" *తంగేడు పూల బతుకమ్మ"*;- - డా. వాసరవేణి పర్శరాములు, సింగారం,-సెల్:9492193437,-జిల్లా: రాజన్న సిరిసిల్ల.
 పచ్చని చీర కట్టుకుని 
పసుపు మొకాన రాసుకుని 
ఎర్రని కుంకుమ నేలలో 
ఒయ్యారంగా ఉన్నావు
     కాళ్లకు అందెలు లేకున్నా      
     కాళ్లు మూగవోలేదు 
     కళ్లతో నిన్నే చూస్తున్నా 
     కాలం ఆగలేదు 
గాలి ఏపాటలు నీ చెవిలో వేసెనో
గాలి నీతో ఏమి గుసగుసలాడెనో
సిగ్గుల బుగ్గల చిరునవ్వుతో 
నడుము వంచి నాట్యం చేశావు
     తుమ్మెదలు నీతో ముచ్చటిస్తుంటే
     నాకు అసూయ కలిగింది 
     సూర్యుని వేడిమికి మొకం కమిలిపోతుందనీ
      నా హృదయం కరిగింది
నిన్ను చూసిన ఆ రూపం 
గుండెలోన దాచుకుంటాను
మధుర జ్ఞాపకాలలో స్మరించి 
నీతో ముచ్చటించుతాను
     బతుకమ్మ పండుగకు నిన్ను చూసినప్పుడు 
     బతుకమ్మలో నీవు నిలుచున్నప్పుడు
     స్త్రీలు నీతో ఆడుతారు 
     నీ పాటలను పాడుతారు 
తంగేడు పేరుతో తన్మయం చేస్తుంటే
పసుపు ఆరబోసిన మొకం చూస్తుంటే 
తెలంగాణ పల్లె వెలుగు కాంతవు 
తెలంగాణ ఇంటికి నిండు ముత్తైదువవు 
     తంగేడు పూలతో బతుకమ్మ అయినావు
     తెలంగాణ రాష్ట్ర పువ్వువైనావు
     తెలంగాణ ప్రజల ఆటపాటైనావు 
     తెలంగాణ బతుకుల్లో వెలుగువైనావు

కామెంట్‌లు