న్యాయాలు -659
మా సాహస శకుని న్యాయము
******
మా అంటే లక్ష్మి,కొలుచుట,శబ్దించుట,పోల్చుట,లోపల ఇముడుట.సాహస అనగా తెగువ,దండోపాయము,శకుని అనగా పెద్ద పక్షి,ఒక కరణము, దుర్యోధనుని మేనమామ అనే అర్థాలు ఉన్నాయి.మా సాహసం అంటే అతివేగం మరియు తొందర పడకండి అని కూడా అంటారు..
మా సాహస శకుని న్యాయములో రెండు పక్షులకు సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం.
" అలాగే ఈ "మా సాహస శకుని న్యాయము"లో రెండు కోణాలు ఉన్నాయి. అవి చూసే ముందు శకుని అనే పక్షి గురించి తెలుసుకుందాం.
కాకులలో చాలా రకాల కాకులు వున్నాయి. జెముడు కాకి, బొంత కాకి లేదా మాలకాకి..అయితే వేదాల్లో మాల కాకి (Raven)ని కృష్ణ శకుని అంటారు.దీనినే "అసుర కాకోలం" అని కూడా పిలుస్తారు.
ఈ కృష్ణ శకుని పక్షులు చాలా బలిష్టంగా ఉంటాయి.ఇవి ఎంత బలమైనవంటే బలహీనమైన పక్షులు, జంతువులను, అప్పుడే పుట్టిన దూడలను, గొర్రె పిల్లలపై ఏమాత్రం అవకాశం దొరికినా అమాంతం దాడి చేసి చంపి తింటాయి.ఇలా పశువులను చంపి వేయడం వల్ల వీటిని మృత్యువుకు ప్రతి రూపాలుగా ఉన్నాయని భావించి వీటిని యమ దూతలు అని కూడా పిలుస్తారు.ఇది యముని దూతలలో చాలా ముఖ్యమైనదనీ,శనికి వాహనం అని అంటారు. ఈ విధంగా ఇవి తెగువ,సాహసం,బలం, శక్తి కలవనీ,వీటిని మృత్యు దేవత రూపాలని కూడా అంటారని తెలుసుకున్నాం.
ఇక రెండో రకం పక్షి కులింగ పక్షి. దీనిని భూలింగ పక్షి అని కూడా అంటారు. దాని అరుపు లేదా శబ్దం "మా సాహసం కురు" అన్నట్లుగా ఉంటుందట. "మా సాహసం కురు" అంటే "సాహసోపేతమైన లేదా తెగువతో కూడిన పనులు చేయవద్దు" అని అర్థము.
ఒకానొక స్వామీజీ అయిన లండన్ స్వామి నాధన్ గారు ఈ కులింగ పక్షి గురించి ఆసక్తికరమైన పరిశోధనా వ్యాసం రాశారు .అది చదువుతుంటే చాలా విషయాలు తెలిశాయి. లండన్ లో వారు "కల్కి పురాణము"ను చదివినప్పుడు వారిని ఆకర్షించిన వాక్యాలు ఇలా వున్నాయని రాశారు."కలియుగంలో కొంతమంది గురువులు రోజూవారీ ఆచారాలన్నిటినీ మరిచిపోతారు. కానీ ఇతరులకు వాటిని చేయమని సలహా ఇస్తారు మరియు కులింగ పక్షులలా ప్రవచిస్తూ ( ఎగిరి) బోధిస్తారు." అంటే ఇతరులకు నీతులు బోధిస్తారు కానీ తాము బోధించే నీతులను తాము మాత్రం అనుసరించరు" .. ఈ వాక్యాలు తనను బాగా ఆకట్టుకున్నాయని అంటారాయన .
ఇక వేదాంత దేశికన్ అనే తమిళ సాధువు తాను రాసిన "దయా శతకం"లో రాసిన ప్రసిద్ధ శ్లోకాన్ని చూద్దాం . ఇందులో పై విషయాన్ని ఉటంకిస్తూ ఇలా రాశారు.
" మా సాహసోక్తి గానా కంచుక వాంఛితానియః/పశ్యస్తు తేషు విదధామ్యతి సాహసాని/ పద్మా సహాయ కరుణే న రుణాస్తి కిం త్వమ్!!/ ఘోరం కులింగం శకునేరివ చేష్టితం మే"
అనగా ఓ దయా దేవి! గ్రంథాలకు విరుద్ధమైన భయంకరమైన చర్యలలో పాల్గొనవద్దని నేను ఇతరులకు బోధిస్తాను. కానీ అలా సలహా ఇచ్చిన తర్వాత నేనే వారి ముందు పనికిమాలిన పనులకు పాల్పడతాను. ఉపన్యాసములు ఇచ్చిన తర్వాత వారిని మోసం చేస్తూ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాను.ప్రమాదకరమైన చర్యలకు పాల్పడవద్దని ఇతరులను హెచ్చరించే కులింగ పక్షి వంటిది నా చర్య. సింహం మాంసాహారం తిన్న తరువాత ఆవులించి నోరు విశాలంగా తెరిచినప్పుడు కులింగ పక్షి లోపలికి దూసుకెళ్ళి పళ్ళకు అంటుకున్న మాంసం ముక్కలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తుంది. ఏ క్షణంలోనైనా సింహం నోరు మూసిందో వెంటనే ఆ పక్షి చనిపోయే ప్రమాదముంది. కాబట్టి ఓ దయా దేవి! నేను వ్యతిరేకంగా ప్రబోధించే ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయకుండా నన్ను నిరోధించడం నీ కర్తవ్యం.అంటూ రాసిన శ్లోకాన్ని స్వామి నాధన్ గారు తన పరిశోధన పత్రంలో రాస్తూ చివరికి ఓ మాట అంటారు. అది ప్రతి ఒక్కరూ గమనంలో పెట్టుకోవాలి. "మన చుట్టూ సమాజంలో అలా ఒకరికి నీతులు చెబుతూ తాము ఆచరించని వారు స్వాములు, బాబాలు స్వామీజీలు, గురువుల పట్ల అప్రమత్తంగా ఉండండి "అంటారు.
ఈ "మా సాహస శకుని న్యాయము" లోని పై రెండు కోణాలు పరిశీలించిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే బల గర్వితులుగానో, మోసకారులుగానో ఉన్న వారి వల్ల కలిగేది మంచి కాదు.ఎల్లప్పుడూ ఇతరులకు కలిగేది అన్యాయం,బాధనే. అలాగే ఇతరులకు నీతులు చెప్పేవారిలో కొందరు తాము మాత్రం పాటించరు. అలాంటి వారి వల్ల అప్రమత్తంగా ఉండాలి.ఇదే ఈ న్యాయములోని సారాంశం, అంతరార్థము. కాబట్టి ఈ విషయాలన్నీ గమనంలో పెట్టుకుందాం.
సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి