సునంద భాషితం:-వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయములు-680
వృద్ధ వేశ్యా న్యాయము
*****
వృద్ధ అనగా ముదుసలియైన, ముదుసలి,ముసలి, జరతి, మందాకిని. వేశ్యా అనగా వెలయాలు,దేవదాసి, వేలుపు బానిస,వెల యింతి అనే అర్థాలు ఉన్నాయి.
"వృద్ధ వేశ్యా తపస్విని యనునట్లు" అనే సామెతతో పోల్చి చెబుతుంటారు.
 మరి మన పెద్దవాళ్ళు ఎందుకు అలా చెప్పారో దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం.
 వేశ్యా అనగానే  చాలా మంది మదిలో చెడిపోయిన స్త్రీ అనే ఏహ్యభావం కలుగుతుంది.
మరి ఆ వేశ్యా వ్యవస్థ ఎలా వచ్చిందో రేఖామాత్రంగా తడుముకుందాం.
పూర్వ కాలంలో  దేవదాసి, ముర్లీ సంప్రదాయాలు ఉండేవి. అలాగే రాజుల పోషణలో వీరు తమకంటూ ప్రత్యేక జీవితాన్ని గడిపే వారు. మధుర వాణి లాంటి వారు ఆనాటి కాలంలో గౌరవింపబడ్డారు.రాన్రానూ  వారికి ఆదరణ తగ్గింది. సమాజంలో చిన్న చూపు పెరిగింది.ఒక యువతి అలా మారడానికి పురుషుడు కారణమైనా నిందలు, అవమానాలు మాత్రం హ్త్రికే.
 ఇక వృద్ధ వేశ్యా తపస్విని అని ఎందుకు అన్నారో దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చూద్దాం.
ఒకానొక పట్టణమునకు కొంచెం దూరంలో ఓ సన్యాసికి సంబంధించిన ఆశ్రమం ఉండేది. ఆ సన్యాసి సకల శాస్త్ర పారంగతుడు. అతని వద్దకు ఎంతోమంది దేశ విదేశాల్లో ఉన్న భక్తులు వచ్చే వాళ్ళు.అతడి ఆధ్వర్యంలో ఎన్నో యజ్ఞాలు, యాగాలు జరుగుతూ వుండేవి. తన ఆధ్యాత్మిక బోధనలతో జనాలను ఆకట్టుకొనే వాడు.
అతని ఆశ్రమానికి దగ్గరగా ఒక వేశ్యా గృహం ఉండేది. అందులో నివసిస్తున్న స్త్రీ వద్దకు ఎంతోమంది తమ కోరికలు తీర్చుకోవడానికి వెళ్తూ ఉండేవారు.
 అదంతా రోజూ గమనించే ఆ సన్యాసికి ప్రతి క్షణం ఆమె గురించిన  ఆలోచనలే. "ఆమె దగ్గరకు వచ్చే వాళ్ళతో ఎంతో సుఖాన్ని అనుభవిస్తూ ఉంది. జీవితం అంటే అలా భోగభాగ్యాలతో ఉండాలి.అదృష్టం అంటే ఆమెదే కదా! " ఇలా  ఆమెను గురించి ఆలోచిస్తూ ఉండేవాడు.
 అయితే ఆ వేశ్యా స్త్రీ మాత్రం  పవిత్రమైన ఆ సన్యాసి జీవితాన్ని తలుచుకుని తనకు ఇలాంటి 'నీచమైన జన్మ ఇచ్చాడే దేవుడు ' అని వాపోయేది. తన వేశ్య జన్మకు మిక్కిలి చింతించేది.
 అలా ఆ వేశ్యా స్త్రీ మరియు సన్యాసి వృద్ధులు అయ్యారు. సన్యాసిలో  పరివర్తన కలుగలేదు. వేశ్యా స్త్రీ మాత్రం గడిచిన  వదిలేసి తాను అప్పటి వరకు పొట్ట కూటి కోసమే చేసిందని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ క్షమించమని కోరేది.
  పుట్టిన వారికి మరణం తప్పదు  కదా!" ఒకానొక రోజున ఇద్దరూ ఏక కాలంలో మరణించారు.దేవ దూతలు,యమ కింకరులు వచ్చారు. దేవ దూతలు వృద్ధ నారిని స్వర్గానికి తీసుకుని వెళ్ళారు.‌యమ కింకరులు సన్యాసిని నరకానికి తీసుకుని వెళ్ళారు. 
అప్పుడు ఆ  వృద్ధ సన్యాసి "ఇది అన్యాయం, ఇంత వరకు భగవన్నామ స్మరణతో బతికిన నన్ను నరకానికి తీసుకుని పోతారా?" ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఆ వృద్ధ వేశ్యనేమో స్వర్గానికి తీసుకుని వెళ్తున్నారు. ఆమె  ఏ ఒక్కటి మంచి పని చేయలేదు.అపవిత్రమైన జీవితాన్ని  గడిపింది ఆమె కదా! నరకానికి వెళ్ళాలి" అంటూ   వాదన చేసాడు.
 అప్పుడా యమ భటులు   భూలోకం వైపు చూపించాడు. అక్కడ సన్యాసికి భగవన్నామ స్మరణతో ఘనమైన అంతిమ యాత్ర జరుగుతోంది. ఆ వృద్ధ వేశ్యను మాత్రం ఎవరో కొందరు వ్యక్తులు తీసుకుని పోయి స్మశానంలో అనామకంగా పడేసి పోయారు. అలా ఆమెను పట్టించుకున్న వారే లేరు. అది చూసి సన్యాసి ఇప్పటికైనా చూసారా? నేనేమిటో? ఆమె ఏమిటో? అన్నాడు.
 యమ భటులు ఫక్కున నవ్వి అది పైపై మెరుగుల ఫలితం. ఆమె నీలా దైవ నామ స్మరణ చేయలేక పోయానని ప్రతి క్షణం చింతిస్తూ నీ గొప్ప జీవితం గురించి ఆలోచిస్తూ ఉండేది. ఆమె శరీరం అపవిత్రం కానీ మనసు మాత్రం కాదు.అలాగే నీవు నిత్యం దైవారాధన చేస్తూనే  వేశ్య సుఖ భోగాల గురించి ఆలోచించావు. నీకు ఉన్నది నిజమైన భక్తి కాదు." అని మందలించడంతో తప్పు తెలుసుకుని సన్యాసి భటుల వెంట నరకానికి వెళ్ళాడు.
ఇలా వృద్ధురాలైన వేశ్యా స్త్రీ  తపస్విని అయ్యింది.స్వర్గాన్ని పోయింది.
 ఇదండీ! వృద్ధ వేశ్యా న్యాయము "లోని అంతరార్థము. 
అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే వృద్ధ వేశ్య తన వృత్తి పరంగానే  వేశ్య. కానీ మనసు పరంగా ఎంతో పవిత్రమైనది. కాబట్టే ఆమె స్వర్గానికి వెళ్ళగలిగింది. "వృద్ద వేశ్యా న్యాయము" అనే పేరు వచ్చింది.
 ఈ న్యాయం ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే  పొట్ట కూటికై మనం చేసే వృత్తి ఏదైనా  ప్రవృత్తి పరంగా పవిత్రంగా ఉండాలి.అప్పుడే మనిషికి పవిత్రత చేకూరుతుంది. 
అంతే కాకుండా వయసులో ఉన్నప్పుడు తెలిసి తెలియక తప్పులు చేసినా పశ్చాత్తాపం అనేది ఉంటేనే మానవ జీవితం సార్ధకం అవుతుంది.

కామెంట్‌లు