సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-656
యవ వరాహ న్యాయము
****
యవ అంటే బార్లీ.వరాహ అంటే పంది.
యవల చేను పాడు చేసిన అడవి పంది తప్పించుకోగా వూర పందికి శిక్ష పడ్డట్లు.అనగా "తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడటం"అని అర్థము.
యవ వరాహ న్యాయములో రెండు కోణాలు మనకు కనిపిస్తాయి. అడవి పంది యవల చేను మీద పడి చేనంతా పాడు చేసి పోతుంది. అయితే అదే సమయంలో ఆ ప్రదేశంలో తిరుగుతున్న  ఊర పందిని చూసి అదే చేను పాడు చేసిందని  దాన్ని పట్టుకొని కోపంతో దాని చెవులు కోసేస్తొరు. ఇక్కడ తప్పు చేసింది అడవి పందైతే శిక్ష మాత్రం ఊర పందికి పడింది. తప్పొకరిదైతే, శిక్ష అనుభవించేది మరొకరు. ఇది ఒక కోణం.
 ఇక మరొక కోణంలో చూస్తే ఊరపంది అలా చేను పాడు చేస్తుందా? లేదా ?అనే కనీస స్పృహ, ఇంగిత జ్ఞానం లేకుండా అలా  సంచరించినందుకు శిక్ష వేయడం.
ఇలా చేయడం సబబా? మరి ఇలాంటి సంఘటనలు మన సమాజంలో జరుగుతున్నాయా? లేదా తెలుసుకునే ముందు యవలు,పందుల గురించి నాలుగు విషయాలు విశేషాలూ తెలుసుకుందాం.
యవ అనేది ఒక రకమైన గడ్డిజాతికి చెందిన మొక్క . దీన్ని ఇంగ్లీష్ లో బార్లీ అని అంటారు. పదివేల సంవత్సరాల క్రితమే యురేషియాలో ఈ పంటను పండించారని పరిశోధకుల అధ్యయనంలో తేలింది.ప్రపంచ వ్యాప్తంగా మొక్కజొన్న, బియ్యం, గోధుమల తర్వాత ఈ బార్లీ నాల్గవ స్థానంలో ఉంది.ఈ యవల  ప్రస్తావన ఋగ్వేదంలోనూ,పురాణ గ్రంథాల్లోనూ అనేక సార్లు రావడం  విశేషం.
ఈ యవలు లేదా బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.రక్తపోటు, కొలెస్ట్రాల్,అధిక బరువు తగ్గడానికి పిల్లల్లో మలబద్ధకం వంటి సమస్యలు పోవడానికి  వీటిని వివిధ రకాలుగా ఆహారంగా తీసుకుంటారు.
 ఇక పంది విషయానికి వద్దాం.ప్రాచీన కాలం నుండి ఆహారం, తోలు,ఇతర వస్తువుల కోసం మానవులు వీటిని పెంచుకుంటున్నారు.
ఈ పందుల్లో  గడ్డపు పంది, పెంపుడు పంది లేదా ఊర పంది, పిగ్మీ పంది,అడవి పంది ,జావా పంది అనే జాతులు ఉన్నాయి.
పురాణాలలో విష్ణువు మూడవ అవతారం వరహాతారమే.
ఈ అడవి పందులు పంటలను నాశనం చేయడం,చెట్ల విత్తనాలు, మొలకలు తినడం ద్వారా మానవులకు నష్టం వాటిల్లుతోంది.
యవ వరాహ న్యాయము" ముఖ్యంగా  చెప్పేది ఏమిటంటే"తప్పొకరిదైతే శిక్ష మరొకరికి పడటం.. 
దీనిని మన పెద్దవాళ్ళు ఉటంకించడానికి కారణం కూడా అదే. కేవలం జంతువులే కాదు మనషుల విషయంలో కూడా కొందరు అలాగే చేస్తున్నారని.  ప్రసార మాధ్యమాల్లో అలాంటి సంఘటనలు తరచూ చూస్తూనే ఉన్నామని..అవి కనిపించినప్పుడు,వినిపించినపుడు చాలా బాధ ఆవేదన కలుగుతుంది అపోహ వలన నిర్దోషి శిక్షను అనుభవించవలసి వచ్చింది.
కాబట్టి ఈ న్యాయము ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే ఎప్పుడు కూడా అపోహలకు తావు లేకుండా చూసుకోవాలి.
"వెయ్యి మంది దోషులకు  శిక్ష పడకున్నా ఫర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదని అంటుంటారు .కదా ! అలా మనం కూడా నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరినీ,ఏ విషయంలోనూ నిందించ కుండా ఉండాలి. ఏ వ్యక్తిని అనవసరంగా బాధ పెట్టకూడదు అనేదే ఇందులోని అంతరార్థం.


కామెంట్‌లు