ఎంపిక ;- ఉండ్రాళ్ళ రాజేశం -సిద్దిపేట -9966946084

 ధరణికోట రాజ్యాన్ని వెంకటవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు. మహారాజు వెంకటవర్మ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. ప్రతి సంవత్సరం రాజ్య రక్షణకై సైనిక వ్యవస్థను నియమించుకునేవారు. ఎందుకో మహారాజు వెంకటవర్మకు ఈసారి సైనిక వ్యవస్థను కొత్తదనంగా నియమించుకోవాలనుకున్నాడు. బాగా ఆలోచించి మహామంత్రి గోవిందుడికి తన పథకం తెలిపాడు. 
           మహారాజు ఆజ్ఞ ప్రకారం గోవిందుడు వివిధ ప్రాంతాలలో ఒకరోజు సాయంత్రం ఒకేసారి విందు భోజనం ఏర్పాటు చేశాడు. ప్రజలంతా ఆ విందులో పాల్గొన్నారు. విందు ప్రాంతాలలో మహామంత్రి ఏర్పర్చిన వేగులు "అయ్యో! పంట పొలాలను పాడు చేయడానికి అడవి పందులు వచ్చాయి. పంటలను ఎవరు రక్షిస్తారు. పంటలను కాపాడే యువకులే లేరా!!" అంటూ గుసగుసలాడారు. ఈనోట ఆనోట విందు భోజనాల వద్ద ఉన్న యువకులు విన్నారు. 
           చాలామంది విందు భోజనం కడుపునిండా ఆరగించాక అడవి పందుల సంగతి చూద్దాం అంటూ భోజనం చేయసాగారు. వారిలో కొద్దిమంది యువకులు అడవి పందులను తరమడానికి కర్రలతో పంట పొలాల వైపు వెళ్లారు. అలా వెళ్ళినటువంటి యువకులను వేగులు గుర్తించి మహామంత్రి గోపాలుడికి సమాచారం తెలిపారు. పంటలను కాపాడడానికి ఎవరైతే వెళ్లారో! అట్టి యువకులకు మహారాజు వెంకటవర్మ తన సైన్యంలో చోటు కల్పించారు. సైనికులు అంటే శారీరక బలం ఉన్నవాళ్లే కాదు. యే సమయంలోనైనా రాజ్యాన్ని రక్షించే నిర్ణయంలో పాలుపంచుకునేవారు ఉండాలని ప్రజలకు తెలిపి మహారాజు వెంకటవర్మ సంతోషించాడు. మహారాజు వెంకటవర్మ సైనిక ఎంపిక విధానానికి ప్రజలు కూడా హర్షించారు.

కామెంట్‌లు