అదృష్టం అంటే నీదేరా ; - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక ఊరిలో ఒక రైతు వుండేటోడు. ఆయన చానా పేదోడే కానీ చానా చానా మంచోడు. మూగవాళ్ళకు నోటిలో మాటలాగుండేటోడు. గుడ్డివాళ్ళకు చక్కని చూపులాగుండేటోడు. ముసలివాళ్ళకు చేతికర్రలాగుండేటోడు. ఆడపిల్లలకు ధైర్యాన్నిచ్చే ఆయుధంలా వుండేటోడు. వూరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అందరికన్నా ముందు అక్కడ వుండేటోడు. కార్యక్రమం ముగిసేదాకా అన్ని పనుల్లో చేయి కలిపేటోడు. అందుకే అందరికీ ఆ రైతంటే చానా ఇష్టం. సొంత బంధువులెక్క చూసుకునేటోళ్ళు. రైతు పెండ్లాం గూడా చానా మంచిది. మొగుడు చేసే పనికి సాయం చేయడమే తప్ప ఏనాడూ ఎదురు మాట్లాడిందీ లేదు, చెయ్యనని వెనక్కి తిరిగిందీ లేదు. ఆ రైతుండే వూరి పేరు జొన్నగిరి. దాని అసలు పేరు సువర్ణగిరి అని, ఒకప్పుడు అశోకుని పాలనలో రెండవ రాజధానిగా ఒక వెలుగు వెలిగిందని చానామంది పండితులంటారు. ఆ వూరిలో వజ్రాలు దొరుకుతాయని పెద్ద పేరు. దాంతో ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఆశగా ఆ వూరి చుట్టుపక్కల వున్న పొలాల్లో, కొండల్లో నిరంతరం తవ్వుతా వెదుకుతా వుంటారు. అనేకమందికి చానా విలువైన వజ్రాలు ఎన్నోసార్లు దొరికినాయి. రాత్రికి రాత్రి ధనవంతులైనవారు ఎందరో. ఒకసారి ఆ పేదరైతు పొలానికి పోయి దాన్ని దున్నుతా బాగా అలసి పోయినాడు. దాహం అవుతావుంటే తాగుదామని చెంబు పైకెత్తినాడు. అంతలో ఒక్కసారిగా సర్రుమని గాలి పైకి లేచి, దుమ్ము రైతు కంట్లో పడింది. దాంతో చేతిలోని చెంబు జారి కిందపడి నీళ్ళన్నీ పొలంలో ఒలికిపోయినాయి. రైతు కల్ళు నులుముకుంటూ ఆ చెంబును తీసుకోవడానికి కిందికి వంగినాడు. ఆ నీళ్ళు యాడైతే పడినాయో ఆడ ఏదో తళుక్కుమని మెరిసింది. ఏమబ్బా మెరుస్తావుంది అని పరీక్షగా వంగి చూస్తే.... ఇంగేముంది చానా చానా విలువైన చిన్న వజ్రం నక్షత్రం లెక్క ధగధగా మెరిసిపోతా కనబడింది. నీళ్ళు పడి అంతవరకూ దానిమీదున్న మట్టంతా తొంగిపోయింది. రైతు ఆ వజ్రాన్ని చేతుల్లోకి తీసుకొని ''ఆహా... ఎంత అదృష్టం. చూడ్డానికి చిన్నగా వున్నా లోపల ఒక్క మచ్చగూడా లేకుండా తళతళతళ మెరిసిపోతావుంది. ఈ వజ్రం అమ్మి ఇంకొంచం పొలం కొనుక్కుంటే ఇకపై జీవితమంతా ఎటువంటి చీకూ చింతా లేకుండా హాయిగా బతకొచ్చు అనుకున్నాడు. సంబరంగా ఆ వజ్రాన్ని ఇంటికి తీసుకోనొచ్చి పెండ్లానికి చూపిచ్చినాడు. అమె దాన్ని ముట్టుకోని, ముట్టుకోని మురిసిపోయింది. ఈ విషయం వూరంతా ఒక్కసారిగా గుప్పుమనింది. ఆ రైతు చానా మంచోడు కావడంతో అందరూ సంతోషపడ్డారే గానీ ఎవ్వరూ అసూయ పడలేదు. ''నీ మంచితనమే నీకు మేలు చేసింది. నీవు పాటించిన ధర్మమే నీకు వజ్రాన్ని దొరికేలా చేసింది'' అని మెచ్చుకున్నారు. ఆ రైతు పక్కవూరి వజ్రాల వ్యాపారికి తరువాత రోజు వచ్చి దానికి సరియైన ధర చెల్లించి తీసుకుపొమ్మని కబురు పంపినాడు. ఆ రాత్రి దాన్ని భద్రంగా ఒక గూట్లో పెట్టి హాయిగా నిదురపోయినాడు. ఆ ఇంటిలో ఒక పెద్ద ఎలుక వుంది. అది చీకటి పడగానే రైతు ఇంటిలోనికి పోయి గింజలు, మిగిలిపోయిన అన్నం, కూరగాయలు తింటావుండేది. ఎప్పట్లాగే అది ఆ రోజు రాత్రిగూడా ఆహారం కోసం ఇండ్లంతా వెదుకుతా వుంటే దానికి గూట్లో ధగధగా మురిసిపోతావున్న వజ్రం కనబడింది. ఇదేందబ్బా... కొత్తగా వుంది. ఎప్పుడూ చూల్లేదే ఇటువంటి గింజ అని నోటితో పట్టుకోని కొరకసాగింది. అట్లా కొరుకుతావుంటే అది లటుక్కున జారి దాని గొంతులో ఇరుక్కోనింది. అటూ బైటికీ రాక, ఇటు లోపలికీ పోక గిజగిజలాడతా కిందామీదా పడి పొర్లసాగింది. ఆ చప్పుడుకి పొదలో పడుకున్న ఒక పాము పైకి లేచి దాన్ని చూసింది. ''ఆహా... బాగా లావుగా కొవ్వు పట్టి నిగనిగలాడతావుంది. ఎన్నాళ్ళకు దొరికింది ఇంత మంచి ఆహారం. ఈ రోజు దీన్ని పట్టుకోని పండగ చేసుకోవచ్చు' అనుకొని నెమ్మదిగా పొదలమాటున దాచిపెట్టుకుంటా... దాచి పెట్టుకుంటా ఆ ఎలుక దగ్గరికి వచ్చింది. ఎలుక వజ్రం గొంతులో ఇరుక్కోని తనకలాడతా వుంది గదా.... అది పాముని గమనించలేదు. అంతే... ఇంకేముంది పాము ఆ ఎలుకని లటుక్కున పట్టుకోని గుటుక్కున మింగేసింది. అట్లా ఆ వజ్రం ఎలుకతో బాటు పాము నోటిలోకి వెళ్ళిపోయింది. పాము ఎలుకను మింగి సంబరంగా ఒక చెట్టుకింద పొదలో హాయిగా చుట్టచుట్టుకొని పడుకుంది. ఆ చెట్టుపైన ఒక పెద్ద గద్ద వుంది. దానికి ముందురోజునుంచీ తినడానికి ఏమీ దొరకలేదు. దాంతో ఆకలితో అల్లాడిపోతావుంది. చెట్టుపైన కూచోని చుట్టూ చూడసాగింది. దానికి పొదలో పడుకున్న ఈ పాము కనబడింది. 'ఆహా... దొరికిందిరా మంచి పసందైన విందు భోజనం' అనుకుంటూ ఆ గద్ద సర్రున దూసుకోనొచ్చి ఆ పాముని తన వాడిగోళ్ళతో పట్టుకోని ఒక్కసారిగా పైకెగిరింది. పాము అదిరిపడి నిద్రలేచేలోగా తన వాడియైన ముక్కుతో పొడిచి చంపేసింది. ఒక చెరువు పక్కన పెద్ద చెట్టుంటే దానిమీద వాలి తినసాగింది. అట్లా తింటావుంటే మధ్యలో ఈ వజ్రం వచ్చింది. అది ధగధగా మెరుస్తావుంటే తినేదో, కాదో అర్థంగాక ముక్కుతో టపటపా కొట్టి చూసింది. అది బాగా గట్టిగా వుండడంతో పనికిరానిదని కింద వున్న చెరువులో పడేసింది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఒక పెద్ద చేప వచ్చింది. ఆ వజ్రం సరిగ్గా దాని నోటిలో పడింది. అంతే... అది దానిని గుటుక్కున మింగేసింది. ఆ తరువాత రోజు ఆదివారం. ఆదివారమంటే చానామంది కోళ్ళు, మేకలు, చేపలు, రొయ్యలు తింటా వుంటారు గదా. దాంతో వాటికి బాగా గిరాకీ వుంటుంది. అందుకని జాలరులు చేపలు పట్టడానికని చెరువులోకి వలలు విసిరినారు. ఒకని వలలో ఈ పెద్ద చేప చిక్కుకోనింది. 'ఆహా... ఎంతదృష్టం. పొద్దున్నే నక్కతోక తొక్కి వచ్చినట్టున్నా. అందుకే ఇంత పెద్ద చేప దొరికింది'' అనుకోని వాడు సంబరంగా దొరికిన చేపలు గంపలో ఏసుకోని అమ్ముకోడానికి వూర్లోకి వచ్చినాడు. రైతు పెండ్లాం ఆ రోజు పొద్దున్నే లేచింది. మొగుడు చానా రోజులనుంచీ 'చేపలకూర చెయ్యే ఒక్క రోజైనా' అంటా వున్నాడు. దుడ్లు లేక రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అంటూ ఒక్కొక్క రోజే దాటేస్తావుంది. నిన్ననే కూలీ డబ్బులు చేతికి వచ్చినాయి. దానికి తోడు వజ్రం దొరికింది గదా... ఆ సంబరమూ తోడైంది. దాంతో మొగునికి మంచిగా చేపలకూర చేసి పెడదామని ఇంటిముందు నిలబడి ఎదురు చూస్తావుంది. వాళ్ళ పక్కింట్లో బాగా డబ్బున్న కుటుంబం వుంది. ఆమె గూడా పొద్దున్నే లేచి మొగునికి చేపలకూర చేసి పెడదామని తలుపుకాడ నిలబడి పదురు చూస్తావుంది. అంతలో చేపలమ్మేటోడు ఆ వీధిలోకి వచ్చినాడు. ఇద్దరూ వాన్ని పిలిచినారు. పెద్ద చేప చానా ఖరీదు గదా... దాంతో పక్కింటామె కొనుక్కోనింది. రైతు పెండ్లాం చిన్న చేపను కొనుక్కోనింది. పొద్దున్నే రైతు లేచి సంబరంగా చూస్తే ఇంకేముంది వజ్రం గూట్లో కనబల్లేదు. అది ఎక్కడైనా పడిపోయిందేమోనని మొగుడూ పెళ్ళాలు కలసి ఇండ్లంతా కిందికీ మీదికీ వెదికినారు. కానీ అసలుంటే గదా దొరికేది. పాపం... వెదికీ వెదికీ అలసిపోయినారు. పాపం ఆమె కండ్లనుండి సర్రున నీళ్ళు కారినాయి. ''అదృష్టం చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయిందే'' అని తెగ బాధపడింది. అది చూసి ఆ రైతు ''మనం కష్టపడి సంపాదిచ్చినదైతే పోయినందుకు బాధ పడాలిగానీ వూరికే వచ్చిందానికి బాధ ఎందుకు. అసలు దొరకలేదు అనుకుంటే సరి'' అన్నాడు చిరునవ్వుతో పెండ్లాన్ని ఓదారుస్తూ. అంతలో వాళ్ళింటి తలుపు ఎవరో తట్టినారు. ఎవరబ్బా అని పోయి చూస్తే ఇంకేముంది నగరం నుండి వచ్చిన వజ్రాల వ్యాపారస్తులు. రైతు వజ్రం అమ్ముతానని కబురు పంపినాడు గదా దాంతో కొనడానికని వచ్చినారు. రైతు వాళ్ళకి జరిగిందంతా చెప్పి ''జరిగిందేదో జరిగిపోయింది. ఎట్లాగూ ఇంత దూరం వచ్చినారు గదా. మరలా వెంటనే ఏం వెళతారు గానీ కాసేపు విశ్రాంతి తీసుకోండి. వేడి వేడి చేపలకూర తిని పోదురుగానీ... నా పెండ్లాం చేతివంట అచ్చం పుల్లారెడ్డి నేతిమిఠాయి లెక్క కమ్మగుంటాది'' అన్నాడు. వాళ్ళు సరే అన్నారు. రైతు పెండ్లాంతో ''ఏమే... పొద్దున్నే మనకోసం మాంచి చేపలు కొన్నావు గదా... పాపం వాళ్ళు చానాదూరం నుంచి వచ్చినారు. ఎప్పుడు తిన్నారో ఏమో... తొందరగా జొన్నరొట్టె చేపలపులుసు చెయ్‌'' అన్నాడు. ఆమె సరేనని పెరట్లో కూర్చోని చేపల పొలుసులు తీసి శుభ్రం చేస్తావుంటే పక్కింటామె వచ్చి ''అక్కా.... అనుకోకుండా మా దగ్గరి బంధువుల్లో ఒకాయనకు ఆరోగ్యం బాగాలేదని, ఆఖరిచూపు చూడ్డానికి క్షణం గూడా ఆలస్యం చేయకుండా వున్నఫలానా వచ్చేయమని కబురొచ్చింది. అందుకే ఎక్కడిపనులు అక్కడే వదిలేసి వెంటనే వెళ్ళి పోతావున్నాం. పొద్దున్నే నీతోబాటు ఒక పెద్ద చేప కొన్నా గదా... అది తీసుకో. దానిమీద మీ పేర్లే రాసిపెట్టినట్టున్నాయి. మీరన్నా హాయిగా కడుపునిండా తినండి'' అంటూ ఆ చేపను తీసుకోనొచ్చి ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. రైతు పెండ్లాం సంబరంగా ఆ చేపను గూడా బాగా కడిగి కత్తిపీటతో మధ్యకు కోసింది. అంతే... ఇంకేముంది దాని కడుపులో పొద్దున పోగొట్టుకున్న వజ్రం తళతళతళ మెరుస్తా కనబడింది. అది చూసి ఆమె సంబరంగా కప్పెగిరిపోయేటట్టు కెవ్వున కేక పెట్టింది. ఆ అరుపుకు అదిరిపడి ఇంట్లోవున్న అందరూ పరుగెత్తుకొని అక్కడికి వచ్చినారు. గూట్లో పెట్టిన వజ్రం చేప కడుపులోకెట్లా పోయిందో వాళ్ళకు అస్సలు అర్థం కాలేదు. వజ్రాల వ్యాపారస్తులు దాన్ని చూసి ''నీ మంచితనమే మరలా వజ్రాన్ని నీ దగ్గరికి చేర్చింది. ఇట్లాంటి విచిత్రాన్ని, నీలాంటి అదృష్టవంతున్ని ఈ లోకంలో మేమెప్పుడూ చూడలేదు'' అంటూ బాగా మెచ్చుకున్నారు.
***********
కామెంట్‌లు