న్యాయాలు -609
ప్రవత్స్య ద్భర్తృకా న్యాయము
*****
ప్రవత్స్య అనగా ప్రయాణమై పోబోవుట.తత్ అనగా ఆ భర్తృక అనగా భార్య.ప్రవత్స్య ద్భర్తృకా అనగా భర్త దూర దేశమునకు వెళ్తుంటే అతని యొక్క భార్య పడే బాధ అని అర్థము.
"భర్త దూరదేశమునకు ప్రయాణమవుతుంటే ఆతని యెదుటనే భార్య ఏడ్చినట్లు."
పూర్వ కాలంలో ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణం చేయాలంటే ఇప్పటిలా సుఖవంతమైన, సురక్షితమైన రవాణా సౌకర్యాలు ఉండేవి కావు.బాగా వున్నవారు గుఱ్ఱాల మీద, సామాన్యులు ఎద్దుల బండిలో, ఇక ఆ రెండూ లేని వారు పాదచారులై ప్రయాణం చేసేవారు.అప్పుడు ఒక ఊరికి మరొక ఊరికి వెళ్ళే దారిలో చిట్టడవులు, పెద్ద అడవులు,వాగులూ వంకలూ ఉండేవి.
ప్రయాణం ఎప్పుడూ ప్రమోదం కాదు.చాలా ప్రమాదంగా ఉండేది. ఇక తీర్థ యాత్రలకు వెళ్ళే వారైతే తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారన్న నమ్మకం లేదు.ఏదైనా జరిగినప్పుడు తగు సమాచారం ఇవ్వడానికి ఇప్పటి కాలంలో వలె అధునాతన సాంకేతిక సౌకర్యం కూడా లేదు.
అందుకే ఈ న్యాయానికి దగ్గరగా మన పెద్దలు "కాశికి వెళ్ళిన వాడు- కాటికి వెళ్ళిన వాడు ఒకటే" అనే సామెతతో పోలుస్తూ ఉండేవారు.
అలా ఎందుకు పోలుస్తూ చెప్పారో చూద్దాం.
హిందువులకు కాశి ఓ పుణ్య క్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా కాశికి వెళ్ళాలని భక్తులు అనుకునేవారు. అలా అనుకోవడమే కాదు గృహస్థాశ్రమం దాటిన వారిలో చాలామంది కాశికి వెళ్ళడానికి భక్తితోనో కాశీ నగరం అందాలు చూడటానికో కాశీ యాత్ర పెట్టుకునే వారు.
మరి "కాశికి పోతే కాటికి పోయినట్టే" అనేవారు. ఎందుకంటే దట్టమైన అడవులు కొండలు గుట్టల నుండి ప్రయాణం చేయవలసి వచ్చేది. ఆ సమయంలో కౄర మృగాలు, విష పూరితమైన పాములు, తేళ్ళు వీటితో పాటు అననుకూల వాతావరణం చాలా యిబ్బంది పెట్టేది. ఒకోసారి వాటి వల్ల ప్రాణాపాయం సంభవించేది. ఒకోసారి వారి జాడ కూడా తెలిసేది కాదు.అందువల్ల కాశి వెళ్ళడం - కాటికి పోయినట్టే అనే వారు.
మరి ఈ విషయానికి భర్త దూర దేశమునకు వెళ్తుంటే భార్య అతడి ముందే ఏడవడానికి గల సంబంధం మనకు ఈ పాటికి అర్థమైపోయింది కదా!
అందుకే ప్రయాణమై వెళ్తున్న భర్తను తేరిపారా చూసుకుని అదే చివరి చూపా అన్నట్లు భోరుమని ఏడ్చేదన్న మాట.
అదంతా ఆనాటి కాలాన్ని అనుసరించి చెప్పిన న్యాయము. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు.అడవులు కొండలే కాదు మహా సముద్రాలు హాయిగా పక్షిలా విహరిస్తూ విమానాల్లో వెళ్ళి రావడం చూస్తున్నాం. ఎక్కడ ఉన్నా వీడియో కాల్ ద్వారా ముఖాముఖి చూసుకోగలుగుతున్నాం. ఒక వేళ చాలా దూరంగా ఉన్నారనే వేదన తప్ప మరింకే విధంగా బాధ పడాల్సిన అవసరం లేదు.
అయితే ఇందులో మరో సున్నితమైన కోణాన్ని చూద్దాం.
అతడో వీర జవాన్.సరి హద్దులో ఎండనకా వాననకా కంటిపై రెప్ప వాల్చకుండా దేశమాత రక్షణ కోసం అహర్నిశలు కాపలాదారుగా ఉంటూ శత్రువులతో చేసే పోరాటంలో ప్రాణాలను భగవంతుని పాదాల వద్ద పువ్వులుగా సమర్పించడానికి సిద్ధపడే సైనికుడు.అతడి భార్యా పిల్లలతో గడపడానికి ఇంటికొచ్చి వెళ్ళేటప్పుడు తట్టుకోలేని దుఃఖోద్వేగంతో తల్లిదండ్రులతో పాటు అతని భార్య కూడా ఏడుస్తుంది.కొందరు భర్త ముందు అలా ఏడిస్తే బాగుండదు, వెళ్ళే వ్యక్తి మనసు తట్టుకోలేదని ధైర్యంగా ఉన్నట్లు పైకి నటిస్తూ లోలోపల ఏడ్చే వాళ్ళు,దుఃఖాన్ని ఉగ్గబట్టుకునే వారు ఉంటారు.
ఆ విధంగా శభార్యాభర్తల అనుబంధం, అన్యోన్యతలోని గొప్ప తనం ఏమిటో చెప్పడము ,పూర్వ కాల స్థితి గతులు ఇలా వుండేవని గుర్తు చేయడం ఈ "ప్రవత్స్య ద్భర్తృకా న్యాయము" యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం.
ఇలా మన పెద్దవాళ్ళు ఉదహరించే ప్రతి న్యాయంలోనూ తరచి చూస్తే ఏదో ఒక అంతరార్థం గోచరిస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి