సునంద భాషితం; వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-610
ప్రసక్తానుప్రసక్త న్యాయము
*****
ప్రసక్త అనగా అడుగబడినది, సంబంధించినది.అప్రసక్తము అనగా సంబంధం లేని,అడుగబడని. ప్రసక్తానుప్రసక్త అనగా సంబంధించిన,సంబంధం లేకుండా ఉన్న మొత్తం కలిపి అని అర్థము.
ఒక పనికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నపుడు లేదా పూనుకొనినప్పుడు పూర్వాపరాల వివరణలో మరియొక ఫలితము కూడా లభించినట్లు లేదా పొందినట్లు.
 ఈ న్యాయము ముఖ్యంగా ఉపాధ్యాయులకు, ఆచార్యులకు,వక్తలకు బోధకులకు వర్తిస్తుంది.
తరగతి గదిలో విద్యార్థులకు ఏదైనా పాఠం బోధించేటప్పుడు ఆ పాఠానికి సంబంధించిన మరియు అవసరమైన పూర్వాపరాలను తప్పకుండా చెప్పవలసి ఉంటుంది.అలా చెప్పినప్పుడే ఉపాధ్యాయునికి పాఠానికి సంబంధించిన సమగ్రమైన జ్ఞానం ఉన్నదని విద్యార్థులు గ్రహించగలరు.పూర్వాపరాలైన విషయాలు విన్నప్పుడే పాఠం పట్ల విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుంది.యాంత్రికత తగ్గుతుంది.వినాలని, నేర్చుకోవాలనే తపన, ఉత్సాహం,చైతన్యం కలుగుతాయి, పెరుగుతాయి.
 అలాగే  ప్రసక్తానుప్రసక్తంగా చెప్పే  సమయంలో  వ్యక్తికి  సమయస్ఫూర్తి ఉండాలి. ఎందుకంటే విషయానికి సంబంధించిన ఏవైనా ప్రశ్నలను విద్యార్థులు అడిగినప్పుడు ఏ మాత్రం తడబడకుండా చెప్పగలిగితేనే విద్యార్థుల మనసులో తనదైన ముద్ర వేసుకోగలడు.
ఇక హాస్య చతురత కూడా ఉండాలి. కొన్ని విషయాలు చెప్పేటప్పుడు విషయ పరంగా గంభీరత ఉండవచ్చు. అలాంటి విషయాన్ని ఎక్కువ సేపు ఏకాగ్రతగా  వినడానికి ఇష్టపడరు.కాబట్టి చెప్పే విషయానికి దగ్గరగా సరదాగా ఉండే విషయాన్ని చెబితే అప్పటి వరకు స్తబ్దతగా ఉన్న వాతావరణం చైతన్యవంతం అవుతుంది.
అయితే ఇది  కేవలం ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు మాత్రమే కాదు ఏదైనా విషయంపై ప్రసంగించే వక్తలకు కూడా  వర్తిస్తుంది.
 వాళ్ళు చెప్పబోయే అంశాలను సేకరించే సమయంలో  అంశానికి సంబంధించి సమగ్ర వివరాలు తెలియాల్సి వుంటుంది.అలా వుంటేనే గతం,వర్తమానాన్ని తెలియజేస్తూనే పైన చెప్పిన విధంగా మాట్లాడినట్లయితే శ్రోతలు  ఆసక్తిగా వినగలరు.
ఉదాహరణకు రామాయణంలో రామ సుగ్రీవుల స్నేహం గురించి చెప్పేటప్పుడు స్నేహం గొప్పతనంతో పాటు కృష్ణ కుచేలుడు, దుర్యోధన కర్ణుని స్నేహం ఇందులో ఏ స్నేహం మంచిది/ మంచిది కాదు అని చెప్పగలగాలి. ఎదుటి వారిలో ఉదయించబోయే  ఎందుకు? ఎలా అనే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగి ఉండాలి.
ఇలా ప్రసక్తానుప్రసక్తంగా మాట్లాడ గలిగే వ్యక్తులు తాము అందించాలనుకున్న విషయాలను అందించగలరు.అంతే కాకుండా తన మాటల్లో సమయస్ఫూర్తి ,హాస్య చతురత ఉన్నట్లయితే శ్రోతలు తప్పకుండా మంత్ర ముగ్ధులవుతారు.వారి పట్ల వీరాభిమానులుగా  మారగలరు.
 ఇవండీ "ప్రసక్తానుప్రసక్త న్యాయము" ద్వారా మనం గ్రహించాల్సిన విషయాలు. వీటిని గమనంలో పెట్టుకొని ఆచరణలో చూపిస్తే  ఉపాధ్యాయులుగా, వక్తలుగా రాణించగలము. వ్యక్తులుగా  ప్రత్యేక అభిమానం పొందగలం.అంతే కదండీ....

కామెంట్‌లు