సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
న్యాయాలు-663
టిట్టిభ న్యాయము
*****
టిట్టిభం అనేది ఒక పక్షి. దీనినే కాటుక పిట్ట లేదా లకుముకి పిట్ట అంటారు. ఇది పక్షి జాతిలో చిన్న పక్షి. 
అలాంటి పక్షి న్యాయము ఏమిటబ్బా అనిపించవచ్చు.
కానీ పక్షి చిన్నదైనా దాని పట్టుదల,సంకల్ప బలం ముందు సముద్రుడంతటి వాడు ఎలా వినయంగా తలొంచాడో చెప్పిన న్యాయమే టిట్టిభ న్యాయము.
టిట్టిభం జంట సముద్ర తీరంలో గూడు కట్టుకుని నివసిస్తున్నది. ఆడ టిట్టిభం గుడ్లు పెట్టింది. అవి పిల్లలుగా మారే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది.
ఓ రోజు ఆ జంట ఆహారం కోసం బయటికి వెళ్ళింది.ఆ సమయంలో పెద్దగా, ఉద్ధృతంగా సముద్రపు అల వచ్చింది.అది గూటిలోని గుడ్లను సముద్రంలోకి  తీసుకుని పోయింది.
ఆడ టిట్టిభం తిరిగి వచ్చేసరికి  గూటిలో గుడ్లు లేవు. టిట్టిభానికి అంతులేని దుఃఖం వచ్చింది. కాబోయే బిడ్డలు అలా సముద్రంలో కొట్టుకుపోయే సరికి విపరీతమైన బాధ కలిగింది దానికి. ఏం చేయాలో బాగా ఆలోచించింది.
ఈ సముద్రం నీరంతా తోడిపోస్తే తన గుడ్లు దొరుకుతాయని అనుకున్నది.
అనుకున్నదే తడవుగా ఆ బుజ్జి పిట్ట తన ముక్కుతో సముద్రం నీటిని పీల్చి ఒడ్డు  అవతల వదిలి పెట్టసాగింది. 
"సముద్రం ముందు ఆ పిట్ట ఎంత? అది చేసే పని అసలు సాధ్యమవుతుందా?" పిట్ట బాధను చూడలేక ఇతర పిట్టలు కూడా సహాయానికి ముందుకు వచ్చాయి. అవి కూడా వాటి ముక్కులతో సముద్రం లోని నీళ్ళను తోడి అవతల పోయసాగాయి.
ఇలా పక్షి జాతులు అన్నీ తండోపతండాలుగా వచ్చి ఈ పనికి సాయం చేయసాగాయి. ఈ విషయం పక్షుల రాజైన గరుత్మంతుని వరకు వెళ్లింది. గరుత్మంతుని ఆజ్ఞతో లక్షలాది పక్షులు వచ్చి సముద్రం లోని నీళ్ళను తోడసాగాయి.
తన తీరంలో జరుగుతున్న ఈ నీళ్ళు తోడే మహా యజ్ఞాన్ని సముద్రుడు గమనించాడు.ఒక చిన్న పక్షి పట్టుదల ఎంత గొప్పదో కళ్ళారా చూశాడు.విషయం తెలుసుకుని తన అలతో కొట్టుకుపోయిన గుడ్లను జాగ్రత్తగా తీసుకుని వచ్చి  టిట్టిభానికి అందించాడు.టిట్టిభం సంకల్ప బలానికి సంతోషించి వినయంగా దాని ముందు తల వంచాడు. 
"పిట్ట కొంచెం కూత ఘనం" అంటారు కదా! కూతే కాదు దాని సంకల్ప బలం కూడా ఎంత గొప్పదో ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.
సంకల్ప బలం ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది అంటారు పెద్దలు. అనుకున్నది సాధించాలి అనుకుంటే మనలో  ఉండాల్సింది 'ఉడుం పట్టు లాంటి పట్టుదల, శ్రమించే తత్వం, సంకల్ప బలం' అంటారు స్వామి వివేకానందుడు.
సంకల్ప బలం వల్లనే భగీరథుడు గంగను భువికి తీసుకుని వచ్చాడు. ఏకలవ్యుడు తిరుగులేని వీలుకాడు అయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే  నాడు నేడు కోకొల్లలుగా జీవిత గాథలు ఉన్నాయి.
టిట్టిభం వంటి  సంకల్పబలంతో  మనమూ అనుకున్నవి సాధిద్దాం."టిట్టిభ న్యాయానికి" న్యాయం చేద్దాం.

కామెంట్‌లు