న్యాయాలు-674
వత్స క్షీర న్యాయము
*****
వత్స అంటే దూడ లేదా బిడ్డ. క్షీరము అంటే పాలు.
బిడ్డను చూడగానే లేదా తలచుకోగానే తల్లిలో ప్రేమానురాగాలతో కూడిన క్షీర ధారలు పొంగడం అనే అర్థంతో ఈ "వత్స క్షీర న్యాయము" ను ఉదాహరణగా చెబుతుంటారు.
అప్పటి వరకు తల్లిలో అచేతనంగా ఉన్న పాల పొదుగు/ తన బిడ్డను, దూడను తలవగానే లేదా చూడగానే చైతన్యమై క్షీర ధారలు పొంగడాన్ని/ఉబికిరావడాన్ని "వత్స క్షీరము" అంటారు.
ఇది తల్లీ బిడ్డల అనుబంధాన్ని సూచిస్తుంది.బిడ్డ నోరు తెరిచి ఆకలని అడగకపోయినా బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది. వెంటనే బిడ్డ చెంత చేరి స్తన్యాన్ని అందించి ఆకలి తీరుస్తుంది.
బిడ్డ పాలు తాగే వయసులో తల్లి దూరంగా ఏదైనా పనిలో ఉన్నా బిడ్డ గుర్తు రాగానే ఆ తల్లి శరీరంలో మార్పు వస్తుంది. క్షీరానికి సంబంధించిన హార్మోన్లు చైతన్యం కాబడతాయి.వెంటనే బిడ్డ దగ్గరకు వెళ్ళలేని స్థితిలో వుంటే పాలు ధారలుగా స్రవించడం కూడా జరుగుతుంది.
ఇది తల్లీ బిడ్డల మధ్య ఏర్పాటు చేయబడిన అద్భుతమైన, అపురూపమైన బంధం. సృష్టిలో మానవులకు ఒక్కరికే కాదు.పశు పక్ష్యాదులన్నింటిలోనూ ఇలాంటి బంధాన్ని చూస్తాం.
ఆవు లేదా గేదె పాలు తీయాలి అంటే ముందు దూడను తాగిస్తేనే అవి పాలను చేపుతాయి. అప్పుడే వాటి నుంచి యజమానులు పాలు తీసుకోగలరు.
ఒకో సారి వాటి దూడ మరణించినప్పుడు తల్లి ఆవు లేదా గేదె బాధకు లోనవుతాయి. పాలు పిండుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించవు.
అలాంటి సందర్భాల్లో వాటి యజమాని దూడ ఆకారంలో ఉన్న బొమ్మను తల్లి పశువులకు కనిపించే విధంగా ఉంచుతాడు. అప్పుడు వాటిలోని మాతృ ప్రేమకు పాల హార్మోన్లు చైతన్యం పొంది, పాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి.ఆ విధంగా వాటి నుండి పాలను పొందుతుంటారు.
"వత్స క్షీర న్యాయము"లో ఇమిడి ఉన్నది తల్లీ బిడ్డల మధ్య ఉన్న అపూర్వ బంధమే. ఈ విధంగా తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేదని,తల్లికి సాటిగా గల గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకెవరూ వుండరని మనం అర్థం చేసుకోవచ్చు.అలాగే చదువు కోసమో , వృత్తి పరంగానో ఎక్కడో దూరంగా ఉన్న బిడ్డలను అనుక్షణం తలుచుకునే తల్లికి,వారికి ఏ రకమైన యిబ్బంది కలిగినా ఇక్కడ తల్లి మనసును తాకడం.విషయం, సమాచారం ఏమిటో తెలియకుండానే తల్లడిల్లి పోవడం చూస్తుంటాం.
అందుకే తల్లి యొక్క గొప్పతనం, అనుబంధం తెలుసుకొమ్మనీ, ఆత్మీయత విలువ తెలిసి మసలుకొమ్మని, తల్లి దైవంతో సమానమని రాసిన వేమన పద్యాన్ని చూద్దాం.
" తల్లి నెరుగు వాడు దైవంబు నెరుగును/ మన్ను నెరుగు వాడు మిన్ను నెరుగు/మన్ను మిన్నెరిగెనా తన్ను తానెరుగురా/ విశ్వధాభిరామ వినురవేమ"
తల్లి గొప్పతనాన్ని గుర్తించిన వాడు దైవాన్ని కూడా గుర్తిస్తాడని అంటాడు.
అలాగే మానవులకు ఈ భూమి తల్లిలాంటిదని చెప్పిన పద్యాన్ని కూడా చూద్దాము.
"వెలయ భూమి తల్లి విత్తనంబు తండ్రి/పంటలరయ సుతులు పాడి పరము/ ధర్మమే తనపాలి దైవంబు తలపోయ/ విశ్వధాభిరామ వినురవేమ "
మానవులకు ఈ భూమి తల్లి.తండ్రి విత్తనము.పంటలు సంతానం.పాడి స్వర్గము.ధర్మమే దైవము. ధర్మ స్వరూపమైన దైవాన్ని చేరుకోవడానికి తల్లే మూలము.కాబట్టి తల్లిని పూజించమని చెప్పారు.
అలాగే ఈ న్యాయాన్ని ఆధ్యాత్మిక చింతనతో చూసినట్లయితే తల్లి తన బిడ్డను చూడగానే ఏ విధంగా చైతన్యమై స్పందిస్తుందో, అదే విధంగా తనకు ఇష్టమైన రూపంలో భగవంతుని దర్శిస్తూ తద్వారా భక్తిపూర్వకమైన చింతనకు లోనవడం.ఇలా పూజించడాన్ని సగుణోపాసన అంటారు.
అలాగే బిడ్డను తలచుకోగానే (ఎదురుగా లేకున్నా) చైతన్యం పొందినట్లు,విగ్రహారాధన చేయకుండా మనసులో భగవంతుని ధ్యానించడాన్ని నిర్గుణోపాసన అంటారు.
ఈ విధంగా "వత్స క్షీర న్యాయము"ను ఆధ్యాత్మిక దృష్టితో కూడా చూడవచ్చునని భక్తులు చెబుతుంటారు.
ఈ న్యాయము ద్వారా సృష్టిలో మాతృమూర్తి ప్రేమానురాగాలు ఎంత గొప్పవో,తల్లీ బిడ్డల బంధమెంత అపూర్వమైనదో అర్థం చేసుకోగలిగాం.అలాగే భగవంతుడికి,భక్తునికి మధ్య కూడా ఈ"వత్స క్షీర న్యాయము"ను అన్వయించుకోవచ్చని తెలుసుకో గలిగాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి