న్యాయాలు-611
ప్రసూతి వైరాగ్య న్యాయము
*****
ప్రసూతి అంటే గర్భం ధరించిన స్త్రీ బిడ్డకు జన్మనిచ్చే సమయం.వైరాగ్యం అంటే భౌతిక ప్రపంచానికి చెందిన అనుబంధాలను విడిచిపెట్టే మానసిక స్థితి అని అర్థము.
ప్రసవ సమయంలో పడే నొప్పికి తట్టుకోలేక ఇక మళ్ళొక సారి పిల్లలను కనకూడదు.ఎందుకింత బాధ అనుకుంటూ ఒక రకమైన నిర్లిప్తతకు లోనవుతుంది స్త్రీ.అలా ప్రసవించే సమయంలో కలిగే వైరాగ్యాన్నే ప్రసూతి వైరాగ్యం అంటారు.
ప్రసూతి వైరాగ్యం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి స్మశాన వైరాగ్యం,పురాణ వైరాగ్యం.అవి ఎందుకు కలుగుతాయో అంతో ఇంతో అందరికీ తెలిసే ఉంటుంది.కానీ ప్రసూతి వైరాగ్యం ఎందుకు కలుగుతుంది అనేది కొంతమందికి ఆశ్చర్యానికి, సందేహానికి గురి చేస్తూ ఉంటుంది.
ఒక స్త్రీ బిడ్డకు జన్మను ఇవ్వాలి అంటే ఆమె మరో జన్మ ఎత్తాల్సిందే. మరణం చివరి అంచు దాకా వెళ్ళాల్సి వస్తుంది. గర్భం ధరించినప్పటి నుండి పుట్టబోయే బిడ్డ కోసం ఏవేవో కలలు కంటుంది.బిడ్డ జనన సమయంలో పడే నొప్పి బాధ ఆ కనే వారికే, స్త్రీలకే తెలుస్తుంది.అతి భయంకరమైన వేదనను భరించి నొప్పులు తీయవలసి వస్తుంది. అలా అయితేనే గర్భంలోని బిడ్డపై వత్తిడి పెరిగి బయటకు నెట్టి వేయబడుతుంది.అలా శిశువు ఈ ప్రపంచంలోకి వస్తుంది.
ఆ నొప్పి బాధ ఎలాంటిదంటే మరణయాతన. ఇక జన్మలో పిల్లల్ని కనొద్దు అనుకునే బాధ.అదిగో అలాంటప్పుడే ఈ బంధాలు,అనుబంధాలు, వైవాహిక జీవితం,పిల్లలు సంసారం ఎందుకు ? చచ్చిపోయేంత బాధ పడాలా? అనుకున్నప్పుడు వచ్చే వైరాగ్యమే "ప్రసూతి వైరాగ్యం".
అంత బాధపడుతూ, నొప్పిని భరిస్తూ కన్న బిడ్డను చూసుకున్న మరుక్షణమే ఆనందంగా వైరాగ్యం అనే మాటే మరిచి పోతుంది. బిడ్డకు మరో బిడ్డ తోడు కావాలనీ, సంతానమే సౌభాగ్యమనీ తన దేహంలోని శక్తినంతా ధారపోసి మళ్ళీ బిడ్డ లేదా బిడ్డలకు జన్మనిస్తుంది.
చాలా మంది దీనిని ప్రసవించే స్త్రీకి అన్వయించి చెబితే ఆధ్యాత్మిక వాదులు మాత్రం గర్భస్థ శిశువుకు అన్వయించి చెప్పడం జరిగింది.
శిశువు గర్భంలో ఊపిరి పోసుకున్నప్పటి నుండి శరీర అవయవాలు రూపుదిద్దుకున్న తర్వాత వారిలో పూర్వజన్మ స్మృతులు వెంటాడుతూ ఉంటాయట.
తాను గర్భస్థ శిశువుగా ఆ ఉమ్మనీటిలో పడే బాధను భరించలేక ఆ నరకం నుండి బయటకు రావాలని కోరుకుంటుందట శిశువు. అయితే జన్మించిన తరువాత ఎదుగుతూ సంసార సాగరాన్ని ఈదుతూ ఎందుకీ జన్మ అనుకుంటాడట. అలా గర్భస్థ శిశువుగా పూర్వ స్మృతులు వెంటాడుతూ ఉంటాయనీ, పుట్టే వరకు పడే బాధే "ప్రసూతి వైరాగ్యమని వారి భావన. అయితే శిశువు జన్మించగానే గత స్మృతులు మరిచిపోతుందని అంటారు.
దీనికి సంబంధించిన భగవద్గీత శ్లోకాన్ని చూద్దాం..."పునరపి జననం పునరపి మరణం /పునరపి జననీ జాఠరే శయనం/ఇహ సంసారే బహు దుస్తారే/ కృపయాపారే పాహి మురారే!!" అనగా మరల మరల జన్మించుచు మరల మరల మరణిస్తూ, తిరిగి తల్లి గర్భంలో శయనించుచూ ఈ సంసారమును దాట జాలక నానా బాధలకు గురి అవుతున్న నన్ను కృపతో ఈ సంసారము నుండి తరింపజేయుము అని అర్థము. అలా గర్భస్థ శిశువు కోరుకోవడం అన్న మాట.
ఇలా గర్భస్థ శిశువుగా తాను జఠర వేదన భరించలేక ఆ నరకం వద్దు అనుకుంటూనే జన్మించిన తరువాత అదంతా మరిచి పోయి సంసార జంఝాటంలో పడిపోవడం జరుగుతుంది. అలా ప్రసూతికి ముందు గర్భస్థ శిశువు పొందే వైరాగ్యమే "ప్రసూతి వైరాగ్యం" అని అంటుంటారు.*
'ప్రసూతి వైరాగ్య న్యాయము" ద్వారా పై రెండు కోణాల్లో విషయాన్ని చూశాము." తీవ్రమైన బాధ ఉన్నప్పుడు ఆ సమయంలో మాత్రమే నిర్లిప్తత,బాధ కలుగుతుందని, కానీ ఆ తర్వాత పొందే బంధాలు,పాశాలను, ఆనందాలను వదులుకోలేక పోవడం సహజమేనని అర్థం చేసుకోవచ్చు.మన నిత్య జీవితంలో ఎలాంటి ఒడుదుడుకులు ఎదురైనా ఆ కొద్ది సేపు,కొద్ది గంటలో రోజులో ఇలా అనుకోవడం పరిపాటే కదండీ!.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి