సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -673
లోహ ఘట న్యాయము
******
లోహం అనగా  ఖనిజము నుండి పుట్టినది, ధాతువు , ఎఱ్ఱనిది,రాగిది,ఇనుపది,రాగి, ఇనుము, ఉక్కు, బంగారము, నెత్తురు,, ఆయుధము,గాలము, ఎఱ్ఱ మేక అనే అర్థాలు కలవు.ఘట అనగా మట్టితో చేసిన కుండ,కూజా, నీరు పోసుకును పాత్ర, కుంభరాశి, ఏనుగు కుంభ స్థలము, ఉచ్ఛ్వాస నిశ్శ్వాసములను నిలుపు చేయుట, ఇరువది ద్రోణముల పరిమాణము అనే అర్థాలు ఉన్నాయి.
లోహపు కుండవలె. "ఇనుప కుండకు రాతి తెడ్డు అన్నట్లు"
 లోహపు కుండవలె అంటే ఇంతకూ  ఏ లోహపు కుండవలె? అనే   అనేక సందేహాలు మన మనసును తొలుస్తుంటాయి.మరి ఏ లోహం గట్టిగా వుంటుంది? ఏ లోహము మెత్తగా వుంటుంది?.. ఈ సందేహాలకు సమాధానం కావాలంటే లోహాల గురించి కొంత సమాచారం తెలుసుకోవాల్సిందే.
 లోహాలలో ద్యుతి గుణం( మెరిసే గుణం) కలిగిన లోహాలు, ధ్వని గుణం కలిగిన లోహాలు,ద్యుతి గుణం లేని లోహాలు అని మూడు రకాలు ఉన్నాయి.గట్టి లేదా అత్యంత కఠినమైన, బలమైన లోహాలలో ప్రధానంగా 10 లోహాలు ఉన్నాయి.అవి1.టంగస్టన్.2.క్రోమియం.3.టైటానియం.4.గాడోలినియం.5.ఇనుము.6.వెనాడియం.7.లుటెటియం.8.జిర్కోనియం.9.ఓస్మియం.10.టాంటాలమ్.
ఇక మృదువైన లోహాలలో  అల్యూమినియం,రాగి మరియు సీసమును చెప్పుకోవచ్చు.
ఇలా రెండు రకాల లోహాలలో అత్యంత గట్టిగా ఉండే లోహంతో తయారు చేసిన కుండ కూడా ఎంత బలంగా ఉంటుందో మనం వేరే చెప్పక్కర్లేదు.
మరి ఈ "లోహ ఘట న్యాయము" ను మన పెద్దలు వ్యక్తులకు అన్వయిస్తూ ఉదాహరణగా ఎందుకు చెప్పి వుంటారో చూద్దాం.
శరీరమనే కుండ ధృడంగా ఉండాలి. అంటే ఉక్కులానో పైన పేర్కొన్న పది రకాల లోహాల్లో ఒక లోహంలానో ఉండాలి. అలా ఉంటేనే కాల గమనంలో అనేక రకాల ఆటుపోట్లు, సమ్మెట దెబ్బ లాంటి కష్టనష్టాలను భరించగలదు .అలా శరీరం ఎప్పుడైతే ధృడంగా శక్తివంతంగా పనిచేస్తుందో అందులోని నీరు వంటి ఆత్మ కూడా నిబ్బరంగా ఉంటుంది " అనే అర్థమును దృష్టిలో పెట్టుకొని మన పెద్దవాళ్ళు ఈ "లోహ ఘట న్యాయము" వలె ఉండాలని చెప్పారు.
 ఇక దీనిని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే మన దేహం 'మట్టి కుండ' లాంటిది. మట్టి కుండ చివరికి మట్టిలోనే కలిసిపోతుందని మనకు తెలిసిందే.
ఈ సత్యాన్ని వివరించడానికి మరణించిన వారి అంత్యక్రియల గురించి చెబుతుంటారు.  మరణించిన వారి అంత్యక్రియలు పూర్తి చేసే ముందు... శవాన్ని  దింపుడు కళ్ళం దగ్గర ఒకసారి దింపుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆత్మ  జీవత్వం పొంది మళ్ళీ దేహంలోకి ప్రవేశించిందో ఏమోనని ఆశ లేదా అనుమానంతో  మూడు సార్లు శవం చెవి దగ్గర చేరి పిలుస్తారు.
ఇక శరీరాన్ని  ఘటం లేదా కుండ అనుకున్నాం కదా  మరి ఈ దేహ ఘటంలోని నీరు ఆత్మ అన్నమాట. ఆ ఆత్మ అనే నీరు మెల్లగా దేహ కుండ లోంచి బయటకు వెళ్ళేందుకు చితి చుట్టూ తిరిగే వ్యక్తి భుజం మీద ఉన్న నీటి కుండకు చిల్లులు పెడతారు . అలా చితి చుట్టూ తిరుగుతూ వుంటే సన్నధార ద్వారా శరీరం నుంచి ఆత్మ నెమ్మదిగా బయటికి వెళ్ళి పోతుంది. నీరంతా బయటకు వచ్చిన తర్వాత కుండను పగులగొడతారు. ఆ తర్వాత శవాన్ని దహనం చేస్తారు. ఇక ఆత్మకు ఈ లోకంలో శరీరం లేదు వెళ్ళిపొమ్మని అర్థము.
 మన పెద్దవాళ్ళు తరచుగా "ఈ ఘటము ఉన్నంత సేపే ఈ బంధాలు అనుబంధాలు" అనడం మనం వింటుంటాం.అంతే కాదు "ఇనుప కుండకు రాతి తెడ్డు" అంటే బలమైన ఇనుప కుండలా ప్రతి ఒక్కరూ ఉండాలి.
ఇలా ఈ న్యాయమును రెండు రకాల అర్థాలతో చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మనమైతే లోహ ఘటంలా మన మనసు, శరీరం రెండూ ధృడంగా అన్నింటినీ తట్టుకునేలా ఉండాలని కోరుకుందాం. అంతే కదండీ! 


కామెంట్‌లు