నీరు ఊరినట్లు
ఆలోచనలు జలించాలి
చలము నిండినట్లు
తలపులు గుమికూడాలి
ముత్యాలు గుచ్చినట్లు
అక్షరాలను పేర్చాలి
పల్లానికి నీరుపారినట్లు
పదాలను ప్రవహింపజేయాలి
పాలు పొంగినట్లు
కవితలు పొర్లిపోవాలి
దప్పిక తీర్చుకున్నట్లు
కైతలదాహం తీర్చుకోవాలి
హలం దున్నినట్లు
కలం సాగాలి
పాత్రలు నిండినట్లు
పుటలు నిండిపోవాలి
చెట్లు పూచినట్లు
కైతలు మొగ్గలుతొడగాలి
పరిమళాలు వీచినట్లు
కయితలు సౌరభాలువెదచల్లాలి
విరులు విచ్చుకున్నట్లు
కవితలు విప్పారాలి
పూలు పొంకాలుచూపినట్లు
సాహితీసుమాలు చక్కదనాలుచూపాలి
ఉల్లాలు
ఉత్సాహపడాలి
మదులు
మురిసిపోవాలి
కవిత్వం
వెలిగిపోవాలి
సాహిత్యం
ప్రకాశించాలి
కవులు
కుతూహలపడాలి
పాఠకులు
పరవశించాలి
అన్నం వండినట్లు
కవనపచనం చేయాలి
అతిధులకు వడ్డించినట్లు
సాహితీప్రియులకు సమర్పణచేయాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి