ఎవరైనా కావొచ్చు
మీరో లేక వారో
ఎగిరే పక్షుల రెక్కల ఆకాశం
చెట్టు రాగమాల
నీలోనో నాలోనో మరెవరిలోనో
సంగీతం మీటే అనంతం
నీవూ వారూ ఓ ప్రశ్నగావొచ్చు
'ఎవరు నీవు' శేష ప్రశ్నగా వొచ్చు తిరుగు టప్పా
అతడు మాట్లాడడం కళ
ఇతడు మాట్లాడకపోవడం కవిత
నడుమ నడమ మౌనం మాట్లాడింది
మారు పేరు తళతళలాడే ఆకాశం
మరో పేరు కలకలంరేపే భూకంపం
అంతా చలనాచలనాల సంత
ఎక్కడో వారు
సందిగ్ధంలో వీరు
ఉద్విగ్నం ఉత్తేజం కరువై
పనిని చేసే పనిలో క్షణం తీరిక లేనివారు
వర్ణన అభివ్యక్తి నిర్వచనం సమస్తం వీరే
వెన్నెల పరుచుకున్న చీకటి
వేకువ చూడని రేపటి రేచీకటి
జనారణ్యం చెక్కిన బతుకు ఒంటరి
వీరు ఎవరు
నేనో నీవో వారో వీరు ఎవరైనా కావొచ్చు
ఊపిరితిత్తులు శ్వాసించే గీతాలు
ప్రవాహ కాంతి తరంగాలు
భావోద్వేగాలు కురిసే లోపలి వాన
ప్రశ్నించే ప్రపంచాన
వీరూ వారూ ఎవరైనా... అంతా
ప్రకృతి పరుచుకున్న రెక్కల అంతరంగాలే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి