న్యాయాలు-627
భిక్షు తాడిత శ్వాన న్యాయము
*****
భిక్షు అనగా సాధువు, సన్యాసి.తాడిత అనగా కొట్టబడిన.శ్వాన అనగా కుక్క అని అర్థము.
భిక్షువు లేదా సాధువుచే కొట్టబడిన కుక్క అని అర్థము.
సాధువుచే కొట్టబడిన కుక్క ఏం చేసిందో ఓ ఆసక్తికరమైన కథ రామాయణంలో ఉంది. మరి దానిని గురించి తెలుసుకుందామా...
రామాయణంలోని ఉత్తర కాండలో ఉందీ కథ. ఒక భిక్షువు వీధిలో తన మానాన తానున్న ఓ కుక్కని అకారణంగా కొడతాడు. దాంతో ఆ కుక్క తల పగులుతుంది. అది ఏడుస్తూ కొలువు తీరిన రాముడి సభాస్థలి ముందుకు వచ్చి మొరుగుతుంది.అది విన్న శ్రీరాముడికి ఆ కుక్క తనతో ఏదో ఫిర్యాదు చేయడానికి, న్యాయము చేయమని కోరడానికి వచ్చి వుంటుందని అర్థమవుతుంది. వెంటనే దానిని సభలోకి తీసుకుని రమ్మని చెబుతాడు.
పగిలిన తల,అయిన గాయాలతో లోపలికి వచ్చిన కుక్కని చూసి" నీకు కలిగిన కష్టం ఏమిటో నిర్భయంగా చెప్పు! అంటాడు .అప్పుడా కుక్క "నేను ఎలాంటి అపకారం చేయకుండానే సర్వార్థసిద్ధి అనే భిక్షువు నా తల పగులగొట్టాడు."అని చెబుతుంది.
శ్రీరాముడు వెంటనే ఆ భిక్షువును పిలిపిస్తాడు. "నీవు ఎందుకు ఈ కుక్క తల పగులగొట్టావు? అది నీకేం అపకారం చేసింది? అని అడుగుతాడు.అప్పుడా భిక్షువు మహారాజా! శ్రీరామా! నేను భిక్ష కోసం ఇల్లిల్లూ తిరుగుతూ వున్నాను.నాకు ఎక్కడా భిక్ష దొరకలేదు.అలాంటి స్థితిలో ఈ కుక్క నా దారికి అడ్డంగా నిలబడి, ఎంత అదిలించినా పోలేదు.కదలలేదు.దాంతో కోపం బాగా వచ్చింది.అలా దాన్ని తలమీద కొట్టిన మాట నిజమే. మరి నేను చేసింది తప్పే. ఏం దండన విధిస్తారో విధించండి అన్నాడా సర్వార్థ సిద్ధి.
అప్పుడు శ్రీరాముడు సభలోని పండితులను ఉద్దేశించి ఆ భిక్షువుకు ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందో చెప్పమని అడుగుతాడు.ఆ ప్రశ్నకు ఎవ్వరూ సూటిగా సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోతారు.
చివరికి గాయపడిన కుక్కనే " ఏ శిక్ష విధించాలో నీవే చెప్పు? అని అడిగితే అతడికి కాలంచర మనే మఠానికి కులపతిగా ఉద్యోగం ఇవ్వమని చెబుతుంది.కుక్క కోరిక మేరకు అతడికి ఆ ఉద్యోగం ఇచ్చి ఏనుగు మీద ఎక్కించి పంపిస్తాడు.భిక్షువు తనకు కలిగిన అదృష్టానికి మురిసిపోతూ వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత శ్రీరాముడు మిగిలిన మంత్రులు శిక్ష వేయమంటే అతడికి మంచి ఉద్యోగం వేయించావు? దీనికి ఏదైనా కారణం వుందా? అడుగుతారు.అప్పుడా కుక్క నేను గత జన్మలో ఆ ఉద్యోగమే చేశాను.ఆ పదవిలో సమస్త సౌకర్యాలు పొందాను.ఎంతో భూతదయ కలిగి వినయము,విధేయత,మంచి శీలవంతుడినని పేరు పొందాను.అయినప్పటికీ ఆ పదవిలో ఉండటం వల్ల నాకు ఇలాంటి నీచ జన్మ కలిగింది.మరి మహా కోపి,దయా రహితుడు అయిన ఈ భిక్షువు ఈ పదవి నిర్వహించడం వల్ల జన్మ జన్మలకు ఘోర నరకం పాలు కాక తప్పదు." అంటుంది.
ఈ "భిక్షు తాడిత శ్వాన న్యాయము"లో ఇదంతా చదివిన తరువాత మనకు రెండు రకాల ధర్మ సందేహాలు కలుగుతాయి. ఒకటి. శునకము మచ్చిక చేసుకోగల, విశ్వాస పాత్రమైన జంతువు. తనకు కలిగిన బాధకు, గాయాలకు రాజు ద్వారా వెంటనే కఠినమైన శిక్ష వేయమని కోరవచ్చు. కానీ అలా జరగలేదు.తనను బాధించిన సాధువుకు మఠాధిపతి పదవిని ఇవ్వమని కోరింది.
అందులో జంతువైనా ఇతరులను భావించకూడదు అనే మానవీయ కోణం వుంది. ఒకవేళ ఏమైనా పాపాలు చేస్తే వాడి కర్మ వాడే అనభవిస్తాడనే పాప పుణ్యాల తాత్విక ధోరణి ఉంది. అంటే మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తుంది కదా!
ఇక భిక్షువు విషయానికి వస్తే అతడో సాధువు. సాధువంటే ఎలా వుండాలి? అరిషడ్వర్గాలకు దూరంగా శాంత స్వభావం,జాలి,భూత దయ,కరుణ మొదలైనవి వుండాలి. కానీ అలాంటివేమీ లేవు కాబట్టే కుక్కను తల పగిలేలా కొట్టాడు. అలాంటి వాడు సాధువుగా ఉండ తగని వాడని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.
మనుషులకే కాదు పశు పక్ష్యాదులకు కూడా భావోద్వేగాలు వుంటాయని వాటిని బాధిస్తే , బాధను అనుభవిస్తూనే బాధించిన వారికి ఎలాంటి శిక్ష విధించాలా ? అని ఆలోచిస్తాయని మనకు అర్థమైంది.
ఈ న్యాయము ద్వారా మనిషిగా మానవీయ విలువలతో బతకాలి సాటి మనుషులకే కాదు మనతో పాటు ఉన్న జీవులకు ఎలాంటి బాధ కలిగించ కూడదు,భూత దయ ఉండాలి. జీవ హింస చేయకూడదు. వేటిని హింసించ కూడదని గ్రహించ గలిగాం. ఆ విధంగా మన జీవన విధానాన్ని మలుచుకుందాం.ఎందరికో ప్రేరణగా నిలుద్దాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి