ఒకూర్లో ఒక జాలరి వుండేటోడు. ఆయనకి ఇద్దరు పిల్లలు, మొదటి కొడుకు పుట్టిన పది సంవత్సరాలకు రెండో కొడుకు పుట్టినాడు. జాలరి ఒకసారి ఒక నయం కాని రోగం బారిన పడ్డాడు. చనిపోయేముందు పెద్ద కొడుకును పిలిచి “రేయ్... చిన్నోడు జాగ్రత్త. నా తరువాత తల్లయినా తండ్రయినా నువ్వే. వాన్ని నీ తమ్ముని లాగా కాక కొడుకులాగా పెంచుతానని మాటివ్వు" అన్నాడు.
పెద్దోడు వాళ్ళ నాన్న చేతిలో చేయి వేసి “నాయనా... నువ్వేం దిగులుపడకు. సిన్నోన్ని నేనూ నా పెళ్ళాం రెక్కలు రాని పక్షిపిల్లలా అపురూపంగా చూసుకుంటాం. అంతెందుకు నేను వాని కాలికి చెప్పులాగుంటా, నెత్తికి గొడుగులాగుంటా, ఆకలైతే అమ్మలాగుంటా, ఆపదలో నాన్నలాగుంటా, ఏం సరేనా" అన్నాడు.
ఆరోజు నుంచీ పెద్దోడు వాని కళ్ళలోంచి ఒక్క కన్నీటి బొట్టు గూడా కారి కింద పడనీయకుండా, ఏది అడిగితే అది అందిస్తా, గారాబంగా పెంచి పెద్ద చేయసాగాడు. అట్లా నెమ్మదిగా వానికి పెండ్లి వయసొచ్చింది. కానీ వాళ్ళన్నకు వాడు ఎప్పుడూ పసిపిల్లోనిలెక్కనే కనబడేటోడు. అదీగాక పెద్దోనికి పిల్లల్లేరు. దాంతో వాన్ని బాగా నెత్తికి ఎక్కించుకున్నాడు.
చిన్నోడు పనీపాటా చేయకుండా పెరిగినాడు గదా... దాంతో పెద్ద సోమరిపోతయ్యాడు. మూడుపూటలా తినడం, వూర్లో పనీపాటా లేని పోరంబోకుగాళ్ళతో కలిసి గప్పాలు కొట్టుకుంటా తిరగడం అలవాటయ్యింది.
నెమ్మదిగా కొంతకాలానికి చిన్నోనికి పెండ్లి వయసొచ్చింది. మంచి సంబంధం చూసి పెళ్ళి చేద్దామని వెదకడం మొదలుపెట్టారు. ఎవర్నడిగినా కిందామీదాపడి నవ్వుతా “ఏందీ మీ చిన్నోనికా... పనీపాట తెలిసినోడు ఎంత పేదోడైనా పిలిచి పిల్లనివ్వొచ్చుగానీ, జులాయిగా తిరిగే మీవోనికి ఎదురుకట్నం ఇచ్చినా ఎవ్వరూ పిల్లనివ్వరు. చూసి చూసి ఎవ్వరూ కన్నకూతురి గొంతు కొయ్యలేరు గదా” అని మొగమ్మీదనే ఈడ్చికొట్టినట్లు చెప్పారు.
వూరంతా అట్లా అంటా వుంటే... ఆ మాటలకు పెద్దోని పెండ్లాం తట్టుకోలేక ఒక రోజు మొగునితో “మన గారాబంతోనే వాడు బాగా చెడిపోతున్నాడు. వాని నెత్తిమీద రూపాయి పెట్టి అమ్మినా అర్ధరూపాయకు గూడా ఎవరూ కొనడానికి ముందుకు రారని మొగం మీదనే ఎగతాళి చేస్తా వున్నారు. జనాల మాటలని గూడా తప్పు పట్టలేం. ఎవడైనా తమ పిల్ల సుఖంగా వుండాలనే గదా కోరుకుంటారు. మనం ఇంకా చూసీ చూడనట్లుగా ఇట్లాగే వుంటే లాభం లేదు. ఏది ఏమైనా సరే చిన్నోనికి పని నేర్పాల్సిందే. నీతో బాటు రేపట్నించి చేపలు పట్టడానికి చెరువుకు తీసుకొనిపో, ఒక నెల కష్టపడితే పని దానంతట అదే అలవాటవుతుంది. వాని మంచి కోసమే ఇదంతా” అని పోరు పెట్టింది.
దాంతో వాడు సరే అని తరువాత రోజు పొద్దున్నే తమ్మున్ని తీసుకోని నదికి బైలు దేరాడు. అది మంచి చలికాలం, అన్న అంగీ విప్పి వల తీసుకోని నదిలోనికి దిగాడు. చిన్నోనికి నదిలో కాలు పెట్టగానే ఆ చల్లని నీళ్ళకు ఒళ్ళు జివ్వుమని జలదరించింది. చలికి గజగజగజ వణుకుతా “అన్నా... నువ్వెట్లా నవ్వుతా నదిలో ఈత కొడతా వున్నావోగానీ... ఈ చలికి నా ఒళ్ళు గడ్డకట్టి ఈ నీళ్ళలోనే పడి చచ్చేటట్టున్నాను. ఈ జివ్వుమనే ఐసు నీళ్ళలో దిగడం చచ్చినా నావల్ల కాదు. మరో నాలుగు నెలలాగు. ఇట్లా చలికాలం పోవడం అలస్యం అట్లా నువ్వు ఏ పని చెబితే ఆ పని చేస్తా, సరేనా” అన్నాడు.
దానికి పెద్దోడు “పాపం పసిపిల్లోడు. చలికి అస్సలు తట్టుకోలేకుంటున్నాడు. సరే... ఎట్లాగూ ఇన్ని రోజులు ఆగినా గదా... ఇంకో నాలుగు నెలలు ఆగితే పోయేదేముంది" అనుకోని 'సరే' అన్నాడు.
నెమ్మదిగా నాలుగు నెలలు గడిచిపోయాయి. గజగజగజ వణికించే చలిగాలులు పోయి సలసలసల మండించే వేడిగాలులు మొదలయ్యాయి. అయినా చిన్నోడు తనకేమీ పట్టనట్టుగా హాయిగా మూడుపూటలా ఉడుకుడుకు అన్నం తినుకుంటా, గాలికబుర్లు చెప్తా, వీధుల్లో తిరుగుతా వున్నాడు. పెద్దోడు గూడా చూసీచూడనట్లు తన పని తాను చేసుకోసాగాడు.
అది చూసి పెద్దోని పెండ్లాం ఇట్లాగైతే లాభం లేదనుకోని ఒక రోజు మొగునితో “నాలుగు నెలలన్నది కాస్తా ఐదు నెలలయిపోయింది. ఐనా పనికి పోవాలని వానికీ లేదు. పిలవాలని నీకూ లేదు. ఇప్పటికే వాని ఈడు పొట్టెగాళ్ళు పెండ్లి చేసుకోని పిల్లాపాపలతో, సొంతంగా ఎవని కాళ్ళ మీద వాళ్ళు నవ్వుతా బతుకుతా వున్నారు. నువ్విట్లాగే వుంటే వాడు పని నేర్చుకున్నట్లే... సంపాదించినట్లే.... పెండ్లి చేసుకున్నట్లే. రేప్పొద్దున తీసుకోని పోతావా పోవా" అని పోరు పెట్టుకుంది.
'సరే' అని పెద్దోడు తరువాత రోజు చిన్నోన్ని తీసుకోని పనికి పోయాడు. సిన్నోడు అన్నతో బాటు నదిలోకి దిగాడు. పదిగంటలు దాటేసరికి ఎండ సుర్రు సుర్రుమని చంపసాగింది. అది చూసి చిన్నోడు “అన్నా.... రోళ్ళు పగిలే ఈ ఎండాకాలంలో నువ్వెట్లో పని చేస్తా వున్నావో గాని నాకు అస్సలు చేతకావడం లేదు. ఎండకు నెత్తి సలసలసల మాడి, కళ్ళు బైర్లు కమ్ముతా వున్నాయి. కింద కాళ్ళు నిలబడడం లేదు. ఈ నిమిషం గాకపోతే మరో నిమిషం మబ్బెక్కి ఈ నీళ్ళలోనే పడి మునిగి చచ్చేట్టున్నాను. ఇంత ఎర్రని ఎండలు నేను భరించలేను గానీ మరో నాలుగు నెలలాగు. ఇట్లా ఎండాకాలం పోవడం ఆలస్యం అట్లా నువ్వు ఏ పని చెబితే ఆ పని క్షణం గూడా ఆలస్యం చేయకుండా చేస్తా. ఏం సరేనా" అన్నాడు.
దానికి పెద్దోడు “సరే... ఎట్లాగూ ఇన్ని రోజులు ఆగినాం గదా. మరో నాలుగు నెలలు ఆగితే పోయేదేముంది. పాపం పసిపిల్లోడు ఎండలకు తట్టుకోలేకుండా వున్నాడు" అనుకున్నాడు.
నెమ్మదిగా మరో నాలుగు నెలలు గడిచిపోయాయి. సలసలసల మండించే వేడిగాలులు పోయి, జలజలజల వాన చినుకులు పైనుంచి కిందికి రాలసాగాయి. అయినా చిన్నోడు అదంతా చూసీ చూడనట్లుగా హాయిగా మూడు పూటలా మేస్తా, వీధుల్లో వుత్తకబుర్లు చెబుతా తిరగసాగాడు.
అది చూసి పెద్దోడి పెండ్లాం తట్టుకోలేక మొగునితో “నాలుగు నెలలు దాటిపోయి నాలుగు వారాలయితా వుంది. దగ్గరికి పిలిచి నాలుగు మంచిమాటలు చెప్పి, నలుగురు నడిచే దారిలో నడిపియ్యాల్సిన నీవు ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు గమ్మున కూచున్నావు. ఇట్లాగే ఇంకొన్ని రోజులుంటే వెనకాల సాటుమాటుగా తిడతా వున్న జనాలు, ఇకపైన ముందుకొచ్చి మొగమ్మీదనే వూస్తారు. ఇప్పటికన్నా పనికి పిలుచుకొని పోతావా లేక ఇలాగే నెత్తిన పెట్టుకోని వూరేగుతావా" అంటూ పోట్లాటకు దిగింది.
దాంతో పెద్దోడు తరువాత రోజు పొద్దున్నే చిన్నోన్ని లేపుకోని పనికి తీసుకోని పోయాడు. వానాకాలం కావడంతో నది పూర్తిగా నిండిపోయి పరవళ్ళు తొక్కుతా వుంది. అన్ననెట్లా మాటలతో బోల్తా కొట్టియ్యాల్నో చిన్నోనికి బాగా తెలుసు గదా... దాంతో వాడు “అన్నా... సర్రున కొండ సిలువలా వురుకులాడ్తావున్న ఈ నదిని చూస్తావుంటే గుండె గుభేలుమంటా వుంది. అలలు కిందికీ మీదికీ దయ్యం పట్టినట్లు ఎట్లా వూగుతా వున్నాయో చూడు. ఏదో నడుంలోతున్న చిన్న చిన్న కుంటలల్లో అయితే దిగగలను గానీ బొంగులోతున్న ఈ నదిలో దిగడం నావల్ల గాదు. కాలు పెట్టడం ఆలస్యం సర్రున జారి టపీమని మునిగిపోవడం ఖాయం. తర్వాత నా శవం గూడా ఎవరికీ దొరకదు” అన్నాడు.
ఆ మాటలింటానే పెద్దోడు “అవేం మాటలురా అసహ్యంగా, ఎండాకాలంలో బాగా నీళ్ళు తగ్గినాక ఈత నేర్పిస్తాలే. అప్పటివరకు ఇంటికిపో” అన్నాడు. వాడు లోపల్లోపల సంబరంగా నవ్వుకుంటా ఇంటికి వచ్చాడు.
ఇదంతా చూసి పెద్దోని పెళ్ళాం తల కొట్టుకొంది. ఆమెకు చిన్నోని మాయమాటలు, పెద్దోని ప్రేమ బాగా తెలుసు. ఆమెకు గూడా చిన్నోడంటే చానా ప్రేమనే. కానీ రేప్పొద్దున తమకు జరగరానిది ఏమన్నా
జరిగితే వాని బ్రతుకెట్లా. ఎట్లాగైనా వాని కాళ్ళ మీద వాన్ని నిలబడేటట్లు చేయగలిగితే ఏ బాధా వుండదు. సంపాదించడంలో వున్న మజా ఒక్కసారి అర్థమైతే ఇంక వాన్ని ఎవరూ ఆపలేరు. కానీ వాన్ని పనిలోకి దింపడం ఎలా అని నాలుగు రోజులు రాత్రింబవళ్ళు కిందామీదాబడి తెగ ఆలోచించింది. చివరికి ఒక నిర్ణయానికొచ్చింది.
మొగునితో “చిన్నోని బలమూ, బలహీనత రెండూ నువ్వే. నువ్వున్నంతవరకూ వాడు అటు పుల్ల తీసి ఇటు పెట్టడు. నువ్వు గూడా చూసి చూసి వాని మీద ఈగ వాలనివ్వవు.
కానీ మనకు ప్రేముంటే సరిపోదు. బాధ్యతలు గూడా వుండాలి. చిన్నోడు గూడా అందరిలెక్కనే తలెగరేసి పరువు మర్యాదలతో బతకొద్దా. పదిమంది పనిమంతుడని మన పిల్లోన్ని పొగుడుతా వుంటే సెవులకు సక్కని సంగీతం విన్నట్లు ఎంత కమ్మగా వుంటాది. నీకయినా నాకయినా వుండేది వాడొక్కడే. ఇదంతా పిల్లోని మీద ప్రేమతోనే సెబుతున్నా" అంటూ ఏం సేయాలో సెప్పింది. వాడదంతా విని 'సరే' అన్నాడు.
కానీ అనుకోకుండా ఆ తరువాత రోజు ఏమైందంటే... పెదోడు పొద్దున్నే ఎప్పట్లాగే వల తీసుకోని చేపలు పట్టడానికి నదికి పోయాడు. అట్లా పోయినోడు మళ్ళా తిరిగి రాలేదు. వాని కోసం ఆ వూరిలోనే గాక చుట్టుపక్కల వూర్లంతా వెదికారు. కనబన్నోనినల్లా అడిగారు, వూహూ లాభం లేదు. కొంపదీసి నీళ్ళల్లో మునిగి కొట్టుకుపోయినాడో ఏమో అనుకున్నారు.
పెద్దోని పెళ్ళానికి ఏమి చేయాల్నో తోచలేదు. కూచుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు గదా, ఇంట్లో వున్న పప్పూ బియ్యం అన్నీ అయిపోయాయి. నగలు కుదువబెట్టి ఆ వచ్చిన డబ్బుల్తో ఇంకొంత కాలం గడిపారు. ఆఖరికి తినడానికి గూడా తిండికి కష్టమయి పోయింది.
దాంతో పెద్దోని పెళ్ళాం “ఇట్లాగే వుంటే పస్తులతో సావడం ఖాయం" అనుకోని, ఆ యింట్లో ఈ యింట్లో పని చేసి వచ్చిన డబ్బుల్తో కుటుంబం నడపసాగింది.
అది చూసి జనాలు చిన్నోనితో ఛీ... ఛీ... ఏం బతుకురా నీది. ఆడోళ్ళు కష్టపడి సంపాదిస్తా వుంటే తిని బతుకుతా వున్నావు. మీ అన్న వున్నప్పుడు మీ వదిన్ని ఒక్కరోజు గూడా బైట పనులకి పంపలేదు. నిన్ను కన్నకొడుకు లెక్క కడుపులో పెట్టుకొని సాకింది. అట్లాంటిది ఆమె కష్టపడి సంపాదిస్తా వుంటే, నోట్లోకి ముద్ద ఎట్లా దిగుతుందిరా. సిగ్గులేని బతుకు, ఇట్లాంటి బతుకు బతకడం కన్నా సావగూడదూ ఏ బాయిలోనన్నా దూకి" అంటూ కనబడినోడల్లా తలా యింత గట్టి పెట్టాడు.
ఆ మాటల్తో వాడు బాగా సిగ్గుపడిపోయాడు. ఇప్పటికైనా మారకపోతే తనకూ పశువుకూ తేడా లేదనుకున్నాడు. ఇంట్లో మూలన అన్న చేపలు పట్టడానికి తీసుకొని పోయే వల కనబడింది. తరువాత రోజు పొద్దున్నే దాన్ని తీసుకోని నదికి పోయాడు. కొన్ని చేపలు పడ్డాయి. వాటిని అమ్మి డబ్బులు తీసుకోనొచ్చి వదిన చేతిలో పెట్టాడు.
ఇంగ ఆరోజు మొదలు ఆరునెలలు తిరిగేసరికి వానికి నదిలో ఏఏ సమయాల్లో ఎక్కడెక్కడ చేపలు తిరుగుతా వుంటాయో, వాటిని ఎట్లా పట్టాల్నో, ఎక్కడ అమ్మాల్నో, నది ఎక్కడెక్కడ ఎంతెంత లోతుగుంటాదో, ఏ లోతులో ఏ రకం చేపలు వుంటాయో అన్ని కిటుకులు వంటబట్టాయి. చేతిలో నెమ్మదిగా డబ్బులు కళకళలాడ సాగాయి. తాకట్టు పెట్టిన వదిన ఒంటి మీద బంగారమంతా నెమ్మదిగా విడిపించాడు. వూర్లో గూడా మర్యాద పెరిగింది. “చిన్నోడు బాగా మారిపోయినాడురా. బొగ్గులెక్కవుండేటోడు కాస్తా బంగారం లెక్క తయారయ్యాడు. వానికి పిల్లనిస్తే మన పాప సుఖపడుతుంది” అంటూ సంబంధం మాట్లాడ్డానికి ఒక్కొక్కరే రాసాగారు. అది చూసి వదిన చానా సంబరపడింది. ఒక మంచి సంబంధం చూసి “చిన్నోడా... మంచి పని తెలిసిన పిల్ల, నీకు ఈడు జోడు బాగుంటాది. నువ్వు వూ అంటే మంచి రోజు చూసుకోని ముహూర్తాలు పెట్టుకుందాం" అంది.
ఆ మాటలకు చిన్నోడు “వదినా.... నాకు అమ్మయినా వదినయినా అన్నీ నువ్వే. ఇన్ని రోజులూ నువ్వు పడిన కష్టాలు చాలు. ఇకపై నీ కాలి కింద మెత్తని పూలబాటలా బతుకుతాను. మన ఇంటి గడప తొక్కే పిల్ల నిన్ను సరిగా చూసుకుంటాదో లేదో ఎవరికి తెలుసు. అందుకే నేను సచ్చినా ఎవ్వరినీ పెళ్ళి చేసుకోను" అని తెగేసి చెప్పాడు.
అంతలో ఇంటిముందు ఏదో అలికిడయింది. వెనక్కి తిరిగి చూస్తే ఇంకేముంది పెద్దోడు చిరునవ్వు నవ్వుతా గుమ్మం వద్ద కనబన్నాడు. “అన్నా... నువ్వా... ఇన్నాళ్ళు ఏమైపోయావు. నీకోసం వెదకని ఇల్లూ లేదు. తిరగని వూరూ లేదు" అంటూ వురుక్కుంటా దగ్గరికి పోయాడు.
పెద్దోడు చిరునవ్వు నవ్వి “ఒరే చిన్నోడా... రాయి శిల్పంగా మారాలంటే కొన్ని ఉలిదెబ్బలు తప్పవురా, అందుకే నీ సోమరితనాన్ని వదిలించి, పదిమందిలో నిన్ను తలెత్తుకొని తిరిగే ఒక మంచి మనిషిలా తీర్చిదిద్దడానికి నీ వదినా నేనూ పన్నిన ఉపాయం ఇది" అంటూ జరిగినదంతా చెప్పాడు. తన బాగు కోసం అన్నావదినలు పడిన పాట్లు చూసి చిన్నోడు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
***********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి