వడిచెర్ల సత్యంరాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక;-; వెంకట్ , మొలక ప్రతినిధి
 శ్రీపద కలం పేరు గల వడిచర్ల సత్యం వికారాబాద్ జిల్లా, బొంరాస్ పేట్ మండలం, వడిచర్ల గ్రామంలో తేది 08.4.1973 నాడు శ్రీమతి శ్రీ కుర్వ లక్ష్మమ్మ, మాసయ్యల పుణ్య దంపతులకు జన్మించారు. అతి సామాన్య మైన కుటుంబంలో పుట్టిన  సత్యం పదో తరగతి వరకు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో వుండి  విద్య నభ్యసించాడు. వడిచర్ల, యాలాల, తాండూర్, హైదరాబాద్ లలో చదువుకొని, ఎం. ఎ  మరియు తెలుగు పండిత శిక్షణను పూర్తి చేశారు. వీరి ధర్మపత్ని శ్రీమతి మమత. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 
"అక్షరాలతో ఆడుకుందాం"(2008):
ఇది సరళ సాధన తెలుగు వాచకం. తెలుగు భాషలో రాయడం, చదవడంలో వెనుకబడిన పిల్లలు తొందరగా తెలుగు నేర్చుకొనడానికి, ఈ పుస్తకం చాలా ఉపయోగ పడుతుంది. ఇందులో సరళ పదాలు, జంట పదాలు, ప్రాస పదాలు, గుణింత పదాలు,   అంత్యాక్షరి పదాలు, ఏకాక్షర పదాలు, వికటకవి వినోదం, మాటల మెట్లు, పాటలు, గేయాలు, పద్యాలు, పొడుపు కథలున్నాయి.
దీనికి ప్రముఖ కవి దోరవేటి గారు ముందు మాట రాస్తూ,"ఈ వాచకం కంటపడ్డ వాళ్ళ పంట పండుతుంది. తెలుగు తల్లి సంతోష పడుతుంది. పిల్లలు భాషా రుచులతో అలరిస్తారు." అని అభిప్రాయపడ్డారు.
"విప్పిచెప్పు బాల"(2008):
ఇది పొడుపు కథల శతకం. "విప్పి చెప్పు బాల! వినయ శీల!!" అనే మకుటంతో ఆటవెలది పద్యాలున్నాయి. సరళమైన పదాలతో రాయబడిన ఈ శతకమును పిల్లలు ఎంతో ఆసక్తిగా చదువుతారు.  సులభంగా అర్థం చేసుకుంటారు. దీన్ని 2008లో రాజీవ్ విద్యా మిషన్ (సర్వ శిక్షా అభియాన్) , ఆంధ్రప్రదేశ్ వారు ముద్రించి, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు కథా వాచకంగా అందజేశారు.
ఉదా:
సారలున్ననదియు సారంగియును కాదు
తోక యున్ననదియు తొండ కాదు
చెట్ల మీదనున్న కట్లపామది కాదు
విప్పి చెప్పు బాల! వినయ శీల!!
(ఉడుత)
కదలి నడువలేరు కాళ్ళు గలిగియున్న
చేయ లేరు పనులు చేతులున్న
మాటలాడలేరు మనుజుల వలెనున్న
విప్పి చెప్పు బాల! వినయశీల!!
(బొమ్మలు)
కాగ్నా కళా సమితి
తాండూర్ దగ్గరలో ఉన్న కాగ్నా నదిని ఆదర్శంగా తీసుకుని, 2010 సం. లో "కాగ్నా కళా సమితి"ని స్థాపించాడు. గురువులు, మిత్రులు, కవులు, రచయితలు, కళాకారులు, హితైష్యుల సహకారంతో సాహిత్య, సాంస్కృతిక  కార్యక్రమాలకు చెందిన కవిసమ్మేళనాలు, అవధానాలు, పుస్తక ముద్రణలు, ఆవిష్కరణలు, సదస్సులు వంటివి నిర్వహిస్తున్నాడు. ఎందరినో ప్రోత్సహిస్తున్నాడు. తద్వారా మాతృ భాషాభివృధ్ధికి, భాషా సంరక్షణకు తోడ్పడుతున్నాడు. విద్యార్థులకు సాహిత్యం పట్ల, భాష పట్ల ఆసక్తిని, అభిరుచిని కలిగిస్తున్నాడు.

కామెంట్‌లు