కందనవోలు అనే వూరికి ఒకరోజు ఒక సాధువు వచ్చాడు. ఆయనకు అనేకమయిన మహిమలు వున్నాయి. దాంతో ఆ వూరి జనాలంతా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ధనసహాయం చేయమని అడగసాగారు. కానీ ఒక ముసలాయన వచ్చి “సామీ... మా ఊరిలో రెండు ఏళ్ళ నుండీ వానలు సరిగ్గా లేవు. కరువుతో అల్లాడిపోతున్నాం. వానలు కురిపించండి చాలు" అన్నాడు.
సాధువు జనాల వైపు తిరిగి “మీకు వానలు కావాలా, బంగారు వరహాలు కావాలా" అని అడిగాడు. ఒక్క ముసలాయన తప్ప అందరూ వరహాలే కావాలన్నారు. సాధువు చిరునవ్వు నవ్వి "నీటి కన్నా విలువయినది ఏదీ లేదు. నీళ్ళుంటే అన్ని సంపాదించుకోవచ్చు. కాకపోతే కొంచం పని చేయాలి. మరొక్కసారి ఆలోచించుకోండి" అన్నాడు. జనాలు ఈసారి కూడా తమకు “బంగారు వరహాలే కావాలి" అన్నారు.
“సరే అయితే... రేపు వరహాల వాన పడుతుంది. కానీ మళ్ళీ ఎప్పటికీ మామూలు వాన పడదు. సరేనా" అన్నాడు. అందరూ సంతోషంగా “సరే... సరే... " అన్నారు. సాధువు ఆకాశం వైపు చూసి, చేతిని గాలిలో ఆడించి “రేపు తెల్లవారగానే వరహాల వాన పడుతుంది. పోండి" అని చెప్పాడు.
జనాలంతా ఇళ్ళకు తిరిగి వచ్చారు. ఆరోజు ఎవరికీ నిదురపట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూడసాగారు. తెల్లవారగానే సాధువు చెప్పినట్టే వరహాల వాన కురవడం మొదలు పెట్టింది. జనాలంతా దొరికినేవి దొరికినట్టు ఏరుకోని ఇళ్ళల్లో, పెట్టెల్లో నింపుకోసాగారు. అవి నిండగానే బిందెల్లో, బానల్లో వున్న నీళ్ళన్నీ పారేసి వాటిని కూడా బంగారంతో నింపుకున్నారు. ఇళ్ళల్లో వుండే తినుబండారాలన్నీ బైట పడేసి సంచుల నిండా, గదుల నిండా అంతా వరహాలతో నింపేసుకున్నారు.
వరహాల వాన పడతానే వుంది. చెరువులు బావులు అన్నీ వరహాలతో నిండిపోయాయి. వీధులన్నీ వరహాలతో నిండిపోయాయి.
ఊరిలోని జంతువులు జనాలు ఇళ్ళ బయట పారేసిన ఆహారాన్నంతా తిని, హాయిగా నీటిని తాగేశాయి.
జనాలంతా ఆ వరహాలను చూసి సంతోషంగా వున్నారు. నెమ్మదిగా చీకటిపోయి వెలుతురు రాసాగింది. గంటగంటకీ ఎండ పెరుగుతా వుంది. అందరికీ నాలుకలు తడారిపోతా వున్నాయి. ఆకలయితావుంది. తిందామంటే తిండిలేదు. తాగుదామంటే నీళ్ళులేవు. ఎక్కడ చూసినా వరహాలే. కానీ వాటిని ఏం చేసుకోవాలో తెలియ లేదు. అమ్ముదామంటే కొనేవారు లేరు. అందరూ అన్నీ పాడేశారు. పక్క దేశాలకు పోదామంటే దారులన్నీ మూసుకుపోయాయి.
పిల్లలు, పెద్దలు, ఆడోళ్ళు, మొగోళ్ళు అందరూ తిండిలేక, నీళ్ళు లేక ఒకొక్కరే పడిపోసాగారు. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. వానను కోరుకోకుండా వరహాలను కోరుకున్నందుకు బాధపడ్డారు. అందరూ కళ్ళనీళ్ళు బెట్టుకోని సాధువు దగ్గరికి పోయారు. "సామీ... మాకు ఈ బంగారం, వరహాలు ఏవీ అక్కరలేదు. సమయానికి సరిగ్గా వానలు పడితే చాలు. పనిచేసి మేమే అవన్నీ కొనుక్కోగలం. ఈ ఒక్కసారికి మా అందరిని మన్నించండి" అన్నారు.
అప్పుడు సాధువు చిరునవ్వు నవ్వి వారిని కాపాడమని దేవున్ని వేడుకొన్నాడు. వెంటనే ఆ వరహాలన్నీ మాయమైపోయాయి. కాసేపటికే భూమి తడిసి ముద్ద ముద్ద అయిపోయేటట్టు,
దోనెలు కారేటట్టు, పిల్ల కాలువలు ఉరుకులాడేటట్టు మంచి వాన కురిసింది. ఆరోజు నుండీ ఆ వూరి జనాలు ఆశకు పోకుండా... పొలం పనులు చేసుకుంటూ... వచ్చిందానితో సుఖంగా గడపసాగారు.
**********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి