సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -632
భ్రష్టావసర న్యాయము
   *****
భ్రష్ట అనగా  పతితుడు,వియుక్తుడు,పతితమైన,నీతి లేని.అవసర అనగా సమయము,తఱి,ప్రస్తానము, చోటు, అవకాశము,రహస్యముగ,ఆలోచించుట అనే అర్థాలు ఉన్నాయి.
వేళకు లేనందు వలన తత్ఫలం భ్రష్టమైనట్లు. "సమయానికి లేని భాకా చంక నాకనా?"అనే ఓ వ్యంగ్య సామెత ఉంది.అంటే దాని  అవసరం ఉన్న సమయంలో అందుబాటులో ఉంటే చేయాల్సిన కార్యం విజయవంతం అయ్యేది. మరి ఎఫ్ఫుడో "దొంగలు పడిన ఆర్నెళ్ళకు కుక్కలు మొరిగితే" అన్నట్లు  ఏం లాభం. లోటు లోటే కదా. పెళ్ళి వేడుకలో ఊదే భాకా అంతా అయిపోయిన తరువాత వచ్చి ఊదనా అంటే ఏమైనా ఉపయోగం  ఉంటుందా ? అని అర్థం.
ఇక మరో కోణంలో ఈ న్యాయాన్ని విశ్లేషిస్తే   నిష్ప్రయోజనమైనదని త్యజింప బడిన లేదా  వదిలేసిన వస్తువే మరొకప్పుడు అవసరమవుతుంది అని అర్థము.
ఇది ఎక్కువగా వంటింటి పనులు చక్కపెట్టే వాళ్ళకి తెలుస్తుంది.చిన్న  చెంచా దగ్గర నుంచి గుండ్రాయి దాకా దేనిని  అవసరం  అయిపోయిందని అవతల పెట్టేయకుండా జాగ్రత్త చేయడం చూస్తుంటాం.అవే ఒకోసారి  అవసరాలకు ఉపయోగపడతాయి.
 ఇలా ఈ భ్రష్టావసరమును రెండు రకాలుగా కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
పైదంతా వస్తువుల విషయంలో.మరి మనుషుల్లో ఈ భ్రష్టత్వం గురించి మాట్లాడుకుందాం.
భ్రష్ట అంటేనే నైతికత పాటించని,నీతిలేని వ్యక్తి.అలాంటి భ్రష్టుడి బుద్ధి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సమయానికి ఎంతో ఉపయోగపడతాడని  పొరపాటున నమ్మితే ఇక ఆశాభంగమే. అలాంటి భ్రష్టులు చేసే చెడు పనులు బయటికి రాకుండా జాగ్రత్తలు పడుతుంటారు.కానీ  పిడికిట్లో దాచిన నిప్పులా  వారిని ఎప్పుడో ఒకప్పుడు దహించక మానదు. వారి అసలు స్వరూపం బయట పడక మానదు.
అలాగని వారిని దూరం ఉంచాలనుకున్నా  తప్పనిసరి పరిస్థితుల్లో  భరించాల్సి వస్తుంది. అదెలా అంటే కాలకృత్యాలు తీర్చుకునే మరుగు దొడ్డిలా అన్న మాట. ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా, మనసులో  ఇష్టం లేక పోయినా దానితో వుండే అవసరం అలాంటిది .,గతంలా ఇంటికి దూరంగా కట్టుకునేందుకు స్థలాభావం వల్ల ఇంట్లోనే కట్టుకోవలసి వస్తోంది కదా!
 ఇదండీ!భ్రష్టావసర న్యాయము" అంటే... ఇదొక లోక న్యాయము."ఎటుపొయ్యి ఎటొస్తుందో" అంటుంటారు పెద్దలు.మనం మాత్రం భ్రష్టుపడి పోకుండా  సమయాన్ని బట్టి  నడుచుకుందాం.

కామెంట్‌లు