సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -664
మేరు సర్షప న్యాయము
*****
 మేరు అనగా మేరు పర్వతము, బంగారు కొండ, రుద్రాక్ష మాలలోని నడిమి పూస,మధ్యమణి.సర్షప అనగా ఆవాలు అని అర్థము.
 "మేరు సర్షప న్యాయము"లో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి మేరు పర్వతమంత సృష్టి అతి చిన్న ఆవగింజలో యిమిడి వుందని అర్థము.
 అతి చిన్న ఆవగింజ గొప్ప తనం, ఉపయోగాల గురించి ముందుగా తెలుసుకుందాం.
ఆవాల గింజలు చిన్నగా గుండ్రంగా తెలుపు,నలుపు రంగులో ఉంటాయి.ఈ ఆవాలతో నూనె కూడా తయారు చేస్తారు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.అందుకేతీవ్రమైన చలికాలంలో ఆవనూనెతో శరీరాన్ని మర్ధనా చేస్తుంటారు. ఇక వంటకాల విషయానికి వస్తే మామిడి కాయ ఊరగాయలో ఆవాల పొడి కలపడం మనందరికీ తెలిసిందే. అమెరికా లాంటి దేశాల్లో ఆవపిండిని సుగంధ ద్రవ్యాలు మరియు మసాలా దినుసుల్లో ఉపయోగిస్తారు.
ప్రపంచ సాహిత్యంలోనూ, మత గ్రంథాలలోనూ ఆవగింజల ప్రస్తావన ఉంది. ఆవగింజకి సంబంధించిన మొదటి కోణంలో  గౌతమ బుద్ధుడి కథను చూద్దాం.
ఒక సారి ఒక తల్లి మరణించిన తన ఏకైక కుమారుడిని బుద్ధుడి దగ్గరకు తీసుకొని వెళ్ళి ఎలాగైనా బ్రతికించమని ప్రాధేయపడుతుంది.మరణించిన వాడు బతకడం అసాధ్యం. ఆమెకు ఆ విషయం చెబితే తట్టుకోలేదు.కాబట్టి ఆమెంతట ఆమే తెలుసుకునేలా  ఓ మాట చెబుతాడు " బిడ్డ, భర్త, భార్య, తల్లిదండ్రులు లేదా స్నేహితుడిని ఎన్నడూ కోల్పోని ఇంటి నుంచి "కొన్ని ఆవాలు" తీసుకుని వస్తే బిడ్డను బ్రతికించగలను " అంటాడు. అప్పుడు ఆ తల్లి తనుండే గ్రామంలో ఇల్లిల్లూ తిరిగి అడిగితే ప్రతి ఇల్లూ ఎవరో ఒకర్ని కోల్పోయిన వారిదే అయివుంటుంది. అలా ఆమె "మరణం అందరికీ సాధారణం , తప్పదు" అని గ్రహిస్తుంది.
 ఇలా ఓ ఆవగింజ జీవితం ఎలాంటిదో తెలుసుకునేలా చేస్తుంది.
 దీనికి సంబంధించిన మరో ఆసక్తికరమైన కథ ఉంది. 
" విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత"అని వేమన గారు అన్నట్టు  పురాణ గాథలలో ఆవగింజ యొక్క గొప్పతనం గురించి సద్గురువులు  "మేరు పర్వతమును ఆవగింజలో పట్టించవచ్చు." అని తరచూ ఉటంకిస్తూ ఉంటారు. మేరు పర్వతమే చాలా పెద్దది కదా అంత పెద్ద పర్వతం ఆవగింజలో ఎలా యిముడుతుంది? అనే ప్రశ్న అందరిలో ఉదయిస్తుంది.దీనికి మన పెద్దవాళ్ళు చెప్పిన కథ...
టాంగ్ రాజవంశం పాలించే సమయంలో చదువంటే ఇష్టపడే లిటో అనే వ్యక్తి ఉండేవాడట.అతడు పదివేలకు పైగా గ్రంథాలు చదివాడు.అందువల్ల అతడిని అందరూ "పదివేల గ్రంథాల లీ" అని పిలిచేవారు.
అతడు ఒకసారి జిజాంక్ అనే సన్యాసిని కలిసినప్పుడు అతడితో "అయ్యా! సుమేరు పర్వతాన్ని ఆవగింజలో పట్టించవచ్చని విమలా కీర్తి నిర్దేశ సూత్రాల్లో ఒక భాగంలో రాసి ఉంది.అంతటి పెద్ద పర్వతం ఒక చిన్న ఆవగింజలో ఎలా యిముడుతుంది?" అడిగాడట.
అప్పుడు ఆ సన్యాసి నిన్ను అందరూ 'పదివేల గ్రంథాల లీ ' అంటారు కదా! మరి 10,000గ్రంథాలు నీ చిన్న బుర్రలో ఎలా పట్టాయి? అన్నాడట.
అంటే ఇక్కడ ఆవగింజ మన మనస్సు. అందులో అనంతమైన జ్ఞానం ఇమిడి ఉంది. మేరు పర్వతం అంత జ్ఞానాన్ని మనసులో ఇముడ్చుకోవచ్చు" అని అర్థము.
 ఇలా రెండు కోణాల్లో "మేరు సర్షప న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.మేరు పర్వతం అంత ఆకారం ,తెలివి తేటలు ఎన్ని వున్నా మరణం తప్పదు. అలాగే మనసనే ఆవగింజలో మేరు పర్వతం అంత జ్ఞానం ఇమిడి ఉంది." ఇంకా తేలికగా అర్థం చేసుకోవడానికి చక్కని ఉదాహరణ ఈరోజు అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం. అతి చిన్న చిప్ ద్వారా ప్రపంచాన్ని కళ్ళముందు నిలిపే విజ్ఞానం" ఇవన్నీ  చెప్పుకోవచ్చు. 
అందుకే  ఆవగింజ లాంటి మన మనస్సు ను  మేరు పర్వతమంత విజ్ఞాన కేంద్రంగా నూతన ఆవిష్కరణలు చేద్దాం. ఇదండీ! "మేరు సర్షప న్యాయము" లోని అంతరార్థము.

కామెంట్‌లు