సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-681
వదతో వ్యాఘాత న్యాయము
*****
వద అనగా  మాటలాడు వాడు. వదతో అనగా మాటలాడుచూ.వ్యాఘాత అనగా అంతరాయము అని అర్థము.
తాను చెప్పుచున్న దానికి తానే వ్యాఘాతము తెచ్చికొనునట్లు. అనగా స్వవచన వ్యాఘాతమని తాత్పర్యము. తాను చెప్పే విషయాన్ని తానే ఆటంక పరచుకోవడం. సంశయంగా స్పందించడం అని అర్థము.
ఉదాహరణకు "నేనిపుడు బతికి  ఉన్నానా?బతికి ఉన్నానో లేదో? ఇలాంటి  భావోద్వేగ  సందిగ్ధతను "వదతో వ్యాఘాత న్యాయము"తో పోల్చి చెబుతారు.
 మరి అలాంటి ఉద్వేగ లేదా ఉద్విగ్న , విరక్తితో కూడిన సంశయ పరిస్థితులు ఎప్పుడెప్పుడు వస్తాయో మనందరికీ తెలుసు.
ఏదైనా సమస్యతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్నప్పుడు, ఎవరైనా ఏదైనా మనసుకు నచ్చని విధంగా ప్రవర్తించినపుడో, మాటలు ,చేతలతో హృదయాన్ని బాధ పెట్టినపుడు, అమాంతంగా పరిస్థితులు తారుమారైపోయి మనిషినీ మనసునూ అగాధం లాంటి సందర్బంలోకి నెట్టి వేసినప్పుడు ఇదిగో ఇలాంటి ఆలోచనలే మనసుకు మబ్బులా ముసురుతాయి. ఆ మబ్బు వీడనంతవరకూ మనిషి మనిషిగా నిలువలేడు.
 అలాంటి సమయంలోనే ఇలాంటి ప్రశ్నలు మనసును కుమ్మరి పురుగులా తొలుస్తూ వుంటాయి. ఎవరికీ చెప్పుకోలేని స్థితి. చూసేవారికి తెలియదు. విషయమంతా చిన్నదిగా దూరపు కొండలా కనిపిస్తుంది. భరించే వాడికే బరువు తెలుస్తుందన్నట్లు, బాధను అనుభవించే వారికే ఆ వేదన బరువు ఎంతో తెలుస్తుంది.
 దీని కంతటికీ కారణం మనస్సే.మనసే మన మిత్రుడు. మనసే మన శత్రువు.బాధల్ని కొందరు బావిలో నీటిలా తోడుకుంటూ వుంటారు. వాటినే పట్టుకొని మనసు గబ్బిలంలా వేలాడుతూ వుంటుంది.దీనికంతటికీ కారణం మనసే.అందుకే పెద్దలు ఈ మాట తరచూ చెబుతూ భగవద్గీత శ్లోకాన్ని  ఉటంకిస్తూ ఉంటారు.అదేంటో చూద్దాం.
బంధురాత్మాత్మ నస్తస్య యేనాత్మైవాత్మనాజితః!/అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్!"
అనగా మనస్సును జయించిన వారికి అది వారి మిత్రుడు.అలా చేయలేని వారికి మనస్సు ఒక శత్రువు వలె పని చేస్తుంది.
 అతి పెద్ద శత్రువులైన కామము, క్రోధము, లోభము, ఈర్ష్య, భ్రాంతి మనిషిలో ఉంటాయి. ఈ అంతర్గత శత్రువులు బాహ్యమైన వాటి కన్నా ఎంతో హానికరమైనవి. ఇవే తాను విషం తాగి ఎదుటివాడు  చనిపోవాలని కోరుకోవడం లాంటిది.
ఇక "నేను అవమానింపబడ్డాను.నిందించబడ్డాను.దండించబడ్డాను,దోచుకోబడ్డాను" అనుకోవడమేమో అంతం కాకుండా చేసే దుఃఖానికి కారణం అవుతుంది.
మనసు రెండు వైపులా అత్యంత శక్తివంతమైన పదునైన కత్తి వంటిది. దానిని "నిరాశ నిస్పృహల చిలుము పట్టించడమా? లేదా మన తలరాతను మార్చుకొనే ఆయుధంగా మార్చుకోవడమా?" అనేది మనపైనే ఆధారపడి ఉంటుందనేది గ్రహించాలి.
కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ..
"ఉద్దరేదాత్మ నాత్మానాం నాత్మానమవ సాదయేత్!/ఆత్మైవ హ్యాత్మనో బంధుఃఆత్మైవ రిపురాత్మనః!"/
 మనసు యొక్క శక్తి చేత ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి.అంతేకానీ పతనమై పోవద్దు.ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు.ఉన్నతికి మరియు పతనానికి మన మనసే కారణం. అంతరంగానికి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ..ఈ నాలుగు వేర్వేరు అస్థిత్వాలు కావు.ఇవి అంతరంగం యొక్క నాలుగు నిర్వహణా స్థాయిలు. వీటిలో బుద్ధిని ఉపయోగించుకుని మనస్సును నియంత్రించాలి. అప్పుడే "వదతో వ్యాఘాతము" నుండి బయట పడవచ్చు.
 ఇదండీ "వదతో వ్యాఘాత న్యాయము" యొక్క అంతరార్థము. ఈ విషయాలను గమనంలో పెట్టుకొంటే ఎవరికి వారే బయటపడ వచ్చు. అంతే కదండీ!

కామెంట్‌లు