న్యాయాలు-668
రుద్రాక్ష బిడాల న్యాయము
******
రుద్రాక్ష అనగా రుద్రాక్ష అనే చెట్టు,రుద్ర+అక్ష= దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపము.బిడాలము అనగా పిల్లి,కనుగ్రుడ్డు అనే అర్థాలు ఉన్నాయి.
రుద్రాక్ష బిడాలము అనగా రుద్రాక్షలు ధరించిన పిల్లి అని అర్థము.
మరి రుద్రాక్ష పుట్టు పూర్వోత్తరాలు ముందుగా తెలుసుకుందాం.
రుద్రాక్ష అనగా రుద్రుని/ శివుని అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భూమి మీద చేరి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారాయని భక్తుల విశ్వాసం.అలాం వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. పురాణాలలో ఈ రుద్రాక్షల గురించి చాలా చోట్ల ప్రస్తావించబడింది.
ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు తమకు శుభం కలిగేందుకు రుద్రాక్షలు ధరించేవారు.అయితే అప్పుడే కాదు ఇప్పుడు నేటి సమాజంలో కూడా సాధువులు,సన్యాసులు, గురువులు, బ్రాహ్మణులలో కొందరు వేదాంతులు మొదలైన వారు వీటిని ధరించడం చూస్తుంటాం. వాటిని ఇళ్ళలో పూజా గృహములో పెట్టుకోవడం కూడా గమనించవచ్చు.
అయితే ఈ రుద్రాక్షలలో చాలా రకాలు ఉన్నాయి.వీటికి వుండే ముఖాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తారు. ఏకముఖి,ద్విముఖి,త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి,షట్ముఖి, సప్త ముఖి,అష్టముఖి,నవముఖి,దశముఖి .. మొదలైన ముఖాలున్న రుద్రాక్షలతో పాటు పన్నెండు, పదిహేను ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో పంచముఖి, ఏకపూజలలో రుద్రాక్ష మాల ధరించిన వారికి సర్వ విధాల శ్రేయస్సు కలుగుతుందని నమ్మకము. అలా మెడలో రుద్రాక్షలు ధరించిన వారిపట్ల ప్రజలకు భయముతో కూడి భక్తి ఉంటుంది.
ఇక విషయానికి వద్దాం. రుద్రాక్ష బిడాలము అనగా రుద్రాక్ష ధరించిన పిల్లి . ఈ కథ పంచతంత్రంలో వుంది. రుద్రాక్ష మాల ధరించిన పిల్లి ఏం చేసిందో చూద్దామా.
పూర్వం గంగానది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉండేది.దాని మీద రకరకాల పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ చెట్టు తొర్రలో ఒక ముసలి గ్రద్ద నివసిస్తూ ఉండేది. దానికి కళ్ళు కనబడక పోవడంతో మిగతా పక్షులు జాలిపడి దానికి ఆహారం తెచ్చి ఇచ్చేవి. అందుకు ప్రతిగా ఆయా పక్షులు మేతకు వెళ్లిన సమయంలో పిల్లలను కాపాడుతూ కాలం గడుపుతోంది.
ఒకసారి పక్షులన్నీ ఆహారం కోసం వెళ్ళడం చూసిన ఓ జిత్తులమారి పిల్లి పక్షి పిల్లలను తినాలని చెట్టు ఎక్కింది.
పిల్లిని చూసి పక్షి పిల్లలు భయపడి అరవసాగాయి.శత్రువు ఎవరో వచ్చి వుంటాడని గ్రహించిన గ్రద్ద ఎవరా దుర్మార్గుడని గట్టిగా అరిచింది. అప్పుడు పిల్లి "నేను పిల్లినే కానీ మాంసాహారం తినడం మానేసాను. రుద్రాక్ష ధారణ చేసి సాధువుగా బతుకుతున్నాను. మీలాంటి పెద్దల దగ్గర ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలని వచ్చాను. నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి " అని వినయంగా పలుకుతుంది. గ్రద్ద పిల్లి మాటలు నమ్మి తన దగ్గరకు రావడానికి అనుమతి ఇస్తుంది.
అలా రోజూ పక్షులు మేతకు వెళ్లిన తర్వాత పిల్లి చెట్టెక్కి గ్రద్దతో ముచ్చట్లు పెట్టుకుంటూ పక్షులు గూళ్ళకు చేరి చిన్న చిన్న పక్షి పిల్లలను తిని వాటి ఎముకలను గ్రద్ద ఉన్న చెట్టు తొర్రలో పడవేయసాగింది.ఇదంతా గ్రద్ద గుడ్డిది కావడం వల్ల గమనించలేదు పోయింది .
అలా పక్షి పిల్లలు కనబడక పోవడంతో పక్షులన్నీ కలిసి గ్రద్దను నిలదీశాయి. గ్రద్ద తనకేమీ తెలియదని చెప్పింది.కానీ దాని తొర్రలో కనిపించిన పక్షుల ఈకలు, ఎముకలు చూసి గ్రద్దనే ఈ ఘాతుకానికి పాల్పడిందనీ, ఎంతో గౌరవంతో తాము తెచ్చి పెట్టే ఆహారం చాలక పిల్లలను తింటుందా? అనే కోపంతో పక్షులన్నీ కలిసి గ్రద్దను పొడిని పొడిని చంపేశాయి.
ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే కొందరు అపరిచితులు పిల్లి వలె సాధువును,ఎవరికీ అపరాధం చేసే వ్యక్తిని కాదు, కావాలంటే రుద్రాక్ష మాల చూడండి అనే మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ "రుద్రాక్ష బిడాల న్యాయము" ద్వారా మనం గ్రహించవచ్చు.
ప్రతిరోజూ వివిధ ఛానళ్ళు,ప్రసార మాధ్యమాల్లో ఇలా నమ్మించి మోసం చేసేవాళ్ళ సంఘటనలను చూస్తున్నాం. ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే మన రక్షణ కోసం రక్షక భటుల ఫోన్ నెంబర్లను, ఆత్మీయులు, బాగా తెలిసిన వారి నెంబర్లను దగ్గర పెట్టుకోవాలి . ఏమాత్రం తేడాగా అనిపించినా వెంటనే వాళ్ళను పిలుచుకొని అలాంటి వారి ఆట కట్టించాలి ఇదండీ! "రుద్రాక్ష బిడాల న్యాయము" యొక్క కథా కమామీషు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి