సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-622
బహు నామను రోదన న్యాయము
*****
బహు అనగా అధికము, సమృద్ధము ,అనేకము, తఱచు,పెద్ద, అధికముగా, పెద్దగా.నామను అనగా పేరు.రోదన అనగా ఏడుపు, కన్నీరు అనే అర్థాలు ఉన్నాయి.
రోదనం అనగా ఏడుపు.ఈ ఏడుపు అనేక రకాలు,అనేక  కారణాలను కలిగి ఉంటుందని అర్థము.
 సాధారణంగా ఏడుపు అనేది చిన్న పిల్లల,శిశువుల ఆయుధం. అవసరాలను భాషలో వ్యక్తీకరించలేని వయసులో ఏడుపు ద్వారా వ్యక్తీకరిస్తుంటారు. ఈ ఏడుపులో తేడాలను బట్టి మూడు రకాలుగా విభజించారు. పసిబిడ్డ ఈ లోకంలోకి రాగానే లయ బద్దంగా ఏడ్చే మొదటి ఏడుపు బాహ్య ప్రపంచంలో తనంతట తాను ఊపిరి పీల్చుకుని మనగలిగేందుకు ఏడుస్తుంది. అలా ఏడవక పోతే శిశువులో ఏదైనా తేడా వుందేమోనని  వైద్యులు చిన్నగా కొట్టి ఏడిపిస్తుంటారు.
ఆ తర్వాత పిల్లలు ఏడ్చే మొదటి ఏడుపును ప్రాథమిక ఏడుపు అంటారు. అది నిశ్శబ్ధంలోంచి చిన్న చిన్నగా మొదలవుతుంది. ఆ తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఆగి ఆగి ఏడ్చే ఏడుపు రెండవది.ఇది ఆకలికి సంకేతంగా ఉంటుంది. ఇక మూడవ రకం ఏడుపు ఏదైనా నొప్పి,బాధ, కోపం కలిగినప్పుడు  ఏడ్చే ఏడుపు.ఇది చాలా బిగ్గరగానూ, ఉగ్గబట్టినట్లు వుంటుంది.పిల్లలు అవసరాల కోసం ఏడిస్తేనే  మంచిదని "బాలానాం రోదనం బలం" అని పెద్దలు అంటుంటారు.
 అసలు ఏడుపు ఎందుకు వస్తుంది? ఏడవటం దేనికి సంకేతం. ఏడవడం వల్ల ఏమైనా లాభాలు/ నష్టాలు ఉన్నాయా? తెలుసుకుందాం.
ఏడుపు అనేది ఒకానొక భావోద్వేగ ప్రతిస్పందన. విచారానికి, కోపం, భయం,ఆనందానికి , ఒత్తిడి , ఆందోళనతో  మనసు తల్లడిల్లినప్పుడు  ఏడుపు వస్తుంది.  ఏడవడం భావోద్వేగ వ్యక్తీకరణకు సంకేతం. ఈ ఏడుపులో భోరుమని విలపించడం, వెక్కిళ్లు పెట్టడం, అరవడం  మరియు బొబ్బలు పెట్టడం లాంటివి ఉంటాయి.
అయితే ఏడుపు రావడం వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయంటారు శాస్త్రవేత్తలు. ఏడుపును సమయోచితంగా వ్యక్తీకరించేవి అత్యంత సున్నితమైన మన కళ్ళు. దుమ్ము ధూళి చెత్త బారిన పడకుండా వాటి నుంచి రక్షించేందుకు కంటిలో కన్నీటి గ్రంధులు ఉంటాయి.
 "మొదటి కారణం:-మన మెదడుచే నియంత్రించబడే అసంకల్పిత చర్య. కంటి పై భాగంలో ఏదైనా వచ్చినప్పుడు వెంటనే కడిగి కన్నీటిని కడిగివేయడానికి, సమయోచిత పొరను రక్షించడానికి కన్నీరు వస్తుంది.అలాగే ఉల్లిపాయ ముక్కలు కోసినప్పుడు,వలిచినప్పుడు కూడా కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తాయి.
రెండో కారణం:- మనం రెప్ప వేసినప్పుడు రెప్ప పాటు లోనే కళ్ళు తడిగా ఉండటానికి వచ్చే కన్నీళ్ళు. ఇవి గాలి ధూళి, బ్యాక్టీరియా మొదలైన వాటి నుంచి రక్షించేందుకు వస్తాయి.ఈ బేసల్ కన్నీళ్ళు వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కళ్ళను రక్షించేందుకు వచ్చే కన్నీళ్ళు.
మూడో  కారణం:- భావోద్వేగంతో వచ్చే కన్నీళ్ళు. ఏదైనా ఉద్వేగంతో తట్టుకోలేనప్పుడు వచ్చే కన్నీళ్ళు.ఇవి దగ్గరి బంధువులు స్నేహితుల్లో ఎవరైనా మరణించినప్పుడు, ఏవైనా బాధాకరమైన సంఘటనలు జరిగినప్పుడు, భావోద్వేగ సన్నివేశాలు చూసినప్పుడు  వస్తాయి.
 నాల్గవ కారణం:-ఎవరైనా మనసును గాయ పరిచినప్పుడు, మానసికంగా శారీరకంగా విచారంగా ఉన్నప్పుడు, ఎవరైనా గాయ పరిచినపప్పుడు కన్నీళ్ళు వస్తాయి.
పై వన్నీ  ఉద్వేగాలు, రక్షణకు సంబంధించినవి. అయితే మనుషులు కొందరు కావాలనే ఏడుస్తూ వుంటారు. ఎందుకంటే "సహాయం కోరడం కోసం". పిల్లలైతే తల్లిదండ్రుల శ్రద్ధ ప్రేమ కోసం. పెద్దలైతే తామేదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు అందులోంచి బయట పడేందుకు  కావలసిన సహాయం కోరేందుకు ఏడుస్తారు.
 నొప్పి బాధ తట్టుకోలేక:- అనారోగ్యం వల్ల కానీ, తగిలిన గాయం నుండి గానీ త్వరగా ఉపశమనం పొందడానికి ఏడుస్తుంటారు.
భావోద్వేగాల ఉపశమనం:-  భావోద్వేగాలను కొందరు ఏడుపు ద్వారా వ్యక్త పరుస్తారు.స్వీయ నియంత్రణ కోసం ఏడుస్తుంటారు.
సానుభూతి  కోసం:- ఇతరుల బాధలను చూసి చలించి  సానుభూతిగా ఏడవడం ఒకటైతే ఇతరుల  సానుభూతి పొందడం కోసం ఏడ్చే ఏడుపు.
తమ అవసరాలను తీర్చుకునేందుకు ఏడుపు:-కొందరు ఏడుపు నటిస్తూ ఎదుటి వ్యక్తి మనసు కదిలించే విధంగా ఏడుస్తారు. కొందరు మాత్రం ప్రేమతో కూడిన కన్నీళ్ళతో ఎదుటి వారిని మార్చేందుకు ఏడుస్తారు.
ఇలా రకరకాల కారణాలతో కొందరు ఏడుస్తుంటారు. మన పెద్దవాళ్ళు కొందరు వ్యక్తులు స్వార్థంతో ఏడ్చే ఏడుపు చూసి " కుళ్ళి కుళ్ళి ఏడిస్తే కుడికన్ను- ఏడ్చి ఏడ్చి:ఎడమ కన్ను" పోయింది  అంటారు. అలా ఇతరులపై ఈర్ష్యతో ఏడిస్తే రెండు కళ్ళు పోతాయని చెపుతుంటారు.
 మొత్తానికి ఈ "బహు నామను రోదన న్యాయము" ద్వారా బోలెడు విషయాలు విశేషాలూ తెలుసుకో గలిగాం.దొంగేడుపు మన దరి చేరనీయకుండా  నిజంగా అవసరమైన వారూ కష్టాల్లో మునిగి పోయి ఏడ్చే వారికి మన వంతు, మనకు చేతనైన సహాయం చేద్దాం.

కామెంట్‌లు