దిల్లీ రాజకీయ క్షేత్రంలో కేజ్రీవాల్ ;-:ప్రతాప్

 మద్యం కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టయినప్పటి నుంచీ ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఐదున్నర నెలల జైలు జీవితం అనంతరం కేజ్రీవాల్ బెయిల్ సాధించడం ఒక ఎత్తయితే, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం మరొక ఎత్తు. ప్రస్తుతం ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆప్ సీనియర్ నేత అతిషి, కేజ్రీవాల్ పదవీవిరమణ తర్వాత ఉన్నత పదవిని చేపట్టారు. మహిళను ముఖ్యమంత్రిగా చేయడం వెనుక మహిళల సానుభూతిని పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అర్ధమౌతోంది. ప్రజలు తీర్పు చెప్పేంత వరకు ఆ కుర్చీలో కూర్చోను... న్యాయస్థానం నుంచి నాకు న్యాయం జరిగింది, ఇప్పుడు ప్రజాకోర్టు నుంచి న్యాయం.. ప్రజల ఆజ్ఞ మేరకే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాను. ," అని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. తాజాగా వచ్చే ఫిబ్రవరీలో జరగాల్సిన ఈనికలను    ముందుకు తెచ్చి, తనపై ప్రజలలో ఏర్పడిన సానుభూతి పవనాల ను ఆసరాగా చేసుకొని రాజానామా చేసినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
కేజ్రీవాల్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి కేజ్రీవాల్ను టార్గెట్గా పెట్టుకుంది. అందుకే కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను పంజరంలో చిలుకలుగా అభివర్ణించింది. కేజ్రీవాల్ కాకుండా వేరే నాయకులెవరైనా సీఎం సీటును వదులకోరు. కానీ కేజ్రీవాల్ తనపై వచ్చిన ఆరోపణలను ప్రజాకోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే రాజీనామా చేశారు. త్వరలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు అని నూతన ముఖ్యమంత్రి ఎంతో భావోద్వేగంతో ప్రకటించారు.
ముందస్తుగా ఈ నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. ముందస్తు ఎన్నికలకోసం ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.నవంబర్ నెలలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ ఇప్పటికే డిమాండ్ చేశారు. దీంతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్న వాదన ఆప్ వర్గాల నుంచి వినిపిస్తోంది.సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సందర్భంలో కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమను నిజాయితీపరులమని గుర్తిస్తేనే పదవుల్లో ఉంటామని స్పష్టం చేశారు. ఇదిలాఉంటే కేజ్రీవాల్ సంచలన నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

మద్యం కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు సిబిఐ వైఖరిని తప్పుపట్టింది.  ఈ నేపథ్యంలో బెయిల్ రావడం తన విజయంగా కేజ్రీవాల్ భావించి, తనపై తప్పుడు కేసులు పెట్టి తనను ఇరికించి ప్రత్యర్ధులు రాజకీయంగా లబ్ది పొందాలని నిర్ణయించారని, కాబట్టి తాను తిరిగి ప్రజాక్షేత్రంలో ఎన్నికల పోరాటం చెసి విజయం సాధించి తిరిగి దిల్లీ పీఠంపై కూర్చుంటానని ఘంటాపధంగా చెబుతున్నారు.
అయితే బెయిల్ సాధించినా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లేందుకు, అధికారిక ఫైళ్లపై సంతకాలు చేసేందుకు ఆయనకు అనుమతి లేదన్న విషయం ఇక్కడ గమనార్హం. ఒక విధంగా కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదే అని చెప్పవచ్చు. అయితే ఇటీవలి పార్లమెంట్ ఎన్నికలలో ఆప్ పార్టీ అన్ని స్థానాలలో ఘోరంగా ఓడిపోయింది. దిల్లీలో కెజ్రీవాల్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన తిరిగి అధికారంలోకి రావడం కష్తమని పార్లమెంట్ ఎన్నికలలో పోలయిన ఓట్ల సరళి బట్టి తెలుస్తోంది. ఈ నేపధ్యం లోనే పడిపోతున్న ప్రజాదరణను తిరిగి నిలబెట్టుకునేందుకు కేజ్రీవాల్ రాజీనామా అస్త్రం ప్రయోగించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేజ్రీవాల్ రాజీనామా వెనుక ఉన్న ప్రాథమిక కారణాలలో ఒకటి ఆయనపై, ఆయన మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మరియు ఆప్‌కి చెందిన ఇతరులపై కొనసాగుతున్న అవినీతి ఆరోపణలు. ఎక్సైజ్ పాలసీ కేసు ఆప్‌కి కొరకరాని కొయ్యగా మారింది, ఇద్దరు నేతలూ న్యాయ పోరాటాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను తిప్పికొత్తడం కేజ్రీవాల్ కు కష్టసాధ్యంగా మారింది.ఈ తరుణంలో సానుభూతే ప్రధాన స్త్రంగా కేజ్రీవాల్ చేసుకున్నారు.
ఆయన నమ్ముకున్న సానుభూతే ఓట్ల వర్షం కురిపిస్తుందనుకుంటే మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఆప్ ఎందుకు ఓడిపోయినట్లు? పార్లమెంటు ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆయన అరెస్టయ్యారు. అలాంటప్పుడు సానుభూతి పవనాలు ఎంతో బలంగా వీయాలి కదా! అంతే ఆయన పట్ల ప్రజలలో ఎలాంటి సానుభూతి లేదని పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. సానుభూతి ఆసరాతో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న కేజ్రీవాల్ ఎంతవరకూ విజయం సాధిస్తారో వేచిచూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

కామెంట్‌లు