సుప్రభాత కవిత ; -బృంద
పరుగుపెట్టే ప్రవాహంలా
కదిలిపోయే కాలమా
క్షణం కూడా ఆగవే?


అలుపన్నది లేదా నీకు?
గెలుపులేవీ వద్దా నీకు?
మలుపులడ్డు కావా?
పిలుపులేవీ వినపడవా?

కలతలే ఉండవా?
నలతలే కలగవా?
మమతలే లేవా?
మనసే కరగదా?

నలిగిన మనసులకు
నేస్తానివి కావా నీవు!
పగిలిన హృదయఘోష
పరిచయమా నీకు?

మోసమంటే తెలుసా?
మోహాలేం ఉండవా?
పాశాలేం ఉండవా?
పారిపోతుంటావే...!

ఆశించడం ఉండదా?
ఆదరించడం  కుదరదా?
అభిమానం తెలియదా?
ఆప్యాయత అసలు లేదా?

ఎందుకింత కఠినం?
ఎవరిది ఆ శాసనం?
ఎక్కడికి పయనం
ఎంతవరకూ మౌనం?

మాయలోనే మమ్ము ఉంచే
న్యాయమేనా నీది?
కర్మలన్నీ మావేనన్న
ధర్మమే ఖాయమా?

కొత్త వెలుగులు మోసుకొస్తా
వేచి చూడమనే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు