఈ రాజ్యానికి తన తర్వాత రాజు అవుతాడని, లేని పక్షంలో రాజ్యంలో అత్యంత సమర్థవంతమైన అతణ్ణి తన తదనంతరం రాజును చేస్తానని, మరో వివాహం చేసుకోనని ప్రకటించాడు విజయ. సంతోషించారు హైమవతి, విమలలు.
       తనను ఆదరించమని మంగమ్మ విజయను వేడుకుంది. "ఇద్దరు మనవరాళ్ళను సమానంగా చూడకుండా వివక్ష చూపించినందుకు నీకు శాస్తి జరగాల్సిందే. ఒక పూటకూళ్ళ ఇంటిని ఏర్పాటు చేయిస్తా. నిత్యం బాటసారులకు వండిపెడుతూ నీ కష్టం మీద జీవించు." అన్నాడు విజయ. శ్రీపతిని కూడా కష్టం చేసి బ్రతకమని చెప్పాడు విజయ. ప్రజానురంజకంగా చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించాడు విజయ. 

కామెంట్‌లు