సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -642
భౌత విచార న్యాయము
******
భౌతము అనగా భూత సంబంధమైనది,స్థూల తత్త్వములచే నిర్మితమైనది.విచారము అనగా ఆలోచనము, సంతానము,విచారణము, నిశ్చయము, సందేహము, తెలివి అనే అర్థాలు ఉన్నాయి.
భౌత విచారము అనగా భూత,ఐహిక సంబంధమైన విషయాలను గురించి మతి భ్రమించినట్లు పిచ్చివాని వలె ఆలోచించడం, ఒకానొక భ్రమకు లోనైన స్థితిని భౌత విచారం అంటారు.
మనసు బాగా లేని ఒకానొక వ్యక్తి రాజ మందిరానికి వెళతాడు. అక్కడ సింహద్వారం వద్ద ఒక పెద్ద ఏనుగు నిలబడి వుంటుంది.దానిని చూసి అతడు రకరకాలుగా తలపోశాడు. ఏమిటిది?చీకటా? చీకటి చేటలతో బయలు దేరిందా? కాదు కాదు నల్లని మేఘము కావచ్చును.మరి మేఘమునకు నలువైపుల నాలుగు స్తంభములుండటం ఇంత వరకు చూడలేదే! మరి రాజు గారి బంధువు కావచ్చు.రాజ ద్వారమున,స్మశానమున వుండే వాడు బంధువు అని పెద్దలు చెబుతారు కదా! తప్పకుండా రాజ బంధువే అయ్యుంటాడు.అలాగైతే ఇతని చేతిలో కర్ర ఎందుకు లేదు.ఇలా పలురకాలుగా ఊహించ సాగాడు.
అనగా అతడు చూసిన ఏనుగు, ఏనుగుకు ఉండాల్సిన ధర్మాలు, రూపురేఖలు పోయాయి.అసంబద్ధమైన  వర్ణనలతో ఇతర ధర్మములు ఏనుగుకు ఆపాదింపబడి,ఆరోపింపబడి, చివరికి అవి కూడా కావని తేలినవి. అలా అతడి ఆలోచన అంతూ పొంతూ లేకుండా సాగుతూనే ఉంది. ఆతని ఆలోచనలు ఒక కొలిక్కి రాలేదు.ఏవీ స్పష్టంగా నిరూపింపబడలేదు.
 ఇలా  ఆలోచించేది కేవలం పిచ్చివాడు లేదా  మానసిక స్థితి సరిగా లేని వారు మాత్రమే.
 మరి  మన పెద్దవాళ్ళు ఈ "భౌత విచారము"ను ఓ  న్యాయంగా చెప్పాల్సిన అవసరం ఉందా? అని ఆలోచిస్తే... సమాధానం తప్పకుండా ఔననే వస్తుంది.
 ఎందుకంటే ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో మానసికమైన ఒత్తిడికి గురికావడం జరుగుతుంది.కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఉద్యోగ బాధ్యతల్లో ఒత్తిడి, నిద్ర లేమి కావచ్చు.ఏదైనా సంఘటన మనసును బాగా కుదిపేసి ఉండవచ్చు. ఇలాంటి కారణాలు ఎన్నో మనసును అల్లకల్లోలం చేస్తాయి. ప్రతి విషయాన్ని గురించి విపరీతంగా ఆలోచించడం మొదలవుతుంది.
 అలా పిచ్చి పిచ్చిగా వచ్చే ఆలోచనలు ఎందుకు ?ఏమిటి? ఎలా? అనే స్పష్టమైన, నిర్దిష్టమైన రూపం రానీయవు. అంతా తలక్రిందులుగా , అర్థం పర్థం లేకుండా ఉంటాయి. తనకు తానుగా ఓ నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది.
మరి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు దానికి సంబంధించిన పరిష్కారం కోసం మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఏం నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అనే సందేహాల వలన మనసు సంఘర్షణకు లోనవుతుంది. ఇలాంటి ఆలోచనలు చివరికి వాస్తవానికి,పరిష్కారానికి దూరంగా ఎక్కడికో వెళ్ళి పోతాయి.
 గాలి ఆగకుండా వీస్తున్నట్లు,నది క్షణమైనా విశ్రాంతి తీసుకోకుండా పరుగులు తీస్తున్నట్లు మనిషి మనసులో ఆలోచనలు కూడా ఆగకుండా నిరంతరం కొనసాగుతూనే వుంటాయి. వాటిని నియంత్రించలేము.అయితే వాటిని మనకు అనుకూలంగా మార్చుకుంటే ఉన్నతికి దోహదం చేస్తాయి.వాటికి సరైన సమాధానం చెప్తూ ఉండాలి.అప్పుడే మనసు స్థిమితపడి విపరీతమైన ఆలోచనలకు తనంత తానే అడ్డుకట్ట వేయగలదు.
కాబట్టి మన పెద్దలు చెప్పేది ఒక్కటే...ఊహాలోకాల్లో జీవించకుండా ప్రస్తుతం పైన మనసు లగ్నం అయ్యేలా చేయాలి. వచ్చే ఆలోచనలను మూడో వ్యక్తిగా మనకు మనమే పరిశీలన చేయాలి. అంతే కాదు  అనవసర ఆందోళనను మానేసి మానసికంగా శారీరకంగా ప్రశాంతంగా ఉండేందుకు యోగా,ప్రాణాయామా చేయాలి. మనసు ఖాళీ లేకుండా ఏదో ఒక మంచి వ్యాపకం పెట్టుకోవాలి.
 మొత్తంగా మనం ఈ "భౌత విచార న్యాయము" ద్వారా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే పిచ్చి, పుచ్చు ఆలోచనల దారిని  మనో వికాసం, మానవీయ విలువల పనుల వైపు మళ్ళించాలి.తద్వారా మనకూ, సమాజానికి గణనీయంగా మేలు జరుగుతుంది.నాతో ఏకీభవిస్తారు కదూ!

కామెంట్‌లు